Talak
-
మోజు తీరగానే ఫోన్లో తలాక్..
ఓ గదిలో కొందరు బాలికలు కూర్చొని ఉన్నారు.. వయసు పైబడిన ఓ వ్యక్తి ఆ గదిలోకి వచ్చాడు. ఒక్కొక్కరిని ప్రశ్నలు అడుగుతున్నాడు. కొద్దిసేపటి తర్వాత వారిలో ఒక బాలికను ఓకే చేశాడు. ఇది ఏ ఉద్యోగం కోసమో జరుగుతున్న ఇంటర్వ్యూకాదు... అమ్మాయిల కొనుగోలు కోసం జరుగుతున్న తంతు. అందం.. ఆరోగ్యం ఉన్న హైదరాబాద్ అమ్మాయిలను ఎంత డబ్బు కుమ్మరించైనా సొంతం చేసుకునేందుకు సొమాలి, సూడానీలు పోటీపడుతున్నారు. ఈ తతంగానికి పెళ్లి అని పేరు పెట్టి.. యువతుల జీవితంతో ఆడుకుంటున్నారు. ఇలాగే ఓ సోమాలీ దేశస్తుడు (అమెరికా పౌరసత్వం ఉన్న వ్యక్తి) పాతబస్తీకి చెందిన మైనర్ అమ్మాయి సబాఫాతిమాను పెళ్లి చేసుకున్నాడు. మోజు తీరగానే అమెరికా వెళ్లి ఫోన్లో తలాక్ చెప్పేశాడు. చదవండి: నెల రోజుల్లో పెళ్లి.. చేతిలో చిల్లిగవ్వ లేక ఏం జరిగింది... : పాతబస్తీ గాజియే మల్లత్ కాలనీకి చెందిన సబా ఫాతిమా(16)కు అబ్ది వలీ అహ్మద్(54)తో పెళ్లి జరిగింది. అప్పటికీ ఫాతిమా మైనర్. టోలిచౌకిలో ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అద్దెకు తీసుకొని ఉన్నారు. అలా 2 నెలలు గడిచిన తర్వాత వారం రోజుల్లో తిరిగి వస్తా అని చెప్పి దుబాయ్ వెళ్లాడు. ఏడాది తర్వాత వచ్చాడు. మళ్లీ రెండు నెలలు ఉండి ఎక్కడికో వెళ్లేవాడు. ఇలా నాలుగుసార్లు జరిగింది. అద్దె ఇళ్లను మారుస్తూ మెహిదీపట్నం, మలక్‌పేట్‌తో పాటు పలుచోట్ల సబాతో ఉండేవాడు. కాగా, 2020, ఫిబ్రవరిలో దుబాయ్‌లో ఉన్న తన తల్లి వద్దకు వెళ్తున్నానని.. తర్వాత వచ్చి సబాను తీసుకెళ్తానని చెప్పి వెళ్లాడు. లాక్డౌన్ ముగిసే వరకు దుబాయ్‌లో ఉండి.. అక్కడి నుంచి అమెరికా వెళ్లాడు. అక్టోబర్ 7న సబా తండ్రి మహ్మద్ ఫరీద్‌కు ఫోన్ చేసి తలాక్ ఇస్తున్నానని మూడుసార్లు ఆ పదం ఉచ్చరించాడు. అప్పటి నుంచి సబా ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేశాడు. దీంతో ఆందోళన చెందిన ఫాతిమా కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఘాన్సీబజార్‌లోని ఉమెన్స్ పోలీసులకు ఆశ్రయించింది. న్యాయం చేయండి... ‘మా నాన్నకు మేము ఐదుగురం అమ్మాయిలం. నాన్న ఆటో నడిపిస్తారు. నేనే ఇంట్లో పెద్ద. నాన్న బాధ చూడలేక నా కంటే రెండింతలు ఎక్కువ వయసున్న నల్లజాతీ యుడిని పెళ్లి చేసుకున్నా. తనకు అమెరికా పౌరసత్వం ఉందని, వాళ్లమ్మ దుబాయ్‌లో ఉంటుందని చెప్పాడు. నా కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగుపడుతుందని పెళ్లి చేసుకున్నా. తర్వాత ఎప్పుడూ నెల రోజుల కంటే ఎక్కువ ఉండలేదు. అక్టోబర్‌లో నాన్నకు ఫోన్ చేసి తలాక్ ఇస్తున్నానని చెప్పాడు. దీంతో చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాం. ప్రభుత్వం స్పందించి నాకు న్యాయం చేయాలని కోరుతున్నా’ – సబాఫాతిమా ఇది ఒక్కరి కథ కాదు.. సబాఫాతిమానే కాదు.. పాతబస్తీకి చెందిన ఎందరో అమ్మాయిల దీనగాథ ఇది. సోమాలీ, సూడానీ దేశస్తులు.. ఇక్కడి అమ్మాయిల అందానికి వెల కడుతున్నారు. పెళ్లి కోసం వచ్చే వీరంతా కుర్రాళ్లేం కాదు. 50–60 ఏళ్లు పైబడిన వారే. వీరు సంపన్నులు కాదు. సోమాలియా, సూడాన్‌తో పాటు ఇతర అరబ్బు దేశాల నుంచి విద్య, వ్యాపారం, వైద్యం కోసం వస్తున్నారు. శారీరక అవసరాల కోసం మాత్రమే లక్ష, 2 లక్షలు ఇచ్చి పాతబస్తీ అమ్మాయిలను వివాహం చేసుకుంటున్నారు. ఇక్కడి కుటుంబాల్లో పేదలే ఎక్కువగా ఉండటం.. అమ్మాయిల సంఖ్య కూడా ఎక్కువగానే కావడం, పేదరికం, నిరక్షరాస్యతను ఆసరా చేసుకుని దళారులు ఈ తతంగాన్ని నడిపిస్తున్నారు. ఆయా దేశాల నుంచి వచ్చిన వారు టోలిచౌకి, మెహిదీపట్నం, మాసాబ్ ట్యాంక్ తదితర ప్రాంతాల్లోనే అద్దెకు ఉంటున్నారు. దళారుల ద్వారా అమ్మాయిలను ఇంటర్వ్యూ చేసి నచి్చన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు. అమ్మాయిలకు ఇష్టంలేకపోయినా ఒత్తిడి తెచి్చ మరీ తమ పంతం నెరవేర్చుకుంటారు. పెళ్లి చేసుకునే వ్యక్తి ఇచ్చే డబ్బును దళారులు.. ఏజెంట్లు.. తల్లిదండ్రులు పంచుకుంటారు. అయితే వీటిలో అధిక భాగం దళారుల చేతికే చేరుతుంది. పాతబస్తీలో గోప్యంగా పెళ్లి జరుగుతుంది. అక్కడి నుంచి మకాం కొత్తబస్తీకి మారుస్తారు. -
కూతురు ఏడ్చిందని తలాక్
ఇండోర్: ఏడాది వయసున్న కూతురు ఏడుపు భరించలేక తన భార్యకు ఓ వ్యక్తి తలాక్ చెప్పి విడాకులిచ్చిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. అనంతరం అతడి భార్య ఉజ్మా అన్సారీ ఆమె సొంత జిల్లా బార్వానిలోని సెంథ్వాలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ గత పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం కొత్త చట్టం తేవడం తెల్సిందే. ఆగస్టు 4న రాత్రి సమయంలో అనారోగ్యంతో ఉన్న తన కూతురు గుక్కపెట్టి ఏడవడంతో, నిద్ర పాడుచేసిందంటూ భర్త అక్బర్ తనతో గొడవ పెట్టుకున్నాడని పోలీసులకు తెలిపారు. మరిది, మామలు తనను కొట్టారని చెప్పారు. వారి సమక్షంలోనే తన భర్త మూడు సార్లు తలాక్ చెప్పాడని పేర్కొన్నారు. -
ఉన్నది ఒకటే ఇల్లు
ఒక ఇంట్లోని వాళ్లంతా ఒకింటివాళ్లు అవుతారు తప్ప ‘వాళ్లు’ అవరు. ఒక దేశంలోని వాళ్లంతా ఒక దేశంవాళ్లు అవుతారు తప్ప ‘వాళ్లు’ అవరు. ఇంట్లో గానీ, దేశంలో గానీ ‘వాళ్లు’ అనే మాట వచ్చిందంటే అది వేరు చేసినట్లు కాదు. వేరు చేసుకున్నట్లు. తలాక్ రద్దుపై అటుగానీ, ఇటుగానీ నోరు మెదపకుండా మౌనంవహించడమంటే ఇంటి నుంచి, లేదా దేశం నుంచి ఎవర్ని వారు వేరు చేసుకోవడమే. అయితే తలాక్ రద్దును వ్యతిరేకిస్తూ ‘‘అదే ‘మనింటి’ విషయంలోనైతే ఇలా చేస్తామా?’’ అని వినిపిస్తున్నవాదనల కంటే నోరు మెదపని మౌనమే నయమేమో అనిపిస్తుంది.-మాధవ్ శింగరాజు జర్నలిజంలోని బ్యూటీ ఏంటంటే, సాయంత్రం ఇంటికి క్యారీబ్యాగులో ఓ కిలో బియ్యం మోసుకుని వెళ్లేందుకు డ్యూటీ చేసినట్లుగా ఉండదు. గుప్పెడు అక్షరాల్ని చల్లి లోకంలోని బంజరుభూముల్ని పండించడానికి ఆఫీస్‌కి వచ్చినట్లుగా ఉంటుంది. ‘‘మంచిదే కానీ, ప్రత్యేక అంశాలపై నీక్కొన్ని ప్రత్యేక అభిప్రాయాలు ఉన్నప్పుడు వాటిని నీ రాతల్లో వ్యక్తం చేయకుండా ఉండడం వల్ల కెరీర్లో నీకు నూకలు చెల్లకుండా ఉంటాయి’’ అని సీనియర్ జర్నలిస్టు ఒకరు హితవు చెప్పినప్పుడు కూడా ‘అతడు’ బంజరు భూముల్ని పండించడం గురించే ఆలోచించాడు తప్ప, క్యారీబ్యాగులో బియ్యం మోసుకుపోతే సుఖం కదా అనుకోలేదు. ఇరవై ఏళ్ల క్రితం నాటి మాట ఇది. అప్పుడు ‘అతడు’ ట్రైనీ. అదే ‘అతడు’ ఇప్పుడు ‘‘ప్రత్యేక అంశాలపై మీక్కొన్ని ప్రత్యేక అభిప్రాయాలు ఉన్నప్పుడు వాటిని మీరు మీ రాతల్లో వ్యక్తం చేయకపోవడం వల్ల క్యారీబ్యాగులో ఇంటికి మీరు బియ్యం మోసుకెళ్లగలరు తప్ప, బంజరు భూముల్ని పండించలేరు’’ అని చెబుతున్న సీనియర్ జర్నలిస్టు (ఈ వ్యాసకర్త). అప్పట్లో మెడ్రాస్ ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’లో రషీదా భగత్ బ్యూరో చీఫ్‌గా ఉండేవారు. ‘‘రషీదా భగత్ రాయొచ్చా సర్, ప్రత్యేకాంశాల మీద ప్రత్యేక అభిప్రాయాలు?’’ అని అతడు అడిగినప్పుడు, ‘‘రాయొచ్చు. కానీ నువ్వు రాయకూడదు. రాస్తే ఏ విలువా ఉండదు’’ అనేవారు డెస్క్ ఇన్చార్జి. సీనియర్ జర్నలిస్టులు జూనియర్ జర్నలిస్టులకు ఏం చెప్పినా, చివరి మాట మీడియా యాజమాన్యాలదే. అవి వద్దన్న అభిప్రాయాలేవీ మర్నాడు పేపర్లలో కనిపించవు. ప్రత్యేకాంశాలపై ప్రత్యేక అభిప్రాయాల మీద పత్రికలు ఎప్పుడూ కాస్త జాగ్రత్తగానే ఉంటాయి. ఎవరి మనోభావాలకూ దెబ్బ తగలకుండా. ఈ ఏడాది జూలై 30న రాజ్యసభలో తలాక్ బిల్లు అమోదం పొందగానే ఆ మర్నాడు అన్ని పేపర్లూ ఆ వార్తను వేశాయి కానీ, ఎప్పటిలా ‘ప్రత్యేకాంశం’ అయిన తలాక్‌పై ప్రత్యేక అభిప్రాయాలకు మాత్రం దాదాపుగా చోటివ్వలేదు. ప్రత్యేక అభిప్రాయాలంటే తలాక్ రద్దుపై ప్రభుత్వాన్ని వ్యతిరేకించని అభిప్రాయాలు. తర్వాత మెల్లిగా తలాక్ రద్దుపై ప్రభుత్వాన్ని సమర్థించని అభిప్రాయాలు ఒకటీ అరా కనిపించడం మొదలైంది. బాబ్రీ కట్టడం కూల్చివేత తర్వాత చాలాకాలం పాటు ఇలాంటి ప్రత్యేకాంశాలపై బలమైన మీడియా హౌస్‌లు కూడా ‘తటస్థతే సుస్థిరత’ అనే మోడ్‌లోకి వెళ్లిపోయాయి. వ్యూ, కౌంటర్ వ్యూ రెండూ ఉండేవి కాదు. ‘వాళ్ల’ మంచొద్దు. ‘వాళ్ల’ చెడొద్దు. ఇదీ ధోరణి! అసలు ఏది మంచి? ఏది చెడు? మంచి రాయబోయి చెడు రాసేస్తే? మంచి అనుకుని రాసింది చెడు అయిపోతే? అందుకే జూనియర్ జర్నలిస్టుల్ని ఈ ప్రత్యేకాంశాల దగ్గరకి రానిచ్చేవాళ్లు కాదు. సీనియర్ జర్నలిస్టులు ఎటూ ఆ దరిదాపులకు వెళ్లరు. ఇప్పుడా పరిస్థితి కొంచెం మారినట్లుంది. తలాక్ రద్దు మీద మీడియాలో ఈ రెండు వారాల్లోనూ ప్రధానంగా రెండు ప్రశ్నలు వచ్చాయి. తలాక్ చెబితే కౌన్సెలింగ్ ఇచ్చి పంపేలా బిల్లు ఉండాలి కానీ, ఏదో నేరం చేసినట్లు భర్తను జైల్లో పెట్టే బిల్లేమిటన్నది ఆ రెండిట్లో ఒక ప్రశ్న. ‘తలాక్‌ను రద్దు చేశారు సరే, హిందువుల్లోని భర్తల్ని çసంస్కరించేందుకు బిల్లు తేరేం?’ అనేది రెండో ప్రశ్న. రెండు ప్రశ్నలూ మంచివే. రెండోది ఇంకా మంచి ప్రశ్న. అయితే ఈ ప్రశ్న వేసే విధానమే మరీ అంత మంచిది కాకుండా ఉంది! ‘తలాక్’ సరే.. ‘మన’ ఇంటి గుట్టో? అని అని ప్రశ్నించడంలో ఏం మంచి ఉంది? ‘వాళ్ల’ సంగతి ఎందుకు? అని ఆనాడు అన్నవాళ్లు, ‘మన’ సంగతేంటి? అని నేడు అంటున్నారు. రెండిటిలోనూ కనిపించే భావం ఒక్కటే. ఈ దేశం ఒకే కుటుంబం కాదని! తలాక్ సంప్రదాయాన్ని రద్దు చేయాలని కోరుతూ పిటిషన్లు వేసి ఏళ్లుగా పోరాడుతున్న జకియా సోమన్, అతియా సాబ్రి, గుల్షన్ పర్వీన్, అఫ్రీన్ రెహ్మాన్, ఇష్రత్ జహాన్, సైరా భానులను ఈ ‘ఇంటి’ ఆడపడుచులు కాదు అనుకుని ఉంటే కోర్టులు పిటిషన్లను స్వీకరించేవా? ప్రభుత్వం ఇప్పుడు తలాక్‌పై ఒక నిర్ణయం తీసుకుని ఉండేదా? మనదంతా ఒకే కుటుంబం అని వ్యవస్థలే అనుకుంటున్నప్పుడు కుటుంబంలోని ఏ కొందరో, ఏ కారణం చేతనో కుటుంబంలోని కొందరికి అడగకుండానే మద్దతుగా నిలిచినంత మాత్రాన అదంతా ఒకే కుటుంబం కాకుండా పోతుందా? తలాక్ చట్టం మాత్రమే కాదు, అలాంటి ఏ చట్టం ఉద్దేశమైనా కుటుంబాలకు మేలు చేయడమే అయి ఉంటుంది. చట్టం ఫలిస్తుందా, నిష్ఫలం అవుతుందా అన్నది కాలక్రమంలో తేలే విషయం. ఫలించడం అంటే చట్టానికి ఫిర్యాదుల గౌరవం దక్కటం. నిష్ఫలం అంటే ఫిర్యాదులే వెళ్లని గౌరవం దక్కటం. రెండేళ్ల క్రితం మీరట్‌లో అమ్రీన్ బేగం (పై ఫొటో) అనే మహిళ తన భర్త పెట్టే గృహహింసను భరించలేక పోలీస్ స్టేషన్ బయటే పెద్దగా అరుస్తూ అతడికి తలాక్ చెప్పారు! ‘భర్తకేనా! భార్యకు ఉండకూడదా తలాక్ చెప్పే హక్కు’ అని ప్రశ్నించారు. ఇది ఒక బాధిత మహిళ చట్టాలతో నిమిత్తం లేకుండా తనకు తానుగా దక్కించుకున్న గౌరవం. -
చార్జ్‌షీట్ దాఖలు చేసి న్యాయం చేయండి
సాక్షి సిటీబ్యూరో: తన ప్రమేయం లేకుండా తన మామ మహ్మద్ యూసుఫ్ తన పేరున జహానుమా సిండికేట్ బ్యాంక్‌లో అకౌంట్ తీయడమే కాకుండా తన భర్తను రెచ్చగొట్టి తనకు సౌదీఆరేబియా నుంచి పోస్టులో తలాక్ ఇప్పించాడని, దీనిపై ఫలక్‌నుమా పోలీసులకు సంప్రదించగా అతనిపై నవంబర్ 11న ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, ఇంత వరకు చార్జ్‌షీట్ దాఖలు చేయలేదని, పోలీసులు వెంటనే చార్జ్‌షీట్ దాఖలు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించాలని లేని పక్షంలో అతను తన భార్య మాదిరిగానే సౌదీకి పారిపోయే ప్రమాదం ఉందని తలాక్ బాధితురాలు సయిదాబాద్ నివాసి నస్రీన్ సూల్తానా అన్నారు. మంగళవారం సయిదాబాద్లోని తన నివాసంలో తన తండ్రి ఎస్ఎల్ రెహమాన్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. సైదాబాద్‌కు చెందిన మహ్మద్ రహ్మన్ కుమార్తె నస్రీన్, జహానుమా ప్రాంతానికి చెందిన మహ్మద్ యూసుఫ్ కుమారుడు మహ్మద్ అలీకి 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారు సౌదీఆరేబియాలో ఉండేవారు. ఇటీవల ఆమె అరోగ్యం సరిగా లేకపోవడంతో వైద్యం కోసం హైదరాబాద్ వచ్చింది. వైద్య ఖర్చుల నిమిత్తం డబ్బులు అవసరం కావడంతో డబ్బులు పంపాలని తన భర్తను కోరింది. అయితే అప్పటికే సౌదీలో ఉన్న కోడలి పేరుతో తప్పుడు సర్టిఫికెట్లతో తన అత్త షమీమ్ఉన్సీసా సంతకంతో మామ యూసుఫ్ అకౌంట్ తెరిచాడు. అదే అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేసినట్లు మహ్మద్ అలీ చెప్పడంతో నస్రీన్ మామను నిలదీసింది. దీంతో అతను బ్యాంక్‌కు వెళ్లి డబ్బులు తీసుకు వచ్చాడు. దీంతో నస్రీన్ ఈ విషయాన్ని తన తండ్రి రహ్మన్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన బ్యాంక్‌కు వెళ్లి ఆరా తీయగా యూసుప్ నస్రీన్ పేరున అకౌంట్ తెరిచినట్లు తెలిపారు. దీనిపై మామను నిలదీయడంతో తన భర్తకు తప్పుడు మాటలు చెప్పి సౌదీ నుంచి తలాక్ చేయించాడని తెలిపింది. దీంతో తాము పోలీసులకు ఫిర్యాదు చేయగా తన అత్త సౌదీకి పారిపోయిందని, యూసుఫ్ కూడా సౌదీ పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. పోలీసులు వెంటనే అతని పాస్‌పోర్టును సీజ్ చేయాలని, చార్జ్‌షీట్ దాఖలు చేసి తనకు న్యాయం చేయాలని కోరింది. -
మామ అక్రమాలను నిలదీసినందుకు..
సాక్షి హైదరాబాద్: బోగస్ పత్రాలతో కోడలు సహా 25 మంది పేరిట బ్యాంకు ఖాతాలు, గ్యాస్ కనెక్షన్లు తీసుకొని వాటి ద్వారా ప్రతి నెలా వంట గ్యాస్ సబ్సిడీ కాజేయడమే కాకుండా దీనిపై నిలదీసిన కోడలికి కొడుకు చేత తలాక్ ఇప్పించిన ఉదంతం నగరంలోని పాతబస్తీలో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం సైదాబాద్‌కు చెందిన మహ్మద్ రహ్మన్ కూతురు నస్రీన్‌కు ఫలక్‌నుమా పోలీస్టేషన్ పరిధిలో ఉంటున్న మహ్మద్ యూసుఫ్ కుమారుడు మహ్మద్ అలీకి 2014లో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత దంపతులు సౌదీ అరేబియాలో వెళ్లిపోయారు. నకిలీ ఖాతా తెరిచి... ఇటీవల అనారోగ్యానికి గురైన నస్రీన్ వైద్యం కోసం హైదరాబాద్ వచ్చింది. చికిత్స ఖర్చుల కోసం భర్తను డబ్బు పంపాలని కోరింది. దీంతో భర్త.. జహానుమాలోని సిండికేట్ బ్యాంకులో నస్రీన్ పేరిట ఉన్న ఖాతాలోంచి సొమ్ము తీసుకోవాల్సిందిగా భార్యకు సూచించాడు. అయితే తనకు ఖాతా లేకున్నా ఆ బ్యాంకులోకి సొమ్ము ఎలా వచ్చిందని మామ మహ్మద్ యూసఫ్‌ను అడగ్గా ఆయన అదేమీ చెప్పకుండానే డబ్బును బ్యాంకు నుంచి తీసుకొచ్చి కోడలికి ఇచ్చాడు. దీనిపై అనుమానం వచ్చిన నస్రీన్... ఆ బ్యాంకుకు వెళ్లి ఖాతా వివరాలు పరిశీలించగా 2014లో తన పేరిట బోగస్ పత్రాలతో తెరిచినట్లు ఉన్నట్లు తేలింది. అంతేకాకుండా 2014 నుంచి ఆ ఖాతాలో తన భర్త జమ చేస్తున్న సొమ్మును మామ కాజేసిట్లు తెలుసుకుంది. అలాగే తన పేరిట, తోటికోడళ్లు, ఇతర మహిళల పేరిట బోగస్ పత్రాలతో 25 బ్యాంకు ఖాతాలను తెరిచి వాటి ద్వారా గ్యాస్ కనెక్షన్లను మామ సంపాదించాడని నస్రీన్ తెలుసుకుంది. ఈ కనెక్షన్ల పేరిట ప్రతి నెలా గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకొని అక్రమంగా సబ్సిడీ సొమ్మును పొందుతున్నట్లు ఆమె గుర్తించింది. పోస్టులో తలాక్..: ఈ అక్రమాలకు తన పేరును ఎందుకు వాడుకున్నావంటూ మామను నిలదీయగా సౌదీలో ఉన్న కొడుకుకు లేనిపోనివి చెప్పి పోస్టు ద్వారా తలాక్ ఇప్పించాడని నస్రీన్ ‘సాక్షి’కి తెలిపింది. మామపై ఈ నెల 1న పోలీసులకు ఫిర్యాదు చేయగా 14న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని వివరించింది. తాను జూలై 11న సౌదీ నుంచి వస్తే సెప్టెంబర్ 24న అందిన తలాక్ లేఖలో జూలై 2వ తేదీన తనకు తలాక్ ఇచ్చినట్లు భర్త అందులో పేర్కొన్నాడని బాధితురాలు చెప్పింది. తన పిల్లలు సౌదీలోనే ఉన్నారని, మామ, భర్త కలసి తన జీవితాన్ని నాశనం చేశారని వాపోయింది. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. మహ్మద్ యూసఫ్ గతంలోనూ పలు అక్రమాలకు పాల్పడ్డాడని బాధితురాలు పేర్కొంది. మరణించిన అల్లుడి పిల్లలను తన పిల్లలుగా చూపుతూ వారి పేరిట నకిలీ పాస్‌పోర్టులను తయారు చేసి గతంలో తాను పని చేసిన సౌదీ కంపెనీ నుంచి ఆర్థిక సాయం కూడా పొందాడని తెలిపింది. తనకు న్యాయం చేస్తానని పోలీసు కమిషనర్ హామీ ఇచ్చారని నస్రీన్ వివరించింది. -
మతాతీత సంస్కరణలే మేలు
విశ్లేషణ ముస్లిం స్త్రీలకు జరుగుతున్న అన్యాయాన్ని తొలగించేందుకు అని చెప్పి ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో నేటి పాలకుల చిత్తశుద్ధి ప్రశ్నార్థకం అయ్యే రీతిలో వ్యవహరిస్తే అది ప్రజల మధ్య విద్వేషాలకు దారితీసి, దేశంలో మతపరమైన అశాంతికి ఆస్కారం ఇచ్చే ప్రమాదం ఉంది. దేశంలో 24 లక్షలమంది భర్తలు వదిలివేసిన స్త్రీలు ఉన్నారు. వీరిలో అత్యధికులు ముస్లిమేతర స్త్రీలే. వారు ఎంతో వ్యధకు, బతుకు బాధలకు గురవుతున్నారు. ఈ సందర్భంగా ఈ మహిళలందరికీ న్యాయం చేసే రీతిలో చట్టం రావాలి. ఇస్లాం మతం ప్రకారం తలాక్ తలాక్ తలాక్ అని ఒక భర్త మూడు సార్లు ఉచ్చరించినా లేదా ఫోన్లో గానీ, వాట్సాప్ వంటి వానిలో గానీ, మెసేజ్ ద్వారా సందేశం పంపినా ఆ భార్యకు భర్తతో విడాకులు జరిగిపోయినట్లేనని ప్రచారం! అందువలన ముస్లిం మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదనీ, ఈ విషాదస్థితి నుంచి వారిని విముక్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం.. ముస్లిం మహిళలకు సైతం మిగిలిన స్త్రీల వలే సమన్యాయం కలిగించేందుకు చట్టం తీసుకురావాలన్న ఉద్దేశంతో ఒక బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. రాజ్యసభలో ఆ బిల్లు ఆమోదం పొందలేదు. రాజ్యసభలో ప్రతిపక్షాలకు మెజారిటీ ఉంది కనుక ఆ బిల్లును స్టాండింగ్ కమిటీ వివిధ పార్టీల ప్రతి నిధుల బృందానికి పంపి ఆసాంతం పరిశీలించిన తర్వాత, ఆ కమిటీ ఆమోదంతోనే బిల్లు ప్రవేశపెట్టాలని ప్రతిపక్షాల వాదన! మూడుసార్లు తలాక్ అని చెప్పినంత మాత్రానే స్త్రీకి అన్యాయం చేస్తూ విడాకులు పొందే ఇస్లాం మత చట్టాన్ని రద్దు చేస్తే ప్రతిపక్షాలకు వ్యతిరేకత ఎందుకు? ముస్లిం మతతత్వవాదుల కొమ్ముకాయడం తప్ప మరేమిటి? అని మోదీ ప్రభుత్వ పెద్దల అభియోగం. సాధారణ దృష్టితో చూస్తే ఇది సవ్యం గానే తోస్తుంది. అయితే ఆ బిల్లు ప్రకారం అలా విడాకులు పొందిన ముస్లిం భర్తకు, మూడేళ్ల కఠిన కారాగారం విధించే అవకాశం ఉండటమే కాకుండా తాను విడాకులు ఇచ్చిన భార్యకు పోషణ నిమిత్తం కొంత భాగాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. నిజానికి గృహ హింసతో స్త్రీని శారీరకంగా, మానసికంగా హింసి స్తే–ఎలాగూ గృహహింస నిరోధక చట్టం ప్రకారం శిక్ష విధింపవచ్చు. ఇది అన్ని మతాల వారికి సమానమే. అలాంటప్పుడు ఒకే నేరానికి రెండు శిక్షలా అన్న సంగతి అటుంచి, భర్తను జైలులో నిర్బంధిస్తే, విడాకులు పొందిన భార్యకు పోషణ నిమిత్తం భరణం ఇమ్మంటే ఎలా తెచ్చి ఇస్తారు? అని మరో ధర్మసందేహం! ఇవేవీ అధిగమించలేని ఆటంకాలు కావు. కాలం చెల్లుతున్న తలాక్‌పై ఇంత రభసా..? పైకి ఏదో స్త్రీ జనోద్ధరణ కార్యంగా ప్రచారం చేసుకునే ఈ బిల్లు ముస్లిం మత వ్యతిరేక దుష్ప్రచారానికి ఆస్కారమిచ్చే రీతిలో ఉంది. ఇలా 3 సార్లు తలాక్ చెప్పి విడాకులు పొందే అవకాశం నేటి ముస్లిం మత ఆచరణలో లేదు. అలా విడాకులు పొందేందుకు ఇస్లాం ప్రకారమే ఆచరణలో మొత్తం 5 నెలల వ్యవధిలో 3 సార్లు అలా తలాక్ అనాల్సి ఉంటుంది. ఈ లోపు భార్యాభర్తలకు చెందిన ఇరుపక్షాల పెద్దలు కూర్చుని, పరస్పర వాదనలు విని వారిని కలి పేందుకు ప్రయత్నించి, అవన్నీ విఫలమైన తర్వాతే తలాక్ అమలవుతుంది. నిజానికి కలహాల కాపురంలో పెద్దల జోక్యంతో పరిష్కారం కోసం జరిగే, సామరస్యపూర్వక యత్నం ఏ మతంలోని భార్యాభర్తల విషయంలోనైనా వాంఛనీయమే కదా. కాదు.. మా మతంలో అల్లా ఆదేశించిన దానిని సవరించే హక్కు పాలకులకు, ప్రభుత్వానికి ఎక్కడిది అని ప్రశ్నించే మత పెద్దలు అన్ని మతాలలో ఉండకపోరు. 4 వర్ణాలు అనే కులవిభజన నేనే చేశాను అని సాక్షాత్తూ శ్రీకృష్ణ పరమాత్మ ప్రకటించాడు. మరి అస్పృశ్యతతో సహా పరమ దుర్మార్గమైన ఈ వర్ణ వ్యవస్థ కొనసాగాల్సిందేనని ఎవరైనా హిందూ మతతత్వవాదులు అంటే అంగీకరించలేం కదా. అదలా ఉంచినా, హిందూమతంలో సతీసహగమనం, బహుభార్యత్వం ఆచారంగా అనుశ్రుతంగా ఉండేవి. అలాంటి దురాచారాలకు వ్యతిరేకంగా తీవ్ర అంతర్మథనం జరిగి వాటిని రద్దు చేయించుకోగలిగింది హిందూ సమాజం. అలాగే ఈ తలాక్ పేరుతో పురుషులు స్త్రీలను భోగవస్తువుగా చూడటం, వారిపట్ల అన్యాయంగా వ్యవహరించడం, కుటుంబ జీవితం అస్తవ్యస్తమై మహిళల పరిస్థితి దారుణ అణచివేతకు గురవడం వంటివాటిని ముస్లిం ప్రజానీకం, నేతలు మొదట గ్రహించి సంస్కరణలు తీసుకువచ్చారు. ముస్లిం లా లోనూ మార్పులు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్లు 3సార్లు వెనువెంటనే తలాక్ చెప్పడం ఇస్లాం చట్టంలో నేడు ఆచరణలో లేదు. పైగా ఈ తలాక్ వల్ల విడిపోయిన భార్యాభర్తలు ఇతర ఏ మతంతో పోల్చి చూసినా చాలా తక్కువ మందే ఉన్నారు. ముస్లిం స్త్రీకి ఆదినుంచే విడిపోయే హక్కు అంతే కాదు, ఇస్లాం చట్టంలో పురుషులకు తలాక్ ఎలా ఉన్నదో, అలాగే ముస్లిం స్త్రీలకు కూడా ‘కులా’ (విడిపోయే హక్కు) ఉన్నది. ముస్లిం స్త్రీ తన భర్త దుష్ప్రవర్తన వల్ల తానెంత వ్య«థ చెందుతున్నదో వారి మతగురువు ముందు వివరించి, తాను కూడా ‘కులా’ కోరవచ్చు. ఆయన ఇతర పెద్దలతో సంప్రదించి, ఆ హక్కు ఆమెకు మంజూరు చేయనూవచ్చు. అయితే అలాంటి హక్కు ద్వారా విడిపోయిన స్త్రీల సంఖ్య చాలా స్వల్పమే. ఒక ముస్లిం మతంలోనే స్త్రీలకు అన్యాయం జరుగుతున్నదని వాదించడం అసంబద్ధం. నిజానికి ఏ మతంలోనూ లేనట్లుగా ముస్లిం మతంలో చాలా ముందునుంచే స్త్రీకి ఆస్తిలో వాటా హక్కు ఉంది. ఆ మతంలోని మౌఢ్య పార్శా్వన్ని మాత్రమే ప్రచారం చేస్తున్నారు కానీ.. వైవాహిక బంధంలో పురుషునికెంత గౌరవం, హక్కూ ఉన్నదో స్త్రీకి కూడా అంతే సమానంగా ఉండాలన్నది ఇస్లాం మత సూత్రాలలో ఒకటి. ముస్లిం స్త్రీలకు జరుగుతున్న అన్యాయాన్ని తొలగించేందుకు అని చెప్పి ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో నేటి పాలకుల చిత్తశుద్ధి ప్రశ్నార్థకం అయ్యే రీతిలో వ్యవహరిస్తే అది ప్రజల మధ్య విద్వేషాలకు, దేశంలో మతపరమైన అశాంతికి ఆస్కారం ఇచ్చే ప్రమాదం ఉంది. ఉదా‘‘ దేశంలో 24 లక్షలమంది భర్తలు వదిలివేసిన స్త్రీలు ఉన్నారు. వీరిలో అత్యధికులు ముస్లిమేతర స్త్రీలే. వారు ఎంతో వ్యథకు, బతుకుబాధలకు గురవుతున్నారు. ఈ సందర్భంగా ఈ మహిళలందరికీ న్యాయం చేసే రీతిలో చట్టం రావాలి. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఈ అంశాన్ని పార్లమెంటులోనే నేరుగా ప్రస్తావించినట్లున్నారు. అలా భర్తచేత తిరస్కృతులైన ఒంటరి భార్యలందరికీ న్యాయం జరిగే చట్టం చేయడం అవసరం. దాదాపు అంతరించిపోతున్న ప్రస్తుత తలాక్ చట్టంతోపాటు, అదేదో ముస్లిం మతాచారాల పట్ల వ్యతిరేకత అన్న భావనకు తావు లేకుండా ఉండటం కోసమైనా మామూలు చట్టం చేయడం అత్యవసరం. పైగా, బహుభార్యత్వం అనే దురాచారం ముస్లి మతాచారంలోనే కాదు.. హిందూమతంలో సైతం ‘ఆరాధనీయంగా’ ఉండటం ఆశ్చర్యమేమీ కాదు. చరిత్ర ప్రకారం మహమ్మద్ ప్రవక్తకు పలువురు భార్యలట. అందులో అనాథలు, వితంతువులు, పతితులు ఉన్నారని చెబుతారు. అలాంటి మహిళ లను ఉద్ధరించేందుకోసమే ఆయన అన్ని వివాహాలు చేసుకున్నారని విశ్వసించే వారూ ఉన్నారు. ఇక హిందూ దేవుళ్ల గురించి మనకు తెలిసిందే. మన కలియుగ దైవం వేంకటేశ్వర స్వామినే తీసుకుందాం. ‘శ్రీదేవి వంకకు చిలి పిగా చూడకు, అలివేలుమంగకు అలుక రానీయకు’ అంటూ ఆ జగత్పతి సైతం ఇద్దరు భార్యలను ఎలా ముద్దుగా చూసుకోవాలో సూచిస్తూ గానం చేస్తాం. ప్రవక్త మాదిరే కృష్ణావతారంలో శ్రీకృష్ణుడు సైతం తాను రామావతారంలో ఉన్నప్పుడు తనను ఆరాధించిన వారందరికీ ఈ అవతారంలో కుదరదు (ఏకపత్నీవ్రత) కనుక వచ్చే కృష్ణావతారంలో మీరందరూ గోపికలుగా జన్మించినప్పుడు మిమ్మల్ని స్వీకరిస్తాను అని వాగ్దానం చేశాడట. అందుకే కృష్ణుడికి పద్నాలుగు వేలమంది గోపికలు అని భక్తులు అంటుంటారు. మౌనం అంగీకారమా? అర్ధాంగీకారమా? ఎవరి విశ్వాసాలు వారివి కావచ్చు. కానీ మన లౌకిక వ్యవస్థలు అన్ని మతాలను సమానంగా చూడాలి. ప్రభుత్వం మతం విషయంలో ఒక్క మతాన్ని కూడా పక్షపాతంతో చూడరాదు. మతం వేరు, మతతత్వం వేరు. మన లౌకిక వ్యవస్థ మతాన్ని నిషేధించదు. అదే సమయంలో మతతత్వాన్ని సహించదు. దురదృష్టవశాత్తూ బీజేపీ నేతలు, మంత్రులు కూడా పరమత ద్వేషం ప్రవచిస్తున్నప్పుడు, వారిని మోదీవంటివారు కనీసం బహిరంగంగా ఖండించని ఫలితంగానే, మొన్న తలాక్‌పై చర్చ సందర్భంగా, ‘హిందూ సంస్కృతిలో కలవని ఇతరులకు, ఈ దేశంలోని ముస్లింలకు స్థానం ఉండదు, తమ ఇష్టం వచ్చిన దేశం వెళ్లిపోవచ్చు’నని ఆ పార్టీ నేతలు నిర్భయంగా ప్రకటిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో మోదీ పాటించే మౌనవ్రతం అర్ధాంగీకారమేనా? ఇలా మతమూ, మతతత్వ ప్రాతిపదికన కాకుండా, మహిళలకు ఇంతకంటే గుణాత్మకంగా మెరుగైన జీవనం లభించాలంటే సహేతుకమైన సవరణలతో తలాక్ బిల్లు వంటివాటిని ఆమోదించడం అవసరం. అంతకంటే ముఖ్యంగా చట్టసభలలో కనీసం 33 శాతం స్థానాల్లో రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలి. అప్పుడే మహిళలకు వాస్తవికంగా మేలు చేకూర్చే చట్టాలు రూపొందే అవకాశం పెరుగుతుంది. కానీ దశాబ్దాలుగా, మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడం లేదు. ఇప్పుడు బీజేపీకి పార్లమెంటులో సరిపడా మెజారిటీ ఉంది. ఈ తలాక్ బిల్లు సందర్భంగా ఆ పార్టీ నేతలు, ముస్లి మహిళలకు న్యాయం కలిగించాల్సిన అవసరాన్ని వివరించారు. ప్రతిపక్షాలు సైతం కాస్త సవరణ కోరుతున్నాయే తప్ప గంపగుత్తగా ఈ బిల్లును వ్యతిరేకించడం లేదు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించేందుకు కూడా ఇదే అదును. త్వరలో పార్లమెంటు ఎన్నికలు రాబోతున్నాయి. ఏ పార్టీ అయినా సరే మహిళా శ్రేయస్సు అటుంచితే, మహిళల ఓట్లను మరవజాలదు. పైగా అన్ని పార్టీలూ తరతమ భేదాలతో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించేవే. చట్టసభలో సాధారణ రిజర్వేషన్ అమలయ్యేందుకు లేని అభ్యంతరం మహిళా రిజర్వేషన్ బిల్లుకు మాత్రం ఎందుకుండాలి? పైగా ప్రస్తుత పరిస్థితిలో ఇది సహేతుకమైన డిమాండే. లేకుంటే ఇప్పుడు చట్టసభలలో అసమానతలు గోచరిస్తున్నాయి. ప్రజలలో నూటికి 20 శాతం గర్భదరిద్రులు కాగా 60 శాతం మంది పేదరికం అనుభవిస్తున్నారు. కానీ పార్లమెంటులో నూటికి 50 శాతంపైగా సభ్యులు కోటీశ్వరులు. వారిలో 10 శాతం మంది మరీ కోటీశ్వరులు. మన ఓటర్లలో దాదాపు 50 శాతం మంది మహిళలు. చట్టసభల్లో నూటికి 10–12 మంది మాత్రమే మహిళలు. ప్రజానీకంలో అగ్రకులాలు, ఆధిపత్య కులాలు 15–20 శాతం ఉంటారు. పార్లమెంటులో మాత్రం వీరు 50 శాతం మించే ఉంటారు. ఇది వాస్తవం. దీన్ని బట్టి చూస్తే పార్లమెంటును నిజమైన ప్రజాప్రాతినిధ్య సంస్థగా మార్చాల్సిన అవసరం ఉంది. మతం, మతతత్వం, దైవం ఇవన్నీ విశ్వాసాలు. అందుకే మార్క్స్ మాటలు గుర్తుంచుకోవాలి. ‘తమ కష్టాలకు, కన్నీళ్లకు కారణం తెలియని వ్యక్తి మతం ఒడిలో సేద తీరుతాడు. బాధాతప్త హృదయం విడిచే వేడి నిట్టూర్పు వంటిది మతం’. కనుక కష్టాలకు, కన్నీళ్లకు కారణాలను తెలుసుకుని నివారించుకోగలిగిన మేర వేడి నిట్టూర్పులు, మతం ఒడిలో సేద తీరడాలు ఉండవు. కావలసింది అదే. మన కృషి ఆ దిశగా సాగాలి. డాక్టర్ ఏపీ విఠల్ వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు మొబైల్ : 98480 69720 -
ఒక్క రోజు కాపురం చేసి.. పోస్టులో తలాక్!
యాకుత్‌పురా: రెండో వివాహం చేసుకొని ఒక్క రోజు కాపురం చేసి పోస్టుద్వారా విడాకులు పంపిన ఓ వ్యక్తిని భవానీనగర్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్సై రమేశ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. కూకట్పల్లి ప్రకాశం పంతులునగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ హనీఫ్ (38), బహదురున్నీసా (32) దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బహదురున్నీసాకు పలుమార్లు గర్భస్రావం కావడంతో పిల్లలు పుట్టే అవకాశం లేదని వైద్యులు తెలిపారు. అయితే మగ పిల్లవాడు కావాలని నిర్ణయించుకున్న హనీఫ్ రెండో వివాహం చేసుకునేందుకు భార్య బహదురున్నీసాను ఒప్పించాడు. తలాబ్‌కట్టా ప్రాంతానికి చెందిన ఫర్హీన్ బేగంను రెండో వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. అయితే మొదటి భార్య నుంచి విడాకుల పత్రం లేకపోవడంతో ఖాజీ నిఖా చేసేందుకు నిరాకరించడంతో మరుసటి రోజు అందజేస్తామని చెప్పి గత నెల 9న మొఘల్‌పురాలోని కన్వీల్లా ఫంక్షన్ హాల్లో ఫర్హీన్‌ను వివాహం చేసుకున్నాడు. ఆమెను కూకట్‌పల్లిలోని తన ఇంటి సమీపంలోనే ఓ అద్దె ఇంట్లో ఉంచాడు. పెళ్లి రోజు రాత్రి పర్హీన్‌తో గడిపిన హనీఫ్ ఉదయం వెళ్లిపోయాడు. ఆ తరువాత ఫర్హీన్‌కు ఫోన్ చేసి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరానని అప్పటి వరకు తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాలని సూచించాడు. అంతేగాకుండా ఈ నెల 18న పోస్టులో విడాకుల పత్రాన్ని పంపించాడు. తాను పంపిన విడాకుల పత్రంలో పెళ్లి ఇష్టం లేదు... అనారోగ్యం కారణంగా విడాకులు తీసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. దీనిపై బాధితురాలు ఫర్హీన్ బేగం ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో పాటు, గురువారం రాత్రి భవానీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు శుక్రవారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
వాట్సాప్ తలాక్‌లపై న్యాయ పోరాటం
⇒ భర్తలపై హైకోర్టులో పిటిషన్ వేసిన నూర్, ఫాతిమా ⇒ ఇలాంటి వాటి నుంచి ముస్లిం మహిళలను రక్షించాలని వినతి ⇒ సోమవారం విచారించనున్న కోర్టు సాక్షి, హైదరాబాద్: అమెరికా నుంచి వాట్సాప్ ద్వారా విడాకులు పంపిన తమ భర్తలపై ఇద్దరు భార్యలు న్యాయ పోరాటానికి దిగారు. ట్రిపుల్ తలాక్ విధానం ద్వారా విడాకులు ఇచ్చే క్రమంలో అక్రమ మార్గాలను అనుసరించకుండా తగిన మార్గదర్శకాలను రూపొందిం చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరు తూ హైదరాబాద్‌కు చెందిన మెహరీన్ నూర్, సయ్యదా హీనా ఫాతిమా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్రమ మార్గాల ద్వారా తలాక్ ఇచ్చే సందర్భాల్లో అందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఖాజీలను నియంత్రిస్తూ ఆదేశాలివ్వాలని కోరారు. వ్యాజ్యంలో కేంద్ర మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి, రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర వక్ఫ్‌బోర్డ్ సీఈవో, శాలిబండ సదర్ ఖాజీ, గోల్కొండ సదర్ ఖాజీలతో పాటు భర్తలు ఉస్మాన్ ఖురేషీ, సయ్యద్ ఫయాజుద్దీన్ ఖురేషీ, అత్తమామలు మహ్మద్ అబ్దుల్ హఫీజ్, అలియా ఖుల్సుంలను ప్రతి వాదులుగా పేర్కొన్నారు. వ్యా జ్యంపై న్యాయ మూర్తి జస్టిస్ రామలింగేశ్వరరావు సోమ వారం విచారణ జరపనున్నారు. ఏకపక్ష నిర్ణయం సరికాదు... తన తప్పేమీ లేకపోయినప్పటికీ అమెరికాలో ఉంటున్న తన భర్త ఉస్మాన్ ఖురేషీ ఈ ఏడాది జనవరి 24న తనకు వాట్సాప్ ద్వారా తలాక్.. తలాక్.. తలాక్.. అంటూ మెసేజ్ పంపారని నూర్ తెలిపారు. ప్రసవం తరువాత మెట్టినింటికి వెళ్లినప్పుడు అత్త మామలు తనను ఇంట్లోకి రాకుండా అడ్డుకొని.. ఫయా జుద్దీన్ వాట్సాప్ ద్వారా తలాక్ పంపారని చెప్పారని, అప్పుడే తనకా విషయం తెలిసిందని ఫాతిమా వివరించారు. ఇది ముస్లిం చట్టం, రాజ్యాంగ నిబంధనలు, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని తెలిపా రు. çసరైన కారణాలు చూపకుం డా ఏకపక్షంగా తలాక్ ఇవ్వడం సరికాదన్నారు. ఇలా అక్రమ మార్గాల ద్వారా ఇచ్చే తలాక్‌ల నుంచి అమాయక ముస్లిం మహిళలను రక్షించేందుకు మార్గదర్శకాలు రూపొందించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోర్టును కోరారు. మరో పెళ్లికి యత్నం... వాట్సాప్ ద్వారా తలాక్‌లు పంపిన తరువాత తమ భర్తలు తమను బయటకు నెట్టి మరో పెళ్లి చేసుకోవాలని చూస్తున్నట్టు నూర్, ఫాతిమా తెలిపారు. తమ అత్తమామలకు నలుగురు కుమారులైతే... ముగ్గురికి వివాహమైందని, వారు ఇప్పటికే తమతో పాటు ఏడుగురికి ఇలానే తలాక్ ఇచ్చారని తెలిపారు. దీన్ని ప్రశ్నించినందుకు అత్తమామలు తమపై హత్యాయత్నానికి పాల్పడ్డారని, దీనిపై తాము పోలీసులకు ఫిర్యాదు కూడా చేశామన్నారు. -
షరియత్ రక్షణకు ముస్లింలు ఏకం కావాలి
కడప కల్చరల్: ఇస్లాం ధర్మాలను, నియమాలకు నిలయంగా ఉన్న షరియత్‌ను కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు దెబ్బతీసేలా ఉన్నాయని, దీన్ని రక్షించుకునేందుకు ముస్లింలందరూ ఏకం కావాలని పలువురు ముస్లిం పెద్దలు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక నేక్‌నామ్‌ఖాన్ కళాక్షేత్రంలో ముస్లిం మత గురువులు మగ్దూం మౌలాన అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగసభలో ముస్లిం మత గురువులు, ప్రముఖులు మాట్లాడారు. కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా మాట్లాడుతూ హిందూ, ముస్లింలు దేశంలో అన్నదమ్ముల్లా కలిసిమెలిసి జీవిస్తున్నారని, బీజేపీ ప్రభుత్వం ఈ ఐక్యతను దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ప్రత్యేకించి ముస్లిం పర్సనల్‌లా విషయంలో జోక్యం కల్పించుకుని తమలో ఆందోళన కల్పించడం భావ్యం కాదన్నారు. ఇస్లాం చట్టాలు దైవం ప్రసాదించిన పవిత్ర ఖురాన్ ద్వారా ఏర్పడినవని, ముస్లింలు ఆరాధించే వీటిని మార్చాలనుకోవడం చట్టవిరుద్ధమన్నారు. కొందరు అభాగ్యులైన ముస్లిం మహిళలపై బీజేపీ ప్రభుత్వం చూపుతున్న కపట ప్రేమ అందరికీ తెలిసిందేనని, ముఖ్యంగా మోదీ తన భార్య విషయంలో కూడా ఈ ప్రేమను నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ఇంకా పలువురు మత గురువులు, ముస్లిం ప్రముఖులు ముస్లిం పర్సనల్ లాలో జోక్యం కల్పించుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. సభలో అహ్మద్‌పీర్ షహమీరి, అమీర్‌బాబు, వీణా అజయ్‌కుమార్, నజీరుల్లా సాహెబ్, సుభాన్‌బాషా, నజీర్ అహ్మద్, మౌల్వి సయీద్, డాక్టర్ గౌస్‌పీర్, ఎస్ఏ సత్తార్, సయ్యద్ అహ్మద్ (బాబు), సలావుద్దీన్ తదిరతులు పాల్గొన్నారు. -
‘తలాక్’ ముస్లింల అంతర్గతం
• నష్టాల తీవ్రతపై ముస్లిం సమాజమే విశ్లేషించుకోవాలి: ఆరెస్సెస్ • దీనిపై మహిళలకు కోర్డులో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం • అయోధ్యలో మందిరం కాక మరే కట్టడాన్నీ ఊహించలేం • ముగిసిన జాతీయ కార్యవర్గ సమావేశాలు సాక్షి, హైదరాబాద్: తలాక్ చెప్పటం ద్వారా విడాకులు తీసుకునే వ్యవహారం పూర్తిగా ముస్లింల అంతర్గత విషయమని ఆరెస్సెస్ స్పష్టంచేసింది. అయితే దాని ద్వారా ఎదురవుతున్న నష్టాల తీవ్రతపై ముస్లిం సమాజం విశ్లేషించుకోవాల్సిన అవసరమైతే ఉందని అభిప్రాయపడింది. ముస్లిం మహిళలే దానిపై కోర్టుకు వెళ్లారని.. వారు కోరుకుం టున్నట్టుగా న్యాయం జరుగుతుందని ఆశి స్తున్నట్టు పేర్కొంది. ఉమ్మడి పౌరస్మృతి విషయంలోనూ ఆచితూచి స్పందించింది. అందరి సంస్కృతీ సంప్రదాయాలను గౌరవిస్తూ వివక్ష లేని న్యాయవ్యవస్థ ఏర్పడాల ని ఆశిస్తున్నట్టు వెల్లడించింది. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లోని అన్నోజిగూడలో మూడ్రోజులుగా జరుగుతున్న ఆరెస్సెస్ జాతీయ కార్యవర్గ సమావేశాలు మంగ ళవారంతో ముగిశాయి. ప్రపంచవ్యాప్త పరిణామాలు-భారత్‌పై ప్రభావం, దేశంలో రాజ కీయ, ఆర్థిక, సామాజిక పరిణామాలు, ఉగ్రవాదం, హిందూత్వపై జరుగుతున్న దాడు లు తదితర అంశాలపై ఇందులో కూలంకషంగా చర్చించారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా సహా పలువురు బీజేపే నేతలు ఇందులో పాల్గొన్నారు. చివరి రోజున సమావేశాల సంక్షిప్త సమాచారాన్ని ఆరెస్సెస్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి (సర్కార్యవాహ) భయ్యాజీ జోషీ మీడియా కు వివరించారు. ఈ సందర్భంగా తలాక్‌పై ప్రశ్నించగా.. దేశంలో లింగ వివక్షకు చోటుండకూడదన్నది ఆరెస్సెస్ సిద్ధాంతమని చెప్పారు. అది ముస్లింల అంతర్గత విషయమని చెప్పారు. రామ మందిరం నిర్మించాల్సిందే... అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం మూడు దశాబ్దాలుగా ఆరెస్సెస్ ఎదురుచూస్తోందని భయ్యాజీ చెప్పారు. ఆ స్థలంలో రామమందిరం తప్ప మరే నిర్మాణాన్ని ఊహించుకోలేమన్నారు. అలహాబాద్ కోర్టు తీర్పు తర్వాత మందిర నిర్మాణం జరగాలన్న విషయం స్పష్టమైనా... ప్రస్తుతం ఆ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున తీర్పు కోసం అంతా వేచి చూడాలన్నారు. ఇటీవల చైనా వస్తువులను నిషేధించాలనే డిమాండ్ బాగా ఉన్నప్పటికీ ఆరెస్సెస్ మాత్రం అన్ని విదేశీ వస్తువుల విషయంలో ఇదే అభిప్రాయంతో ఉందన్నారు. గో సంరక్షణ నినాదాన్ని ఇక ముందు కూడా కొనసాగిస్తామని చెప్పారు. కళకు ఎల్లలు ఉండవన్న విషయంలో తమకు మరో అభిప్రాయం లేనప్పటికీ మన సినీ నిర్మాతలు పాకిస్తాన్ నటులపై ఆధారపడటం సరికాదన్నారు. మన దేశంపై ద్వేషం చిమ్ముతూ మన సినిమాల్లో నటించొద్దని పాక్ భావిస్తున్నప్పుడు మన నిర్మాతలు పాక్ నటుల కోసం ఎందుకు తపన పడాలని ప్రశ్నిం చారు. సర్జికల్ స్రైక్స్ విషయంలో ప్రభుత్వం, సైనికుల ధీరత్వాన్ని ఆరెస్సెస్ అభినందిస్తోందన్నారు. మరిన్ని గ్రామాలకు ఆరెస్సెస్ ఆరెస్సెస్ మరిన్ని గ్రామాలకు విస్తరించేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుందని భయ్యాజీ తెలిపారు. ప్రస్తుతం 44వేల గ్రా మాల్లో 70వేల శాఖలతో కార్యకలాపాలు సాగుతున్నాయని, వచ్చే మార్చి నాటికి ఈ సంఖ్య 75వేలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. వచ్చే సమావేశాలకు తమిళనాడు వేదికవుతుందని వెల్లడించారు. విలేకరుల సమావేశంలో ఆరెస్సెస్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ మన్మోహన్జీ వైద్య, సహ ప్రచార ప్రముఖ్ నందకుమార్ పాల్గొన్నారు. హిందువులపై దాడులను అడ్డుకోవాలి బెంగాల్, తమిళనాడు, కర్ణాటక, కేరళ తదితర ప్రాంతాల్లో హిందువులు, మరీ ముఖ్యంగా ఆరెస్సెస్, హిందూ సంస్థల కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని భయ్యాజీ ఆందోళనవ్యక్తం చేశా రు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ దాడులకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. -
తలాక్ పద్ధతిపై ముస్లిం మహిళల పోరాటం!
న్యూఢిల్లీః తలాక్ సిస్టమ్ ను తొలగించాలంటూ దేశంలోని ఏభై వేలకుపైగా ముస్లిం మహిళలు పోరాటం ప్రారంభించారు. మూడుసార్లు తలాక్ చెప్తే విడాకులు ఇచ్చినట్లేనన్న ముస్లిం పర్సనల్ లా లోని ఆచారానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ ప్రారంభించారు. ముస్లిం మతంలో ఉన్న తలాక్ విడాకుల పద్ధతిని నిషేధించాలని కోరుతూ దాఖలు చేసే పిటిషన్ కోసం ఇప్పటివరకూ సుమారు 50 వేల సంతకాలు సేకరించారు. భారతీయ ముస్లిం మహిళల (బీఎంఎంఏ) సంఘం తలాక్ పద్ధతిని నిషేధించాలని కోరుతూ పోరాటం ప్రారంభించింది. దేశవ్యాప్తంగా తాము వేయబోయే పిటిషన్ కు మద్దతివ్వాలని కోరుతున్న సంఘం.. జాతీయ మహిళా కమిషన్ కూడ తమకు సహకరించాలని, ముస్లిం మతంలో ఉన్న తలాక్ పద్ధతి నిషేధించడంలో జోక్యం చేసుకోవాలని కోరుతోంది. తమ పిటిషన్ కు మద్దతుకోసం సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టినట్లు బీఎంఎంఏ సహ వ్యవస్థాపకులు జికియా సోమన్ తెలిపారు. ఇప్పటివరకూ ఏభై వేల సంతకాలు సేకరించామని, మతంలోని కొందరు పురుషులు సైతం తమకు మద్దతిస్తున్నారని అన్నారు. ముస్లిం మతంలోని తలాక్ పద్ధతిపై చేపట్టిన సర్వేలో 90 శాతం పైగా మహిళలు తలాక్ విడాకుల విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తేలిందన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో తమకు మద్దతునిచ్చేవారినుంచి మరిన్ని సంతకాలు సేకరించి పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సంస్థ సభ్యురాలు నూర్జహా సాఫియా తెలిపారు. ఖురాన్ లో కూడ ఎక్కడా ఇటువంటి తలాక్ పద్ధతి అమల్లో ఉన్న దాఖలాలు లేవని, నేషనల్ ఉమెన్ కమిషన్ ఛైర్ పర్సన్ లలిత కుమార మంగళమ్ కు పంపించే లేఖలో కూడ బీఎంఎంఏ పేర్కొంది. ఈ విషయంలో ముస్టిం మత పెద్దలను, అధికారులను సైతం కలసి, దేశంలో ఇతర మహిళలకు అమలౌతున్న న్యాయమైన నిబంధనలే తమకు అమలయ్యేట్లు కోరుతామని బీఎంఎంఏ పేర్కొంది. అయితే ముస్లిం పర్సనల్ లా ను పూర్తిగా మార్చాలంటే సమయం పడుతుందని, కానీ ట్రిపుల్ తలాక్ విషయంలో లక్షలమంది ముస్టిం మహిళలకు ఉపశమనం లభిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే తమ పోరాటాన్ని కొందరు మత గురువులు వ్యతిరేకిస్తున్నారని, వారు తలాక్ ను అల్లా విధించిన చట్టంగా నమ్ముతారని మహిళలు అంటున్నారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడ ఈ విషయాన్ని వ్యతిరేకించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. -
‘తలాక్’ రద్దుకు ఒప్పుకోవద్దు
ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయం న్యూఢిల్లీ: మూడుసార్లు తలాక్ అనడం ద్వారా విడాకులిచ్చే సంప్రదాయాన్ని రద్దు చేసే ఏ చర్యనైనా వ్యతిరేకించాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్బీ) నిర్ణయించింది. తలాక్ సంప్రదాయాన్ని రద్దు చేయాలంటూ ఉత్తరాఖండ్‌కు చెందిన షరయా బానో అనే మహిళ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో ప్రతివాదిగా కోర్టులో వాదనకు సిద్ధమైంది. ఆల్ ఇండియా ముస్లిం విమెన్ పర్సనల్ లా బోర్డు(ఏఐఎండబ్ల్యూపీఎల్బీ) చీఫ్ షైస్తా అంబార్ సైతం ‘తలాక్’ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ సంప్రదాయాన్ని చాలామంది ముస్లిం మహిళలు వ్యతిరేకిస్తున్నారు. కేంద్రం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ కూడా తలాక్‌ను, బహు భార్యత్వాన్ని వ్యతిరేకించింది. కేవలం తలాక్ అని చెప్పి విడాకులు ఇచ్చేందుకు వీలు కల్పించే షరియా చట్టంతో మహిళలు తీవ్ర అభద్రతాభావానికి గురవుతున్నారని స్పష్టంచేసింది. -
‘ముస్లిం పెళ్లి చట్టాల’పై నివేదిక ఇవ్వండి: సుప్రీం
న్యూఢిల్లీ: ముస్లిం వైవాహిక చట్టాలపై అధ్యయనానికి నియమించిన కమిటీ రూపొందించిన నివేదికను 6 వారాల్లోగా తమ ముందుంచాలని సోమవారం సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ముస్లిం పర్సనల్ లా ప్రకారం అనుసరిస్తున్న బహుభార్యత్వం, తలాక్ విధానాలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై ఈ మేరకు ఆదేశించింది. ఈ వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ థాకూర్, న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్‌లతో కూడిన ధర్మాసనం విచారిస్తూ.. కమిటీ నివేదికను తమ ముందుంచాలని అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది. -
తలాక్‌పై ఏమంటారు?
న్యూఢిల్లీ: ఇస్లాం మతం ప్రకారం తలాక్ చెప్పి విడాకులిచ్చే సాంప్రదాయాన్ని, నిఖా హలాలాను మార్పులు చేసే విషయంపై అభిప్రాయం చెప్పాలంటూ సుప్రీం కోర్టు మంగళవారం కేంద్రాన్ని కోరింది. ముస్లిం వ్యక్తి తన భార్యకు విడాకులిచ్చేందుకు తలాక్ అని మూడుసార్లు చెబితే సరిపోతుంది. తన భర్త హింసించాడని, వరకట్న వేధింపులకు గురిచేసిందని.. మూడుసార్లు తలాక్ చెప్పి వదిలించుకున్నారంటూ షాయరా బానో అనే ముస్లిం మహిళ వేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. మానసికంగా, శారీరకంగా కుంగిపోయిన ఆ మహిళ.. ముస్లిం పర్సనల్ లా సెక్షన్‌ను ప్రశ్నిస్తూ కోర్టును ఆశ్రయించింది. ఈమె ఫిర్యాదుపై స్పందించిన ధర్మాసనం.. దీనిపై వివరణ ఇవ్వాలని మైనారిటీ వ్యవహారాల శాఖను ఆదేశించింది.