'రేపటి నుంచి అసెంబ్లీలో అడుగుపెడతా'
హైదరాబాద్: రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. తనను ఏడాది సస్పెన్షన్ చేయడాన్ని హైకోర్టులో సవాలు చేశానని, చివరకు న్యాయం గెలిచిందని తెలిపారు. దీంతో తనకు న్యాయవ్యవస్థపై నమ్మకం రెట్టింపయిందని అన్నారు. అసెంబ్లీలో అధికార పార్టీ అనుచితంగా తీసుకున్న నిర్ణయం వల్ల తన హక్కులకు భంగం కలగడమే కాకుండా, తన నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరిగిందని అన్నారు. ముఖ్యమైన బడ్జెట్ సమావేశాల కారణంగా తాను మరింత వేగంగా కోర్టును ఆశ్రయించానని చెప్పారు.
హైకోర్టు తీర్పు తనకు సంతోషాన్నిచ్చిందని అన్నారు. ఎప్పటిలాగే రేపటి నుంచి 9గంటల కు అసెంబ్లీకి వస్తానని, ఇప్పటి వరకు తన నియోజకవర్గ సమస్యలపై ప్రశ్నలు వేయలేదని, తనకు జీరో అవర్ లోనైనా ఆ అవకాశం ఇస్తారని భావిస్తున్నానని చెప్పారు. హైకోర్టు తీర్పును దిక్కరిస్తూ అధికార పార్టీ వాళ్లు మాట్లాడితే ఆ విషయం కోర్టు చూసుకుంటుంది అన్నారు. నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ విషయంలో కూడా చంద్రబాబునాయుడు న్యాయవ్యవస్థను కించపరిచేలాగా మాట్లాడారని గుర్తుచేశారు.