పెళ్లి పేరుతో లక్షల్లో టోపీ | warangal man cheated nri women in Matrimonial Website lakhs collected | Sakshi
Sakshi News home page

పెళ్లి పేరుతో లక్షల్లో టోపీ

Published Sun, Nov 27 2016 4:26 PM | Last Updated on Mon, Sep 4 2017 9:17 PM

పెళ్లి పేరుతో లక్షల్లో టోపీ

పెళ్లి పేరుతో లక్షల్లో టోపీ

మ్యాట్రిమొనీ వెబ్‌సైట్లలో తప్పుడు వివరాలు
ఎన్‌ఆర్‌ఐతో వివాహం
లక్షల్లో వసూలు

హైదరాబాద్ :
సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని నమ్మించి పెళ్లి చేసుకొని మోసగించడమే కాకుండా ఆమె నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన   మోసగాడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి..

వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన ప్రశాంత్ పరాంకుశం పెళ్లి కోసం భారత్ మాట్రిమోనీ వెబ్‌సైట్‌లో రిజిష్టర్ చేసుకున్నాడు. పంజాగుట్ట శ్రీనగర్ కాలనీలోని హ్యుటెంట్ సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్‌లో సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్‌గా పని చేస్తున్నానని, ఏడాది రూ.40 లక్షలు సంపాదిస్తానని, యూఎస్ వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు వివరాలు పొందుపరిచాడు. కాగా విదేశాల్లో ఉంటున్న బాధితురాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో నగరానికి వచ్చిన సమయంలో అదే వెబ్‌సైట్‌లో పేరు రిజిష్టర్ చేసుకుంది. నిందితుడి ప్రొఫైల్ చూసి ఇష్టపడటంతో ఆమె కుటుంబసభ్యులు నేరుగా ప్రశాంత్‌తో మాట్లాడారు.

ఈ సందర్భంగా అతను తనపేరున భారీగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నట్టు చెప్పడంతో నమ్మిన వారు పెళ్లికి ఆమోదం తెలుపుతూ మార్చి 20న పెళ్లి చేసేందుకు నిర్ణయించుకున్నారు. అయితే ప్రస్తుతం చేతిలో నగదు లేదని నిందితుడు చెప్పడంతో బాధితురాలు రూ. నాలుగు లక్షలు అతని ఖాతాకు ట్రాన్స్ఫర్ చేసింది. రూ. లక్ష నగదు చేతికిచ్చారు. బ్రాస్‌లెట్, రింగ్, దుస్తుల కోసం మరో రూ. 2 లక్షలు ముట్టజెప్పడంతో మియాపూర్‌లోని శ్రీకృష్ణ గ్రాండ్ హోటల్‌లో మార్చి 20న వారికి వివాహం జరిగింది.

వివాహం అయిన వెంటనే  బాధితురాలు మార్చి 25న అమెరికాకు వెళ్లింది. వీసా ప్రాసెసింగ్ చేసుకొని తాను కూడా అమెరికా వస్తానని చెప్పాడు. ఆ తర్వాత ఆమెకు ఫోన్ చేసి అనారోగ్యంతో  స్టార్ ఆస్పత్రిలో చేరానని రూ.30 లక్షల వరకు డబ్బు అవసరమని చెప్పడంతో బాధితురాలు విచారణ చేయగా అబద్ధమని తేలడమేగాక, మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధపడినట్లు తెలుసుకుంది.  తప్పుడు వివరాలు పొందుపరిచి పెళ్లిళ్ల పేరిట అమ్మాయిలను వంచిస్తున్నట్లు గుర్తించి డిసెంబర్ 7న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు ప్రశాంత్‌ను అరెస్టు చేశారు. అతడి నుంచి 1,80,000 విలువ చేసే బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement