తలాక్ పద్ధతిపై ముస్లిం మహిళల పోరాటం!
న్యూఢిల్లీః తలాక్ సిస్టమ్ ను తొలగించాలంటూ దేశంలోని ఏభై వేలకుపైగా ముస్లిం మహిళలు పోరాటం ప్రారంభించారు. మూడుసార్లు తలాక్ చెప్తే విడాకులు ఇచ్చినట్లేనన్న ముస్లిం పర్సనల్ లా లోని ఆచారానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ ప్రారంభించారు. ముస్లిం మతంలో ఉన్న తలాక్ విడాకుల పద్ధతిని నిషేధించాలని కోరుతూ దాఖలు చేసే పిటిషన్ కోసం ఇప్పటివరకూ సుమారు 50 వేల సంతకాలు సేకరించారు.
భారతీయ ముస్లిం మహిళల (బీఎంఎంఏ) సంఘం తలాక్ పద్ధతిని నిషేధించాలని కోరుతూ పోరాటం ప్రారంభించింది. దేశవ్యాప్తంగా తాము వేయబోయే పిటిషన్ కు మద్దతివ్వాలని కోరుతున్న సంఘం.. జాతీయ మహిళా కమిషన్ కూడ తమకు సహకరించాలని, ముస్లిం మతంలో ఉన్న తలాక్ పద్ధతి నిషేధించడంలో జోక్యం చేసుకోవాలని కోరుతోంది. తమ పిటిషన్ కు మద్దతుకోసం సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టినట్లు బీఎంఎంఏ సహ వ్యవస్థాపకులు జికియా సోమన్ తెలిపారు. ఇప్పటివరకూ ఏభై వేల సంతకాలు సేకరించామని, మతంలోని కొందరు పురుషులు సైతం తమకు మద్దతిస్తున్నారని అన్నారు. ముస్లిం మతంలోని తలాక్ పద్ధతిపై చేపట్టిన సర్వేలో 90 శాతం పైగా మహిళలు తలాక్ విడాకుల విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తేలిందన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో తమకు మద్దతునిచ్చేవారినుంచి మరిన్ని సంతకాలు సేకరించి పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సంస్థ సభ్యురాలు నూర్జహా సాఫియా తెలిపారు.
ఖురాన్ లో కూడ ఎక్కడా ఇటువంటి తలాక్ పద్ధతి అమల్లో ఉన్న దాఖలాలు లేవని, నేషనల్ ఉమెన్ కమిషన్ ఛైర్ పర్సన్ లలిత కుమార మంగళమ్ కు పంపించే లేఖలో కూడ బీఎంఎంఏ పేర్కొంది. ఈ విషయంలో ముస్టిం మత పెద్దలను, అధికారులను సైతం కలసి, దేశంలో ఇతర మహిళలకు అమలౌతున్న న్యాయమైన నిబంధనలే తమకు అమలయ్యేట్లు కోరుతామని బీఎంఎంఏ పేర్కొంది. అయితే ముస్లిం పర్సనల్ లా ను పూర్తిగా మార్చాలంటే సమయం పడుతుందని, కానీ ట్రిపుల్ తలాక్ విషయంలో లక్షలమంది ముస్టిం మహిళలకు ఉపశమనం లభిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే తమ పోరాటాన్ని కొందరు మత గురువులు వ్యతిరేకిస్తున్నారని, వారు తలాక్ ను అల్లా విధించిన చట్టంగా నమ్ముతారని మహిళలు అంటున్నారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడ ఈ విషయాన్ని వ్యతిరేకించేందుకు ప్రయత్నిస్తోందన్నారు.