మహ్మద్ హనీఫ్
యాకుత్‌పురా: రెండో వివాహం చేసుకొని ఒక్క రోజు కాపురం చేసి పోస్టుద్వారా విడాకులు పంపిన ఓ వ్యక్తిని భవానీనగర్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్సై రమేశ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. కూకట్‌పల్లి ప్రకాశం పంతులునగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ హనీఫ్ (38), బహదురున్నీసా (32) దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బహదురున్నీసాకు పలుమార్లు గర్భస్రావం కావడంతో పిల్లలు పుట్టే అవకాశం లేదని వైద్యులు తెలిపారు. అయితే మగ పిల్లవాడు కావాలని నిర్ణయించుకున్న హనీఫ్ రెండో వివాహం చేసుకునేందుకు భార్య బహదురున్నీసాను ఒప్పించాడు.
తలాబ్‌కట్టా ప్రాంతానికి చెందిన ఫర్హీన్ బేగంను రెండో వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. అయితే మొదటి భార్య నుంచి విడాకుల పత్రం లేకపోవడంతో ఖాజీ నిఖా చేసేందుకు నిరాకరించడంతో మరుసటి రోజు అందజేస్తామని చెప్పి గత నెల 9న మొఘల్‌పురాలోని కన్వీల్లా ఫంక్షన్ హాల్‌లో ఫర్హీన్‌ను వివాహం చేసుకున్నాడు. ఆమెను కూకట్‌పల్లిలోని తన ఇంటి సమీపంలోనే ఓ అద్దె ఇంట్లో ఉంచాడు. పెళ్లి రోజు రాత్రి పర్హీన్‌తో గడిపిన హనీఫ్ ఉదయం వెళ్లిపోయాడు. ఆ తరువాత ఫర్హీన్‌కు ఫోన్ చేసి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరానని అప్పటి వరకు తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాలని సూచించాడు. అంతేగాకుండా ఈ నెల 18న పోస్టులో విడాకుల పత్రాన్ని పంపించాడు. తాను పంపిన విడాకుల పత్రంలో పెళ్లి ఇష్టం లేదు... అనారోగ్యం కారణంగా విడాకులు తీసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. దీనిపై బాధితురాలు ఫర్హీన్ బేగం ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో పాటు, గురువారం రాత్రి భవానీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు శుక్రవారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.