మీడియా సహకారం తీసుకోండి
♦ ఎడిటర్లతో సమావేశం ఏర్పాటు చేసుకోండి
♦ కార్బైడ్ వాడే పండ్ల వ్యాపారులపై కనికరం చూపొద్దు
♦ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం
♦ ప్రకటనల టారీఫ్‌ను తగ్గించాలని మీడియాకు విజ్ఞప్తి
♦ విచారణ మార్చి 4కు వాయిదా
సాక్షి, హైదరాబాద్: కార్బైడ్ రహిత పండ్ల కోసం మీడియా సహకారం తీసుకోవాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు హైకోర్టు సూచించింది. పత్రికలు, టీవీల ఎడిటర్లతో సమావేశం ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేసింది. కార్బైడ్‌తో పక్వానికి తీసుకొచ్చిన పండ్లను తింటే కలిగే దుష్ర్పభావాలపై ప్రభుత్వం జారీ చేసే ప్రకటనలకు టారీఫ్‌ను తగ్గించాలని మీడియాను కోరింది. మీడియా బాధ్యతాయుతంగా స్పందిస్తుందనే ఆశ తమకుందని హైకోర్టు పేర్కొంది. వ్యాపారులు కార్బైడ్ వాడితే వారి లెసైన్స్ రద్దు చేయడంతోపాటు కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కార్బైడ్ వాడే వ్యాపారులపై ఏ రకంగానూ కనికరం చూపొద్దని వెల్లడించింది.
వాట్సాప్‌ను ఉపయోగించుకోండి
మామిడి పండ్ల సీజన్ ప్రారంభం కాక ముందే కార్బైడ్‌పై అధికారులు కార్యాచరణ ప్రారంభించాలని, తూతూమంత్రంగా చర్యలు తీసుకుంటే సరిపోదని హైకోర్టు పేర్కొంది. పండ్ల మార్కెట్‌లలో తనిఖీలు చేసేటప్పుడు ఏయే విషయాలను గమనించారో సవివరంగా తమ ముందుంచాలని ఏపీ, తెలంగాణ అధికారులను ఆదేశించింది. అంతేకాక వాట్సాప్‌ను విస్తృతంగా ఉపయోగించుకోవాలని సూచించింది. తదుపరి విచారణను మార్చి 4కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పండ్ల వ్యాపారులు కాయలను పక్వానికి తీసుకొచ్చేందుకు కార్బైడ్ వాడుతుండటంపై పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా హైకోర్టు విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిపై ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది.