
'అందుకే విజయ సాయిరెడ్డిని పోటీలో నిలిపాం'
హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఒక అభ్యర్థిని గెలిపించుకునేందుకు అవసరమైన సంఖ్య కంటే ఎక్కువ బలం తమకుందని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిని పోటీలో నిలిపినట్టు ఆయన వెల్లడించారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, విజయసాయిరెడ్డి సోమవారం హైదరాబాద్లో ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ను కలిశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫిరాయింపు రాజకీయాలపై కూడా ఫిర్యాదు చేశారు. సరిపోయేంత బలం ఉండబట్టే తాము రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ఉమ్మారెడ్డి తెలిపారు. బలం లేకుండా పోటీ చేస్తే తెలంగాణలో ఏంజరిగిందో అందరికీ తెలుసని ఆయన అన్నారు. నాలుగో అభ్యర్థికి సరిపోయేంత బలం లేకపోయినా టీడీపీ పోటీ చేయడం అనైతికమన్నారు. ఒక అభ్యర్ధిని గెలిపించుకునేందుకు అవసరమైన సంఖ్య కంటే..ఎక్కువ బలం వైఎస్ఆర్ సీపీకి ఉందన్నారు.