ముస్లిం మహిళలకు స్వేచ్ఛ లేదనడం అవాస్తవం
-పర్సనల్‌లా జాగృతిసభలో ముస్లిం ప్రముఖులు
రాజమహేంద్రవరం కల్చరల్ : ముస్లిం మహిళలకు స్వేచ్ఛ లేదనడం వాస్తవదూరమని జమాతె ఇస్లామీ హింద్ జాతీయ సలహామండలి సభ్యుడు సయ్యద్ అమీనుల్ హసన్ పేర్కొన్నారు. జమాతె ఇస్లామీ హింద్, నగర శాఖ ఆధ్వర్యంలో శనివారం ఆనం కళాకేంద్రంలో జరిగిన ముస్లిం పర్సనల్‌లా జాగృతిసభలో ఆయన ప్రసంగిస్తూ ముస్లిం వివాహాలలో వరుడు వధువుకు వివాహసమయంలో అందరి ఎదుటా ‘మెహెర్’ రూపేణా పెద్ద మొత్తాన్ని ఇవ్వవలసి ఉంటుందన్నారు. నాటినుంచి భార్య సంరక్షణ బాధ్యత తనదేనని భర్త అందరిఎదుటా చెప్పడం ఒక లక్ష్యమైతే, ఏ కారణం చేతనైనా భార్యాభర్తలు విడిపోతే, మెహెర్ ఒక విధమైన సామాజిక భద్రతను కలిగించడం మరోలక్ష్యమని అన్నారు. వివాహానికి ముందు వధువు తండ్రి కుమార్తెకు వివాహం సమ్మతమవునో, కాదో తెలుసుకోవాలని ముస్లిం పర్సనల్ లా చెబుతుందన్నారు. 2011 సెన్సస్ ప్రకారం ముస్లింలలో తలాఖ్ ద్వారా విడాకులు పొందినవారి శాతం 0.5 శాతం కాగా, హిందువులలో ఇది 3.7 శాతం ఉందన్నారు. భార్యాభర్తలమధ్య తేడాలు వస్తే, ముస్లిం పెద్దలు పరిష్కారం చేస్తారని, ఇందులో ఇతరుల జోక్యం అవసరం లేదని అన్నారు. మహిళావిభాగం జాతీయ కార్యదర్శి డాక్టర్ అతియా సిద్ధిఖి సాహెబా మాట్లాడుతూ ముస్లిం పర్సనల్ లాపై అవగాహన కలిగించేందుకు గతనెల 23నుంచి ఈనెల 7 వరకు దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను చేపట్టామన్నారు. దివ్యఖురాన్‌లో ప్రవక్త చెప్పిన అంశాలను మార్చడం తగని పని అని అన్నారు. వైఎస్సార్ సీపీ మైనారిటీ విభాగం నాయకుడు మహ్మద్ అరీఫ్ మాట్లాడుతూ భర్త మద్యానికి బానిస అయినా, కనపడకపోయినా, ఖులా ద్వారా భార్య కూడా విడాకులు పొందే వెసులుబాటు ఇస్లాం కల్పించిందని తెలిపారు. మహమ్మద్ రఫీక్, ఇందాదుల్లాహుస్సేన్, అబ్దుల్ హఫీజ్ ఖాన్, ఇంతజార్ అహమ్మద్, రిజ్వాన్‌ఖాస్మిసాహెబ్, మెహఫిజ్ రెహమాన్, పలువురు ముస్లిం నాయకులు పాల్గొన్నారు.