వాట్సాప్ తలాక్‌లపై న్యాయ పోరాటం
⇒ భర్తలపై హైకోర్టులో పిటిషన్ వేసిన నూర్, ఫాతిమా
⇒ ఇలాంటి వాటి నుంచి ముస్లిం మహిళలను రక్షించాలని వినతి
⇒ సోమవారం విచారించనున్న కోర్టు
సాక్షి, హైదరాబాద్: అమెరికా నుంచి వాట్సాప్ ద్వారా విడాకులు పంపిన తమ భర్తలపై ఇద్దరు భార్యలు న్యాయ పోరాటానికి దిగారు. ట్రిపుల్ తలాక్ విధానం ద్వారా విడాకులు ఇచ్చే క్రమంలో అక్రమ మార్గాలను అనుసరించకుండా తగిన మార్గదర్శకాలను రూపొందిం చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరు తూ హైదరాబాద్‌కు చెందిన మెహరీన్ నూర్, సయ్యదా హీనా ఫాతిమా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్రమ మార్గాల ద్వారా తలాక్ ఇచ్చే సందర్భాల్లో అందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఖాజీలను నియంత్రిస్తూ ఆదేశాలివ్వాలని కోరారు.
వ్యాజ్యంలో కేంద్ర మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి, రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర వక్ఫ్‌బోర్డ్ సీఈవో, శాలిబండ సదర్ ఖాజీ, గోల్కొండ సదర్ ఖాజీలతో పాటు భర్తలు ఉస్మాన్ ఖురేషీ, సయ్యద్ ఫయాజుద్దీన్ ఖురేషీ, అత్తమామలు మహ్మద్ అబ్దుల్ హఫీజ్, అలియా ఖుల్సుంలను ప్రతి వాదులుగా పేర్కొన్నారు. వ్యా జ్యంపై న్యాయ మూర్తి జస్టిస్ రామలింగేశ్వరరావు సోమ వారం విచారణ జరపనున్నారు.
ఏకపక్ష నిర్ణయం సరికాదు...
తన తప్పేమీ లేకపోయినప్పటికీ అమెరికాలో ఉంటున్న తన భర్త ఉస్మాన్ ఖురేషీ ఈ ఏడాది జనవరి 24న తనకు వాట్సాప్ ద్వారా తలాక్.. తలాక్.. తలాక్.. అంటూ మెసేజ్ పంపారని నూర్ తెలిపారు. ప్రసవం తరువాత మెట్టినింటికి వెళ్లినప్పుడు అత్త మామలు తనను ఇంట్లోకి రాకుండా అడ్డుకొని.. ఫయా జుద్దీన్ వాట్సాప్ ద్వారా తలాక్ పంపారని చెప్పారని, అప్పుడే తనకా విషయం తెలిసిందని ఫాతిమా వివరించారు. ఇది ముస్లిం చట్టం, రాజ్యాంగ నిబంధనలు, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని తెలిపా రు. çసరైన కారణాలు చూపకుం డా ఏకపక్షంగా తలాక్ ఇవ్వడం సరికాదన్నారు. ఇలా అక్రమ మార్గాల ద్వారా ఇచ్చే తలాక్‌ల నుంచి అమాయక ముస్లిం మహిళలను రక్షించేందుకు మార్గదర్శకాలు రూపొందించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోర్టును కోరారు.
మరో పెళ్లికి యత్నం...
వాట్సాప్ ద్వారా తలాక్‌లు పంపిన తరువాత తమ భర్తలు తమను బయటకు నెట్టి మరో పెళ్లి చేసుకోవాలని చూస్తున్నట్టు నూర్, ఫాతిమా తెలిపారు. తమ అత్తమామలకు నలుగురు కుమారులైతే... ముగ్గురికి వివాహమైందని, వారు ఇప్పటికే తమతో పాటు ఏడుగురికి ఇలానే తలాక్ ఇచ్చారని తెలిపారు. దీన్ని ప్రశ్నించినందుకు అత్తమామలు తమపై హత్యాయత్నానికి పాల్పడ్డారని, దీనిపై తాము పోలీసులకు ఫిర్యాదు కూడా చేశామన్నారు.