మీ పాలన ఆధారంగా ఓట్లడిగే దమ్ముందా?
బాబుకు వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సవాల్
సాక్షి, హైదరాబాద్: తన పాలనను చూసి ఓట్లేయమని నంద్యాల ఓటర్లను కోరే దమ్ము, ధైర్యం ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. చంద్రబాబుకు దమ్ముంటే అభివృద్ధిని రెఫరెండంగా తీసుకొని నంద్యాల ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. పాపాలపుట్ట ఎక్కడ పగులుతుందోనని, మూడేళ్లలో చేసిన అభివృద్ధి ఏమీలేదని నంద్యాల ప్రజలకు తెలిసిపోతుందని భయపడుతున్న కారణంగానే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై పనిగట్టుకుని విమర్శలకు దిగుతున్నారని ఆమె మండిపడ్డారు.
హైదరాబాద్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె ఆదివారం విలేకరులతో మాట్లాడారు. అమరావతిలో కూర్చున్నా.. నంద్యాలలో కూర్చున్నా.. జగన్‌ను దూషించడమే పనిగా పెట్టుకున్నారని పద్మ విమర్శించారు. టీడీపీ నేతలు సోమిరెడ్డి, దేవినేని ఉమా, ఆదినారాయణ, వర్ల రామయ్య నంద్యాలలో ప్రెస్‌మీట్లు పెట్టి బూతులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పలానా అభివృద్ధి చేశాం మాకు ఓట్లు వేయండి అని కోరే పరిస్థితి టీడీపీకి లేదని ఎద్దేవా చేశారు. సర్వేల పేరుతో చంద్రబాబు పంపిన విద్యార్థులు ఓటర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు.