‘ఊపిరి తీసే ఆస్పత్రులు’ కథనంపై ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీ వివరణ
సాక్షి, హైదరాబాద్: ధర ఎక్కువ కోట్ చేయడంతోనే వెంటిలేటర్లు కొనలేకపోయామని రాష్ట్ర మౌలిక వైద్యసదుపాయాల అభివృద్ధిసంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) ఎండీ సీహెచ్ వెంకట గోపీనాథ్ పేర్కొన్నారు. శనివారం ‘సాక్షి’ దినపత్రికలో ‘ఊపిరి తీసే ఆస్పత్రులు’ పేరుతో వచ్చిన వార్తకు ఆయన స్పందించారు. 38 వెంటిలేటర్ల కొనుగోలుకు టెండర్లు పిలిచామని, ధర ఎక్కువగా కోట్ చేయడంతో కొనలేకపోయామన్నారు. ఎక్కువ రేటు వేసిన కారణంగా టెండర్లు రద్దు చేశామని, మళ్లీ కొత్తగా టెండర్లు పిలుస్తున్నట్లు చెప్పారు. 2014లో 142, 2015-16లో 69 వెంటిలేటర్లు కొనుగోలుచేశామన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 525 వెంటిలేటర్లు ఉన్నాయని వివరణ ఇచ్చారు. వెంటిలేటర్లే కాక వివిధ రకాల వైద్య పరికరాల కొనుగోలుకు 2015-16లో రూ.266.70 కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన చెప్పారు.
వెంటిలేటర్లపై వైద్య ఆరోగ్యశాఖ వీడియో కాన్ఫరెన్స్
‘సాక్షి’లో ప్రచురితమైన ‘ఊపిరి తీసే ఆస్పత్రులు’ కథనంపై వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య శనివారం అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొన్నేళ్లుగా వెంటిలేటర్లు పనిచేయకపోతే ఏంచేస్తున్నారంటూ సంబంధిత అధికారులపై కాన్ఫరెన్సులో ఆమె తీవ్రస్థాయిలో మండిపడినట్లు తెలిసింది.
పనిచేయని వెంటిలేటర్ల వివరాలు ఇవ్వమని అడిగితే ఒక్కరూ సరిగా చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. వీరితోపాటు ఏపీఎంఎస్‌ఐడీసీ ఇంజనీర్లపైనా ఆమె మండిపడినట్లు తెలిసింది. వెంటిలేటర్లు సరఫరా చేసిన వారికి ఆస్పత్రుల సూపరింటెండెంట్‌లు ఫోన్లు చేసి, తక్షణమే తమ ఆస్పత్రులకు రావాల్సిందిగా మొరపెట్టుకోవడం విశేషం.
ధర ఎక్కువుందని వెంటిలేటర్స్ కొనలేదు
Published Sun, Apr 17 2016 3:11 AM | Last Updated on Sat, Mar 23 2019 9:03 PM
Advertisement
Advertisement