మతాతీత సంస్కరణలే మేలు | other than religious reforms is good | Sakshi
Sakshi News home page

మతాతీత సంస్కరణలే మేలు

Published Fri, Jan 19 2018 1:21 AM | Last Updated on Fri, Jan 19 2018 1:22 AM

other than religious reforms is good - Sakshi

విశ్లేషణ

ముస్లిం స్త్రీలకు జరుగుతున్న అన్యాయాన్ని తొలగించేందుకు అని చెప్పి ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో నేటి పాలకుల చిత్తశుద్ధి ప్రశ్నార్థకం అయ్యే రీతిలో వ్యవహరిస్తే అది ప్రజల మధ్య విద్వేషాలకు దారితీసి, దేశంలో మతపరమైన అశాంతికి ఆస్కారం ఇచ్చే ప్రమాదం ఉంది. దేశంలో 24 లక్షలమంది భర్తలు వదిలివేసిన స్త్రీలు ఉన్నారు. వీరిలో అత్యధికులు ముస్లిమేతర స్త్రీలే. వారు ఎంతో వ్యధకు, బతుకు బాధలకు గురవుతున్నారు. ఈ సందర్భంగా ఈ మహిళలందరికీ న్యాయం చేసే రీతిలో చట్టం రావాలి.

ఇస్లాం మతం ప్రకారం తలాక్‌ తలాక్‌ తలాక్‌ అని ఒక భర్త మూడు సార్లు ఉచ్చరించినా లేదా ఫోన్‌లో గానీ, వాట్సాప్‌ వంటి వానిలో గానీ, మెసేజ్‌ ద్వారా సందేశం పంపినా ఆ భార్యకు భర్తతో విడాకులు జరిగిపోయినట్లేనని ప్రచారం! అందువలన ముస్లిం మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదనీ, ఈ విషాదస్థితి నుంచి వారిని విముక్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం.. ముస్లిం మహిళలకు సైతం మిగిలిన స్త్రీల వలే సమన్యాయం కలిగించేందుకు చట్టం తీసుకురావాలన్న ఉద్దేశంతో ఒక బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. రాజ్యసభలో ఆ బిల్లు ఆమోదం పొందలేదు. రాజ్యసభలో ప్రతిపక్షాలకు మెజారిటీ ఉంది కనుక ఆ బిల్లును స్టాండింగ్‌ కమిటీ వివిధ పార్టీల ప్రతి నిధుల బృందానికి పంపి ఆసాంతం పరిశీలించిన తర్వాత, ఆ కమిటీ ఆమోదంతోనే బిల్లు ప్రవేశపెట్టాలని ప్రతిపక్షాల వాదన!


మూడుసార్లు తలాక్‌ అని చెప్పినంత మాత్రానే స్త్రీకి అన్యాయం చేస్తూ విడాకులు పొందే ఇస్లాం మత చట్టాన్ని రద్దు చేస్తే ప్రతిపక్షాలకు వ్యతిరేకత ఎందుకు? ముస్లిం మతతత్వవాదుల కొమ్ముకాయడం తప్ప మరేమిటి? అని మోదీ ప్రభుత్వ పెద్దల అభియోగం. సాధారణ దృష్టితో చూస్తే ఇది సవ్యం గానే తోస్తుంది. అయితే ఆ బిల్లు ప్రకారం అలా విడాకులు పొందిన ముస్లిం భర్తకు, మూడేళ్ల కఠిన కారాగారం విధించే అవకాశం ఉండటమే కాకుండా తాను విడాకులు ఇచ్చిన భార్యకు పోషణ నిమిత్తం కొంత భాగాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. నిజానికి గృహ హింసతో స్త్రీని శారీరకంగా, మానసికంగా హింసి స్తే–ఎలాగూ గృహహింస నిరోధక చట్టం ప్రకారం శిక్ష విధింపవచ్చు. ఇది అన్ని మతాల వారికి సమానమే. అలాంటప్పుడు ఒకే నేరానికి రెండు శిక్షలా అన్న సంగతి అటుంచి, భర్తను జైలులో నిర్బంధిస్తే, విడాకులు పొందిన భార్యకు పోషణ నిమిత్తం భరణం ఇమ్మంటే ఎలా తెచ్చి ఇస్తారు? అని మరో ధర్మసందేహం! ఇవేవీ అధిగమించలేని ఆటంకాలు కావు.


కాలం చెల్లుతున్న తలాక్‌పై ఇంత రభసా..?

పైకి ఏదో స్త్రీ జనోద్ధరణ కార్యంగా ప్రచారం చేసుకునే ఈ బిల్లు ముస్లిం మత వ్యతిరేక దుష్ప్రచారానికి ఆస్కారమిచ్చే రీతిలో ఉంది. ఇలా 3 సార్లు తలాక్‌ చెప్పి విడాకులు పొందే అవకాశం నేటి ముస్లిం మత ఆచరణలో లేదు. అలా విడాకులు పొందేందుకు ఇస్లాం ప్రకారమే ఆచరణలో మొత్తం 5 నెలల వ్యవధిలో 3 సార్లు అలా తలాక్‌ అనాల్సి ఉంటుంది. ఈ లోపు భార్యాభర్తలకు చెందిన ఇరుపక్షాల పెద్దలు కూర్చుని, పరస్పర వాదనలు విని వారిని కలి పేందుకు ప్రయత్నించి, అవన్నీ విఫలమైన తర్వాతే తలాక్‌ అమలవుతుంది.

నిజానికి కలహాల కాపురంలో పెద్దల జోక్యంతో పరిష్కారం కోసం జరిగే, సామరస్యపూర్వక యత్నం ఏ మతంలోని భార్యాభర్తల విషయంలోనైనా వాంఛనీయమే కదా. కాదు.. మా మతంలో అల్లా ఆదేశించిన దానిని సవరించే హక్కు పాలకులకు, ప్రభుత్వానికి ఎక్కడిది అని ప్రశ్నించే మత పెద్దలు అన్ని మతాలలో ఉండకపోరు. 4 వర్ణాలు అనే కులవిభజన నేనే చేశాను అని సాక్షాత్తూ శ్రీకృష్ణ పరమాత్మ ప్రకటించాడు. మరి అస్పృశ్యతతో సహా పరమ దుర్మార్గమైన ఈ వర్ణ వ్యవస్థ కొనసాగాల్సిందేనని ఎవరైనా హిందూ మతతత్వవాదులు అంటే అంగీకరించలేం కదా. అదలా ఉంచినా, హిందూమతంలో సతీసహగమనం, బహుభార్యత్వం ఆచారంగా అనుశ్రుతంగా ఉండేవి.

అలాంటి దురాచారాలకు వ్యతిరేకంగా తీవ్ర అంతర్మథనం జరిగి వాటిని రద్దు చేయించుకోగలిగింది హిందూ సమాజం. అలాగే ఈ తలాక్‌ పేరుతో పురుషులు స్త్రీలను భోగవస్తువుగా చూడటం, వారిపట్ల అన్యాయంగా వ్యవహరించడం, కుటుంబ జీవితం అస్తవ్యస్తమై మహిళల పరిస్థితి దారుణ అణచివేతకు గురవడం వంటివాటిని ముస్లిం ప్రజానీకం, నేతలు మొదట గ్రహించి సంస్కరణలు తీసుకువచ్చారు. ముస్లిం లా లోనూ మార్పులు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్లు 3సార్లు వెనువెంటనే తలాక్‌ చెప్పడం ఇస్లాం చట్టంలో నేడు ఆచరణలో లేదు. పైగా ఈ తలాక్‌ వల్ల విడిపోయిన భార్యాభర్తలు ఇతర ఏ మతంతో పోల్చి చూసినా చాలా తక్కువ మందే ఉన్నారు.

ముస్లిం స్త్రీకి ఆదినుంచే విడిపోయే హక్కు

అంతే కాదు, ఇస్లాం చట్టంలో పురుషులకు తలాక్‌ ఎలా ఉన్నదో, అలాగే ముస్లిం స్త్రీలకు కూడా ‘కులా’ (విడిపోయే హక్కు) ఉన్నది. ముస్లిం స్త్రీ తన భర్త దుష్ప్రవర్తన వల్ల తానెంత వ్య«థ చెందుతున్నదో వారి మతగురువు ముందు వివరించి, తాను కూడా ‘కులా’ కోరవచ్చు. ఆయన ఇతర పెద్దలతో సంప్రదించి, ఆ హక్కు ఆమెకు మంజూరు చేయనూవచ్చు. అయితే అలాంటి హక్కు ద్వారా విడిపోయిన స్త్రీల సంఖ్య చాలా స్వల్పమే.  ఒక ముస్లిం మతంలోనే స్త్రీలకు అన్యాయం జరుగుతున్నదని వాదించడం అసంబద్ధం. నిజానికి ఏ మతంలోనూ లేనట్లుగా ముస్లిం మతంలో చాలా ముందునుంచే స్త్రీకి ఆస్తిలో వాటా హక్కు ఉంది. ఆ మతంలోని మౌఢ్య పార్శా‍్వన్ని మాత్రమే ప్రచారం చేస్తున్నారు కానీ.. వైవాహిక బంధంలో పురుషునికెంత గౌరవం, హక్కూ ఉన్నదో స్త్రీకి కూడా అంతే సమానంగా ఉండాలన్నది ఇస్లాం మత సూత్రాలలో ఒకటి.

ముస్లిం స్త్రీలకు జరుగుతున్న అన్యాయాన్ని తొలగించేందుకు అని చెప్పి ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో నేటి పాలకుల చిత్తశుద్ధి ప్రశ్నార్థకం అయ్యే రీతిలో వ్యవహరిస్తే అది ప్రజల మధ్య విద్వేషాలకు, దేశంలో మతపరమైన అశాంతికి ఆస్కారం ఇచ్చే ప్రమాదం ఉంది. ఉదా‘‘ దేశంలో 24 లక్షలమంది భర్తలు వదిలివేసిన స్త్రీలు ఉన్నారు. వీరిలో అత్యధికులు ముస్లిమేతర స్త్రీలే. వారు ఎంతో వ్యథకు, బతుకుబాధలకు గురవుతున్నారు. ఈ సందర్భంగా ఈ మహిళలందరికీ న్యాయం చేసే రీతిలో చట్టం రావాలి. ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఈ అంశాన్ని పార్లమెంటులోనే నేరుగా ప్రస్తావించినట్లున్నారు.

అలా భర్తచేత తిరస్కృతులైన ఒంటరి భార్యలందరికీ న్యాయం జరిగే చట్టం చేయడం అవసరం. దాదాపు అంతరించిపోతున్న ప్రస్తుత తలాక్‌ చట్టంతోపాటు, అదేదో ముస్లిం మతాచారాల పట్ల వ్యతిరేకత అన్న భావనకు తావు లేకుండా ఉండటం కోసమైనా మామూలు చట్టం చేయడం అత్యవసరం. పైగా, బహుభార్యత్వం అనే దురాచారం ముస్లి మతాచారంలోనే కాదు.. హిందూమతంలో సైతం ‘ఆరాధనీయంగా’ ఉండటం ఆశ్చర్యమేమీ కాదు. చరిత్ర ప్రకారం మహమ్మద్‌ ప్రవక్తకు పలువురు భార్యలట. అందులో అనాథలు, వితంతువులు, పతితులు ఉన్నారని చెబుతారు. అలాంటి మహిళ లను ఉద్ధరించేందుకోసమే ఆయన అన్ని వివాహాలు చేసుకున్నారని విశ్వసించే వారూ ఉన్నారు.

ఇక హిందూ దేవుళ్ల గురించి మనకు తెలిసిందే. మన కలియుగ దైవం వేంకటేశ్వర స్వామినే తీసుకుందాం. ‘శ్రీదేవి వంకకు చిలి పిగా చూడకు, అలివేలుమంగకు అలుక రానీయకు’ అంటూ ఆ జగత్పతి సైతం ఇద్దరు భార్యలను ఎలా ముద్దుగా చూసుకోవాలో సూచిస్తూ గానం చేస్తాం. ప్రవక్త మాదిరే కృష్ణావతారంలో శ్రీకృష్ణుడు సైతం తాను రామావతారంలో ఉన్నప్పుడు తనను ఆరాధించిన వారందరికీ ఈ అవతారంలో కుదరదు (ఏకపత్నీవ్రత) కనుక వచ్చే కృష్ణావతారంలో మీరందరూ గోపికలుగా జన్మించినప్పుడు మిమ్మల్ని స్వీకరిస్తాను అని వాగ్దానం చేశాడట. అందుకే కృష్ణుడికి పద్నాలుగు వేలమంది గోపికలు అని భక్తులు అంటుంటారు.

మౌనం అంగీకారమా? అర్ధాంగీకారమా?

ఎవరి విశ్వాసాలు వారివి కావచ్చు. కానీ మన లౌకిక వ్యవస్థలు అన్ని మతాలను సమానంగా చూడాలి. ప్రభుత్వం మతం విషయంలో ఒక్క మతాన్ని కూడా పక్షపాతంతో చూడరాదు. మతం వేరు, మతతత్వం వేరు. మన లౌకిక వ్యవస్థ మతాన్ని నిషేధించదు. అదే సమయంలో మతతత్వాన్ని సహించదు. దురదృష్టవశాత్తూ బీజేపీ నేతలు, మంత్రులు కూడా పరమత ద్వేషం ప్రవచిస్తున్నప్పుడు, వారిని మోదీవంటివారు కనీసం బహిరంగంగా ఖండించని ఫలితంగానే, మొన్న తలాక్‌పై చర్చ సందర్భంగా, ‘హిందూ సంస్కృతిలో కలవని ఇతరులకు, ఈ దేశంలోని ముస్లింలకు స్థానం ఉండదు, తమ ఇష్టం వచ్చిన దేశం వెళ్లిపోవచ్చు’నని ఆ పార్టీ నేతలు నిర్భయంగా ప్రకటిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో మోదీ పాటించే మౌనవ్రతం అర్ధాంగీకారమేనా?

ఇలా మతమూ, మతతత్వ ప్రాతిపదికన కాకుండా, మహిళలకు ఇంతకంటే గుణాత్మకంగా మెరుగైన జీవనం లభించాలంటే సహేతుకమైన సవరణలతో తలాక్‌ బిల్లు వంటివాటిని ఆమోదించడం అవసరం. అంతకంటే ముఖ్యంగా చట్టసభలలో కనీసం 33 శాతం స్థానాల్లో రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించాలి. అప్పుడే మహిళలకు వాస్తవికంగా మేలు చేకూర్చే చట్టాలు రూపొందే అవకాశం పెరుగుతుంది. కానీ దశాబ్దాలుగా, మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందడం లేదు. ఇప్పుడు బీజేపీకి పార్లమెంటులో సరిపడా మెజారిటీ ఉంది. ఈ తలాక్‌ బిల్లు సందర్భంగా ఆ పార్టీ నేతలు, ముస్లి మహిళలకు న్యాయం కలిగించాల్సిన అవసరాన్ని వివరించారు.

ప్రతిపక్షాలు సైతం  కాస్త సవరణ కోరుతున్నాయే తప్ప గంపగుత్తగా ఈ బిల్లును వ్యతిరేకించడం లేదు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించేందుకు కూడా ఇదే అదును. త్వరలో పార్లమెంటు ఎన్నికలు రాబోతున్నాయి. ఏ పార్టీ అయినా సరే మహిళా శ్రేయస్సు అటుంచితే, మహిళల ఓట్లను మరవజాలదు. పైగా అన్ని పార్టీలూ తరతమ భేదాలతో మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించేవే. చట్టసభలో సాధారణ రిజర్వేషన్‌ అమలయ్యేందుకు లేని అభ్యంతరం మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మాత్రం ఎందుకుండాలి? పైగా ప్రస్తుత పరిస్థితిలో ఇది సహేతుకమైన డిమాండే. లేకుంటే ఇప్పుడు చట్టసభలలో అసమానతలు గోచరిస్తున్నాయి. ప్రజలలో నూటికి 20 శాతం గర్భదరిద్రులు కాగా 60 శాతం మంది పేదరికం అనుభవిస్తున్నారు. కానీ పార్లమెంటులో నూటికి 50 శాతంపైగా సభ్యులు కోటీశ్వరులు. వారిలో 10 శాతం మంది మరీ కోటీశ్వరులు.

మన ఓటర్లలో దాదాపు 50 శాతం మంది మహిళలు. చట్టసభల్లో నూటికి 10–12 మంది మాత్రమే మహిళలు. ప్రజానీకంలో అగ్రకులాలు, ఆధిపత్య కులాలు 15–20 శాతం ఉంటారు. పార్లమెంటులో మాత్రం వీరు 50 శాతం మించే ఉంటారు. ఇది వాస్తవం. దీన్ని బట్టి చూస్తే పార్లమెంటును నిజమైన ప్రజాప్రాతినిధ్య సంస్థగా మార్చాల్సిన అవసరం ఉంది. మతం, మతతత్వం, దైవం ఇవన్నీ విశ్వాసాలు. అందుకే మార్క్స్‌ మాటలు గుర్తుంచుకోవాలి. ‘తమ కష్టాలకు, కన్నీళ్లకు కారణం తెలియని వ్యక్తి మతం ఒడిలో సేద తీరుతాడు. బాధాతప్త హృదయం విడిచే వేడి నిట్టూర్పు వంటిది మతం’. కనుక కష్టాలకు, కన్నీళ్లకు కారణాలను తెలుసుకుని నివారించుకోగలిగిన మేర వేడి నిట్టూర్పులు, మతం ఒడిలో సేద తీరడాలు ఉండవు. కావలసింది అదే. మన కృషి ఆ దిశగా సాగాలి.

డాక్టర్‌ ఏపీ విఠల్‌ 

వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు

 మొబైల్‌ : 98480 69720

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement