హైదరాబాద్ : మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు హైదరాబాద్ నుంచి తరలి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలను రూపొందించింది. హైదరాబాద్ నుంచి వెళ్లడంతో పాటు, మేడారం నుంచి తిరిగి వచ్చేందుకు రిటర్న్ జర్నీ సదుపాయాన్ని అందుబాటులోకి తేనుంది. ఫిబ్రవరి 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ప్రతి రోజు 50 బస్సుల చొప్పున నడుపనున్నట్లు ఆర్టీసీ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగరాజు తెలిపారు.
గురువారం మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ గంగాధర్‌తో కలిసి మేడారం జాతర ప్రత్యేక బస్సుల వివరాలను వెల్లడించారు. ఈ బస్సులకు అడ్వాన్స్ బుకింగ్ సదుపాయం ఉంటుంది. ఫిబ్రవరి 17,18,19 తేదీల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న దృష్ట్యా ఆ మూడు రోజుల్లో ప్రయాణికుల డిమాండ్ మేరకు బస్సుల సంఖ్యను పెంచనున్నట్లు చెప్పారు. అలాగే కొంతమంది ప్రయాణికులు కలిసి పూర్తిగా ఒక బస్సును బుక్ చేసుకుంటే ప్రయాణికులు ఉన్న చోట నుంచే బయలుదేరి వెళ్లవచ్చు.
నగరంలోని మహాత్మాగాంధీ, జూబ్లి, దిల్‌సుఖ్‌నగర్ బస్‌స్టేషన్‌లు, జగద్గిరిగుట్ట, ఉప్పల్ రింగు రోడ్డు నుంచి మేడారం స్పెషల్ బస్సులు రాకపోకలు సాగిస్తాయి. ఏసీ, సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులను నడుపుతారు. ప్రయాణికులు తమకు నచ్చిన బస్సుల్లో బయలుదేరి వెళ్లవచ్చు. నేరుగా గద్దె వరకు బస్సులు వెళ్తాయని ఈడీ పేర్కొన్నారు. ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణ చార్జీలపైన యధావిధిగా 50 శాతం అదనంగా తీసుకుంటారు.
ఆదివారాల్లో కూడా.....
అలాగే, జాతరకు ముందే ప్రయాణికులు మేడారం సమ్మక్క.సారలమ్మలను దర్శించుకొనేందుకు ఆర్టీసీ ప్రతి ఆదివారం ప్రత్యేక బస్సులు నడపనుంది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఈ ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయి. ఉదయం 6 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 11 గంటలకు మేడారం చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 5 గంటలకు మేడారం నుంచి బయలుదేరి రాత్రి 10 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
హైదరాబాద్ నుంచి మేడారంకు చార్జీల వివరాలు :
బస్సు చార్జీలు - పెద్దలకు, పిల్లలకు (రూపాయలలో)
ఏసీ : రూ.552, రూ.432
సూపర్ లగ్జరీ : రూ.447, రూ.247
ఎక్స్‌ప్రెస్ : రూ.337, రూ.187
-ప్రయాణికులు అడ్వాన్స్ బుకింగ్ 'www.tsrtconline.in' వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు.
-నగరంలోని ఆర్టీసీ అధీకృత టిక్కెట్ బుకింగ్ ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకోవచ్చు.
-మేడారం జాతర బస్సులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఫోన్ : 9959226257, 9959224910, 040-27802203, 738201686 నెంబర్లను సంప్రదించవచ్చు.
రాజధాని నుంచి 'మేడారం'కు రోజుకు 50 బస్సులు
Published Thu, Feb 4 2016 8:28 PM | Last Updated on Sun, Sep 3 2017 4:57 PM
Advertisement