
సన్న బియ్యం టెండర్లు ఖరారు
సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి అవసరమైన సన్న బియ్యం కొనుగోలుకు టెండర్లు ఖరారయ్యాయి.
- శనివారం అర్ధరాత్రి వరకు జరిగిన ప్రక్రియ
- స్వయంగా పరిశీలించిన కమిషనర్ సీవీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి అవసరమైన సన్న బియ్యం కొనుగోలుకు టెండర్లు ఖరారయ్యాయి. ఈనెల 2వ తేదీన 15 వేల మెట్రిక్ టన్నుల బియ్యం కొనుగోలు కోసం టెండర్లు పిలిచారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఆ టెండర్లను మిల్లర్లు, అధికారులు, మీడియా సమక్షంలో తెరిచారు. టెండర్లలో మొత్తం 25 మంది మిల్లర్లు పాల్గొనగా, 18 మంది అర్హత సాధించారు. జాతీయ స్థాయి టెండర్లు కావటంతో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి కూడా మిల్లర్లు టెండర్లలో పాల్గొన్నారు. రూ.38.52కు ఎల్1 టెండర్ దక్కించుకోగా, ఆ మిల్లర్‌తో పౌరసరఫరాల శాఖ కమిషనర్ సి.వి.ఆనంద్ సంప్రదింపులు జరిపారు. అనంతరం కిలో సన్న బియ్యం సరఫరా చేయడానికి రూ.38.50 చొప్పున కొనుగోలుకు టెండర్ ఖరారు చేశారు.
తప్పిన భారం..
వాస్తవానికి సన్న బియ్యం కొనుగోలుకు ఆగస్టు 6నే టెండర్లు పిలిచారు.19 మంది మిల్లర్లు ఇందులో పాల్గొనగా 14 మంది అర్హత సాధించారు. గత నెల 23న తెరిచిన టెండర్లలో రూ.42.11 ధరకు ఎల్1 వేసిన టెండర్‌పై సంప్రదింపుల తర్వాత రూ.39.96కు అంగీకారం కుదిరింది. కానీ ధర ఎక్కువగా ఉండటంతో అధికారులు ఆ టెండర్‌ను రద్దు చేశారు. దాంతో ఈ నెల 2న తిరిగి టెండర్లు ఆహ్వానించి 17వ తేదీ రాత్రి తెరిచారు. ఈ సందర్భంగా మిల్లర్లతో సంప్రదింపులు జరిపిన కమిషనర్ సి.వి.ఆనంద్ వారి వ్యాపార పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. టెండర్ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.