ఆర్డర్ కాపీతో అసెంబ్లీకి రోజా
హైదరాబాద్: అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తన సస్పెన్షన్ ను రద్దు చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్వర్వులు జారీ చేయడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా కోర్టు ఆర్డరు కాపీని అందుకొని అసెంబ్లీకి బయలుదేరారు. ఆమెతోపాటు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కూడా ఉన్నారు. దీంతో అసెంబ్లీ వద్ద కొంత ఉద్రిక్తత నెలకొంది. ఆమెను పోలీసు సిబ్బంది అసెంబ్లీలోకి అనుమతించారు. దీంతో ఆమె అసెంబ్లీ కార్యదర్శిని కలిసి కోర్టు ఆర్డర్ కాపీని అందజేశారు.
ఈ వ్యవహారానికి ముందు గేటు వద్ద పోలీసులు బారీగా ఉండటమే కాకుండా మహిళా మార్షల్స్ ను కూడా పెద్ద మొత్తంలో మోహరించారు. కాల్ మనీ వ్యవహారంలో ప్రభుత్వాన్ని నిలదీస్తూ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంగా రోజాను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తూ తీర్మానం చేసిన విషయం తెలిసిందే.
340 నిబంధన కింద రోజాను సస్పెండ్ చేస్తూ తీర్మానం చేయగా, ఆ నిబంధన ప్రకారం ఆ సమావేశాలు ఎన్ని రోజులు సాగుతాయో అంతకాలం మాత్రమే సస్పెండు చేయాలని ఆ నిబంధన చెబుతోందని, ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్ చేసే అధికారం ప్రభుత్వానికి లేదని అదేరోజు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సభలో తీవ్ర అభ్యంతరం చెప్పారు. అయినా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. కానీ, తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ప్రభుత్వానికి చుక్కెదురైనట్లయింది.