న్యాయం కోరితే దేశద్రోహమా? | Cases registered under various sections on Muslim youth | Sakshi
Sakshi News home page

న్యాయం కోరితే దేశద్రోహమా?

Published Fri, Aug 31 2018 3:40 AM | Last Updated on Tue, Oct 16 2018 5:59 PM

Cases registered under various sections on Muslim youth - Sakshi

సాక్షి, గుంటూరు: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చండి, మాకు న్యాయం చేయండి అని కోరడం దేశద్రోహమట! అలా కోరడం ముమ్మాటికీ దేశద్రోహమేనని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తేల్చిచెబుతోంది.

గుంటూరులో మంగళవారం నిర్వహించిన ‘నారా హమారా.. టీడీపీ హమారా’ సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపిన అమాయక ముస్లిం యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని, వివిధ పోలీసు స్టేషన్లకు తిప్పుతూ దాదాపు 30 గంటలపాటు నిర్బంధించి, తీవ్ర వేధింపులకు గురిచేసి, చివరకు టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. ఫిర్యాదులో గానీ, ఎఫ్‌ఐఆర్‌లో గానీ పొందుపరచని అంశాలను రిమాండ్‌ రిపోర్ట్‌లో చేర్చడం చూస్తే ముస్లిం యువకులపై ప్రభుత్వం ఏ స్థాయిలో కక్షసాధింపు చర్యలకు దిగుతోందో అర్థం చేసుకోవచ్చు. వారంతా దేశద్రోహానికి పాల్పడ్డారని చిత్రీకరించే కుట్రకు టీడీపీ ప్రభుత్వం తెర తీసింది.  
 
సంబంధం లేని సెక్షన్ల కింద కేసులు  
ముఖ్యమంత్రి పాల్గొన్న సభలో ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపిన ముస్లిం యువకులపై పోలీసులు ఐపీసీ 505(ఐ)( V), 505(2),120(బి) సెక్షన్‌ 7 క్రిమినల్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌ల కింద కేసులు నమోదు చేశారు. అమాయకులను అక్రమ కేసుల్లో ఇరికించడానికి ప్రభుత్వం పెద్ద కుట్ర పన్నిందని రాష్ట్రవ్యాప్తంగా ముస్లిం సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు యువకులపై ఫిర్యాదుదారుడు తన ఫిర్యాదులో పేర్కొనని అంశాలను కూడా పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో నమోదు చేశారని న్యాయవాదులు చెబుతున్నారు. ఐపీసీ 505, 505(2), 120(బి) సెక్షన్ల ప్రకారం.. రెండు కులాల మధ్య గానీ, రెండు వర్గాల మధ్య గానీ చిచ్చు పెట్టడానికి ప్రయత్నించడం, నేరపూరిత ఉద్దేశంతో పథకం ప్రకారం రెండు వర్గాల మధ్య వైషమ్యాలు పెంచేందుకు ప్రయత్నించడం నేరం.

ఈ సెక్షన్ల కింద ముస్లిం యువకులపై ఏ విధంగా కేసులు నమోదు చేశారో అర్థం కావడం లేదని న్యాయవాద వర్గాలు చర్చించుకుంటున్నాయి. ‘నారా హమారా.. టీడీపీ హమారా’ సభలో యువకులు చిచ్చు పెట్టి, గొడవలు రేపడానికి అక్కడ రెండు భిన్నమైన కులాలు గానీ, వర్గాలు గానీ లేవని.. కేవలం ముస్లింలు మాత్రమే ఆ సభలో ఉన్నారని, మరి అలాంటప్పుడు పైన తెలిపిన సెక్షన్ల కింద వారిపై ఎలా కేసులు నమోదు చేశారని న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు.

ఈ కేసుకు ఇంకా బలం చేకూర్చడం కోసం ఆ ముస్లిం యువకులు దేశాన్ని విభజించాలని కోరుతున్నట్టు కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. కానీ, ఫిర్యాదుదారుడు, టీడీపీ నేత మీరావలీ ఇచ్చిన ఫిర్యాదులో.. ఆ యువకులు దేశాన్ని విభజించాలని కోరుతున్నారని లేదు. యువకులను బలంగా కేసుల్లో ఇరికించాలనే ఉద్దేశంతోనే కుట్రపూరితంగా ఫిర్యాదుల్లో పేర్కొనని అంశాలను సైతం కల్పించి ప్రభుత్వం, పోలీసులు కేసు నమోదు చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  
 
యువకులంతా రాత్రి రాత్రే పార్టీ మారారా?  
అరెస్టయిన వారిలో హబీబుల్లా మాత్రమే ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వాడని, మిగిలిన వారంతా ఏ పార్టీకీ చెందిన వారు కాదని గుంటూరు తూర్పు డీఎస్పీ కండె శ్రీనివాసులు బుధవారం రాత్రి ఓ మీడియా చానల్‌తో మాట్లాడుతూ చెప్పారు. అయితే, ఒక్కరోజులోనే పోలీసులు మాట మార్చేశారు. గుంటూరు అర్బన్‌ ఎస్పీ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. అరెస్టయిన ముస్లిం యువకులంతా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారేనని ప్రకటించారు. రాత్రికి రాత్రే వారందరూ తమ పార్టీకి చెందిన వారుగా ఎలా మారారని వైఎస్సార్‌సీపీ నేతలు  మండిపడుతున్నారు. ఇదంతా ప్రభుత్వం పన్నుతున్న కుట్రలో భాగమేనని ఆరోపిస్తున్నారు.  
 
ఫిర్యాదుకు, కేసులకు సంబంధం లేదు  
‘‘ముస్లిం యువకులు, వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం నేత హబీబుల్లాపై పోలీసులు నమోదు చేసిన కేసులకు, ఫిర్యాదుదారుడు ఇచ్చిన ఫిర్యాదుకు ఏమాత్రం సంబంధం లేదు. ఫిర్యాదులో లేని అంశాలను పోలీసులు ఉద్దేశపూర్వకంగా రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. సెక్షన్‌ 7 సీఐఏ కింద కూడా వీరిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. ప్రైవేట్‌ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ సెక్షన్‌ కింద కేసు పెట్టడానికి వీల్లేదు. ఫిర్యాదుదారుడు పోలీస్‌ అయినప్పుడు మాత్రమే ఈ సెక్షన్‌ కింద కేసు నమోదు చేయాలి. ముస్లిం యువకులను కేవలం కుట్రపూరితంగా అక్రమ కేసుల్లో ఇరికించినట్లు తేటతెల్లమవుతోంది’’    – బ్రహ్మారెడ్డి, న్యాయవాది 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement