న్యాయవ్యవస్థను...అవహేళన చేస్తున్నారు
హైకోర్టు తీర్పుపై మీరే విచారణ చేసుకోండి
♦ చట్టసభలో మీరే తీర్పులు ఇచ్చుకోండి
♦ సోమవారం వరకూ మేం సభకు రాం
♦ సీఎం చంద్రబాబుకు తేల్చి చెప్పిన విపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
♦ ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి
♦ ఎన్నికలకు వెళ్లి ప్రజలు, దేవుడి ఆశీస్సులు ఎవరికున్నాయో తేల్చుకుందాం
♦ ప్రివిలేజస్ కమిటీ అన్యాయం చేస్తే కోర్టుకు పోతాం
♦ అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసిన ప్రతిపక్షనేత, ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్: న్యాయ వ్యవస్థను ధిక్కరిస్తూ, ఆ వ్యవస్థ గౌరవాన్ని దిగజారుస్తూ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వ్యవహరిస్తున్న తీరు, శాసనసభ జరుగుతున్న తీరుపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా నిరసన తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులిచ్చినా తమ ఎమ్మెల్యే ఆర్.కె.రోజాను అసెంబ్లీలోకి అనుమతించని విషయంలో కోర్టు ధిక్కార పిటిషన్ సోమవారం విచారణకు వస్తున్నందున న్యాయవ్యవస్థకు బాసటగా నిలిచేందుకు ఈ నెల 21వ తేదీ వరకూ శాసనసభను బహిష్కరిస్తున్నామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రకటించారు. శనివారం అసెంబ్లీ అర్థంతరంగా వాయిదా పడిన తరువాత ట్యాంక్‌బండ్‌పై గల రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి వైఎస్ జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో కలసి క్షీరాభిషేకం చేశారు. అనంతరం మీడియాతో జగన్ మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
ఏకగ్రీవంగా సస్పెండ్ చేశారా! పచ్చి అబద్ధం
శాసనసభలో స్పీకర్, ముఖ్యమంత్రి చంద్రబాబు కలసి చేస్తున్న అన్యాయానికి నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టాం. రోజమ్మ విషయంలో చేస్తున్న అన్యాయానికి నిరసనగా వాకౌట్ చేస్తున్నాం ఆ విషయం చెప్పడానికి రెండు నిమిషాలు మైక్ ఇవ్వాల్సిందిగా కోరినా.. ఇవ్వని అధ్వాన పరిస్థితులు సభలో ఉన్నాయి. న్యాయస్థానం నుంచి తీర్పును పొంది వచ్చిన ఒక మహిళా ఎమ్మెల్యే ఉత్తర్వులను చూపి లోనికి పంపాల్సిందిగా అనుమతి కోరితే.. ఆమె పట్ల అసభ్యకరమైన రీతిలో ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
రోజమ్మను సస్పెండ్ చేసిన రోజున మా ఎమ్మెల్యేలు 67 మంది కూడా సస్పెండ్ చేయడానికి మీకు అధికారం లేదు. నిబంధనలను అతిక్రమించి ఎలా సస్పెండ్ చేస్తున్నారు? అని ప్రశ్నించిన మాట నిజం కాదా? కానీ స్పీకర్ మాత్రం ఏకగ్రీవంగా సస్పెన్షన్‌కు సభ ఆమోదం తెలిపిందన్నారు. ఇంతకన్నా దారుణమైన అబద్ధాలు ఇంకేమీ ఉండవు. మళ్లీ ఇదే స్పీకర్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సోమవారం చర్చిస్తామనడం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. న్యాయవ్యవస్థను ధిక్కరిస్తూ, న్యాయ వ్యవస్థ గౌరవాన్ని దిగజారుస్తూ స్పీకర్, ఈ సభ వ్యవహరిస్తున్న తీరుకు నిరసన తెలుపుతున్నాం. చట్ట సభలో న్యాయస్థానాన్ని గౌరవించని పరిస్థితులును ఇవాళ చూశాం.
చట్టసభ చేసింది అన్యాయమని ఓవైపు న్యాయస్థానాలు చెబుతున్నాయి. కోర్టు ధిక్కార పిటిషన్ కూడా వేస్తూ ఉన్నారు. వీటిపై విచారణ జరుగుతూ ఉంటే న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అవహేళన చేస్తూ చట్టసభలో మళ్లీ వీళ్లు విచారిస్తారట. ఎంత ఆశ్చర్యం. చంద్రబాబు గారికి నేనిదే చెబుతున్నా... మేం శాసనసభకు రాం, సోమవారం ధిక్కార పిటిషన్ విచారణకు వస్తోంది కనుక హైకోర్టుకు బాసటగా నిలుస్తాం. మీరు మీ చట్టసభలో హైకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా మీ అంతట మీరే విచారణ చేసుకోండి. మీరే తీర్పులు ఇవ్వండి. ప్రజాస్వామ్యాన్ని మీరెలా అవహేళన చేస్తున్నారో ప్రజలంతా చూస్తున్నారు.
రాబోయే రోజుల్లో న్యాయస్థానాలు, రాష్ట్ర ప్రజలు, పైనుంచి దేవుడు కచ్చితంగా మీకు బుద్ధి చెబుతారు. రోజమ్మ విషయంలో చంద్రబాబు ఇంత సిగ్గు లేకుండా ప్రవర్తిస్తున్న తీరు, స్పీకర్‌ను ఉపయోగించుకుంటున్న తీరు యావత్ ఆంధ్ర రాష్ట్రం చూస్తోంది. ఒక అబల తనకు జరుగుతున్న అన్యాయాన్ని కోర్టు దృష్టికి తెచ్చి న్యాయం పొందినా ఆ తీర్పును అమలు చేయరా? రాజ్యాంగ నిర్మాతైన అంబేడ్కర్ మహాశయుని విగ్రహం వద్దకు వచ్చి పాలాభిషేకం చేసి మొరపెట్టుకుంటున్నాం, మీరైనా జరుగుతున్న అన్యాయాన్ని చూడండని.. దేవుడితో మాట్లాడి చంద్రబాబుకు జ్ఞానోదయం అయ్యేలా చేయండని ఆయన్ని ప్రార్థిస్తున్నాం.
ప్రివిలేజెస్ కమిటీకి టీడీపీ దూషణలు వినిపించవా?
శాసనసభ హక్కుల సంఘానికి (ప్రివిలేజెస్ కమిటీకి) నిత్యం సభలో ముఖ్యమంత్రి, మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు చేసే దూషణలు వినిపించవా? వారు చేసేవి కనిపించవా?. రేయ్.. మీ అంతు చూస్తా.. పిచ్చి పిచ్చిగా ఉందా? మీ సంగతి తేలుస్తా! అని చంద్రబాబు, ఖబడ్దార్.. అని ఓ మంత్రి, కొవ్వెక్కిందా... మగతనం ఉందా? అని మరో మంత్రి మాట్లాడతారు. ఇవన్నీ కూడా ప్రివిలేజెస్ కమిటీకి కనిపించవు. పాతేస్తాం అని టీడీపీ సభ్యుడు మమ్మల్ని అన్నా పట్టించుకోరు. కారణమేమంటే కమిటీలో సభ్యులంతా టీడీపీ వాళ్లే కాబట్టి. న్యాయస్థానాల కన్నా శాసనసభే సుప్రీం అని ఇవాళ వాళ్లంటున్నారు. నిజంగా వాళ్లకు (అధికార పక్షానికి) అహంకారంతో కళ్లు పెకైక్కాయి. వాళ్లకు కోర్టులు కనపడవు, సామాన్య ప్రజలు కనపడరు. చంద్రబాబు మమ్మల్ని ఉద్దేశించి అన్న మాటలు మంత్రులు మమ్మల్ని చేసిన దూషణలపై పలుమార్లు ప్రివిలేజెస్ కమిటీకి ఫిర్యాదు చేశాం. వాళ్ల మీద చర్యలుండవు. కానీ ప్రజాసమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న వారిపై మాత్రం చర్యలు తీసుకోవడానికి నిస్సిగ్గుగా వాళ్లకున్న అధికారాన్ని వినియోగిస్తారు. ప్రివిలేజెస్ కమిటీ అన్యాయం చేస్తే వాటి మీద కోర్టులకు కచ్చితంగా పోతాం.
క్రెడిబిలిటీ, క్యారెక్టర్ లేని వ్యక్తి చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు విశ్వసనీయత, వ్యక్తిత్వం రెండూ లేవు, ఎన్నికలయ్యాక ప్రజలను మోసం చేస్తూ ఉంటారు. చంద్రబాబు గురించి నేను రెండు విషయాలు చెబుతాను.. రాజకీయాల్లో ఉన్న నాయకుడెవరికైనా ప్రధానంగా రెండు గుణాలుండాలి.. ఒకటి వ్యక్తిత్వం (క్యారెక్టర్), రెండోది విశ్వసనీయత (క్రెడిబిలిటీ). అధికారం కోసం సొంత మామ ఎన్టీఆర్‌నే వెన్నుపోటు పొడిచిన క్యారెక్టర్ ఆయనది. ఇక ఆయనకున్న విశ్వసనీయత ఏమిటంటే.. ఎన్నికలపుడు ప్రజలకు అబద్ధపు హామీలు ఇవ్వడం. ఎన్నికలయ్యాక ఆ హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసగించడం.
చంద్రబాబుకు విశ్వసనీయత, వ్యక్తిత్వం రెండూ లేవు కాబట్టే ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేదు. చంద్రబాబుకు ఎంత సిగ్గు లేదంటే.. చట్టసభను ఎంత దారుణంగా నడిపిస్తున్నారంటే.. మా పార్టీ నుంచి ఎన్నికై టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా స్పీకర్ కుర్చీని ఉపయోగించుకుంటూ వారిని కాపాడే యత్నం చేస్తున్నారు. ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం లేక వారి చేత రాజీనామా చేయించి ప్రజల దగ్గరకు వెళ్లే ధైర్యం చంద్రబాబుకు లేనే లేదు. ప్రజల దగ్గరికి వెళితే బుద్ధి చెబుతారనే భయంతోనే వెనుకడుగు వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అవినీతి డబ్బును ఎరగా చూపి ప్రలోభ పెడుతూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు.
నేనొకటే అడుగుతున్నా.. చంద్రబాబుకు సిగ్గూ, రోషం, లజ్జా ఏ మాత్రం ఉన్నా.. మళ్లీ మళ్లీ చెబుతున్నా.. మాపార్టీ నుంచి కొనుగోలు చేసిన ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలందరి చేత రాజీనామాలు చేయించండి. ప్రజల్లోకి పోదాం. ప్రజల ఆశీస్సులు ఎవరికి ఉన్నాయో.. దేవుడి ఆశీస్సులు ఎవరికున్నాయో తేల్చుకుందాం.
నల్ల దుస్తులతో అసెంబ్లీకి..
తమ పార్టీ ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీలోకి ప్రవేశించకుండా నిరోధించడమే కాక, న్యాయస్థానాలను గౌరవించనందుకు నిరసనగా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు నల్లదుస్తులు ధరించి శనివారం శాసనసభకు హాజరయ్యారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో సహా అందరూ నల్ల చొక్కాలు ధరించగా, మహిళా ఎమ్మెల్యేలు నల్ల చీరలు ధరించి వచ్చారు. ఎమ్మెల్యే రోజా పట్ల టీడీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడటం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ప్రతిపక్ష నేతకు, సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వనందుకు వారంతా నిరసన వ్యక్తం చేశారు. సభ వాయిదా పడిన తరువాత ఎమ్మెల్యేలంతా మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఎర్రటి ఎండలో నల్లటి దుస్తులతో కాలినడకన ‘‘న్యాయం కావాలి.. హైకోర్టు తీర్పును గౌరవించాలి.. దోపిడీ రాజ్యం-దొంగలరాజ్యం’’ అనే నినాదాలు చేస్తూ రిజర్వు బ్యాంకు, సచివాలయం మీదుగా అంబేడ్కర్ విగ్రహం వరకూ వెళ్లారు.
అంబేడ్కర్ విగ్రహం వద్దకు పాదయాత్రగా వెళ్లిన వారిలో ఎమ్మెల్యేలు ఎన్.అమరనాథ్‌రెడ్డి, ఉప్పులేటి కల్పన, కొరుముట్ల శ్రీనివాసులు, విశ్వాసరాయి కళావతి, గౌరు చరితారెడ్డి, పాముల పుష్పశ్రీవాణి, వంతెల రాజేశ్వరి, బూడి ముత్యాలనాయుడు, చింతల రామచంద్రారెడ్డి, మహ్మద్ ముస్తఫా, అత్తారు చాంద్‌బాషా, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కళత్తూరు నారాయణస్వామి, కొడాలి నాని, కొక్కిలిగడ్డ రక్షణనిధి, పోతుల రామారావు, గొట్టిపాటి రవికుమార్, కంబాల జోగులు, కిడారు సర్వేశ్వరరావు, యక్కలదేవి ఐజయ్య, పీడిక రాజన్నదొర, ఎస్వీ మోహన్‌రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జ్యోతుల నెహ్రూ, కిలివేటి సంజీవయ్య, చిర్ల జగ్గిరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, జంకె వెంకటరెడ్డి, వై.బాలనాగిరెడ్డి, వై.సాయిప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, కోలగట్ల వీరభద్రస్వామి, దేవసాని చిన్న గోవిందరెడ్డి ఉన్నారు.