ఉన్నది ఒకటే ఇల్లు | Special Story on Talak Bill Pass | Sakshi
Sakshi News home page

ఉన్నది ఒకటే ఇల్లు

Published Wed, Aug 14 2019 9:30 AM | Last Updated on Wed, Aug 14 2019 9:30 AM

Special Story on Talak Bill Pass - Sakshi

కొడుకు, కూతురితో అమ్రీన్‌ బేగం (ఫైల్‌ ఫొటో)

ఒక ఇంట్లోని వాళ్లంతా ఒకింటివాళ్లు అవుతారు తప్ప ‘వాళ్లు’ అవరు. ఒక దేశంలోని వాళ్లంతా ఒక దేశంవాళ్లు అవుతారు తప్ప ‘వాళ్లు’ అవరు. ఇంట్లో గానీ, దేశంలో గానీ ‘వాళ్లు’ అనే మాట వచ్చిందంటే అది వేరు చేసినట్లు కాదు. వేరు చేసుకున్నట్లు.

తలాక్‌ రద్దుపై అటుగానీ, ఇటుగానీ నోరు మెదపకుండా మౌనంవహించడమంటే ఇంటి నుంచి, లేదా దేశం నుంచి ఎవర్ని వారు వేరు చేసుకోవడమే. అయితే తలాక్‌ రద్దును వ్యతిరేకిస్తూ ‘‘అదే ‘మనింటి’ విషయంలోనైతే ఇలా చేస్తామా?’’ అని వినిపిస్తున్నవాదనల కంటే నోరు మెదపని మౌనమే నయమేమో అనిపిస్తుంది.-మాధవ్‌ శింగరాజు

జర్నలిజంలోని బ్యూటీ ఏంటంటే, సాయంత్రం ఇంటికి క్యారీబ్యాగులో ఓ కిలో బియ్యం మోసుకుని వెళ్లేందుకు డ్యూటీ చేసినట్లుగా ఉండదు. గుప్పెడు అక్షరాల్ని చల్లి లోకంలోని బంజరుభూముల్ని పండించడానికి ఆఫీస్‌కి వచ్చినట్లుగా ఉంటుంది. ‘‘మంచిదే కానీ, ప్రత్యేక అంశాలపై నీక్కొన్ని ప్రత్యేక అభిప్రాయాలు ఉన్నప్పుడు వాటిని నీ రాతల్లో వ్యక్తం చేయకుండా ఉండడం వల్ల కెరీర్‌లో నీకు నూకలు చెల్లకుండా ఉంటాయి’’ అని సీనియర్‌ జర్నలిస్టు ఒకరు హితవు చెప్పినప్పుడు కూడా ‘అతడు’ బంజరు భూముల్ని పండించడం గురించే ఆలోచించాడు తప్ప, క్యారీబ్యాగులో బియ్యం మోసుకుపోతే సుఖం కదా అనుకోలేదు. ఇరవై ఏళ్ల క్రితం నాటి మాట ఇది.

అప్పుడు ‘అతడు’ ట్రైనీ. అదే ‘అతడు’ ఇప్పుడు ‘‘ప్రత్యేక అంశాలపై మీక్కొన్ని ప్రత్యేక అభిప్రాయాలు ఉన్నప్పుడు వాటిని మీరు మీ రాతల్లో వ్యక్తం చేయకపోవడం వల్ల క్యారీబ్యాగులో ఇంటికి మీరు బియ్యం మోసుకెళ్లగలరు తప్ప, బంజరు భూముల్ని పండించలేరు’’ అని చెబుతున్న సీనియర్‌ జర్నలిస్టు (ఈ వ్యాసకర్త). అప్పట్లో మెడ్రాస్‌ ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’లో రషీదా భగత్‌ బ్యూరో చీఫ్‌గా ఉండేవారు. ‘‘రషీదా భగత్‌ రాయొచ్చా సర్, ప్రత్యేకాంశాల మీద ప్రత్యేక అభిప్రాయాలు?’’ అని అతడు అడిగినప్పుడు, ‘‘రాయొచ్చు. కానీ నువ్వు రాయకూడదు. రాస్తే ఏ విలువా ఉండదు’’ అనేవారు డెస్క్‌ ఇన్‌చార్జి. సీనియర్‌ జర్నలిస్టులు జూనియర్‌ జర్నలిస్టులకు ఏం చెప్పినా, చివరి మాట మీడియా యాజమాన్యాలదే. అవి వద్దన్న అభిప్రాయాలేవీ మర్నాడు పేపర్‌లలో కనిపించవు. ప్రత్యేకాంశాలపై ప్రత్యేక అభిప్రాయాల మీద పత్రికలు ఎప్పుడూ కాస్త జాగ్రత్తగానే ఉంటాయి. ఎవరి మనోభావాలకూ దెబ్బ తగలకుండా.

ఈ ఏడాది జూలై 30న రాజ్యసభలో తలాక్‌ బిల్లు అమోదం పొందగానే ఆ మర్నాడు అన్ని పేపర్లూ ఆ వార్తను వేశాయి కానీ, ఎప్పటిలా ‘ప్రత్యేకాంశం’ అయిన తలాక్‌పై ప్రత్యేక అభిప్రాయాలకు మాత్రం దాదాపుగా చోటివ్వలేదు. ప్రత్యేక అభిప్రాయాలంటే తలాక్‌ రద్దుపై ప్రభుత్వాన్ని వ్యతిరేకించని అభిప్రాయాలు. తర్వాత మెల్లిగా తలాక్‌ రద్దుపై ప్రభుత్వాన్ని సమర్థించని అభిప్రాయాలు ఒకటీ అరా కనిపించడం మొదలైంది. బాబ్రీ కట్టడం కూల్చివేత తర్వాత చాలాకాలం పాటు ఇలాంటి ప్రత్యేకాంశాలపై బలమైన మీడియా హౌస్‌లు కూడా ‘తటస్థతే సుస్థిరత’ అనే మోడ్‌లోకి వెళ్లిపోయాయి. వ్యూ, కౌంటర్‌ వ్యూ రెండూ ఉండేవి కాదు. ‘వాళ్ల’ మంచొద్దు. ‘వాళ్ల’ చెడొద్దు. ఇదీ ధోరణి! అసలు ఏది మంచి? ఏది చెడు? మంచి రాయబోయి చెడు రాసేస్తే? మంచి అనుకుని రాసింది చెడు అయిపోతే? అందుకే జూనియర్‌ జర్నలిస్టుల్ని ఈ ప్రత్యేకాంశాల దగ్గరకి రానిచ్చేవాళ్లు కాదు. సీనియర్‌ జర్నలిస్టులు ఎటూ ఆ దరిదాపులకు వెళ్లరు. ఇప్పుడా పరిస్థితి కొంచెం మారినట్లుంది. తలాక్‌ రద్దు మీద మీడియాలో ఈ రెండు వారాల్లోనూ ప్రధానంగా రెండు ప్రశ్నలు వచ్చాయి. తలాక్‌ చెబితే కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపేలా బిల్లు ఉండాలి కానీ, ఏదో నేరం చేసినట్లు భర్తను జైల్లో పెట్టే బిల్లేమిటన్నది ఆ రెండిట్లో ఒక ప్రశ్న. ‘తలాక్‌ను రద్దు చేశారు సరే, హిందువుల్లోని భర్తల్ని çసంస్కరించేందుకు బిల్లు తేరేం?’ అనేది రెండో ప్రశ్న. రెండు ప్రశ్నలూ మంచివే. రెండోది ఇంకా మంచి ప్రశ్న. అయితే ఈ ప్రశ్న వేసే విధానమే మరీ అంత మంచిది కాకుండా ఉంది! ‘తలాక్‌’ సరే.. ‘మన’ ఇంటి గుట్టో? అని అని ప్రశ్నించడంలో ఏం మంచి ఉంది? ‘వాళ్ల’ సంగతి ఎందుకు? అని ఆనాడు అన్నవాళ్లు, ‘మన’ సంగతేంటి? అని నేడు అంటున్నారు. రెండిటిలోనూ కనిపించే భావం ఒక్కటే. ఈ దేశం ఒకే కుటుంబం కాదని!

తలాక్‌ సంప్రదాయాన్ని రద్దు చేయాలని కోరుతూ పిటిషన్‌లు వేసి ఏళ్లుగా పోరాడుతున్న జకియా సోమన్, అతియా సాబ్రి, గుల్షన్‌ పర్వీన్, అఫ్రీన్‌ రెహ్మాన్, ఇష్రత్‌ జహాన్, సైరా భానులను ఈ ‘ఇంటి’ ఆడపడుచులు కాదు అనుకుని ఉంటే కోర్టులు పిటిషన్‌లను స్వీకరించేవా? ప్రభుత్వం ఇప్పుడు తలాక్‌పై ఒక నిర్ణయం తీసుకుని ఉండేదా? మనదంతా ఒకే కుటుంబం అని వ్యవస్థలే అనుకుంటున్నప్పుడు కుటుంబంలోని ఏ కొందరో, ఏ కారణం చేతనో కుటుంబంలోని కొందరికి అడగకుండానే మద్దతుగా నిలిచినంత మాత్రాన అదంతా ఒకే కుటుంబం కాకుండా పోతుందా?

తలాక్‌ చట్టం మాత్రమే కాదు, అలాంటి ఏ చట్టం ఉద్దేశమైనా కుటుంబాలకు మేలు చేయడమే అయి ఉంటుంది. చట్టం ఫలిస్తుందా, నిష్ఫలం అవుతుందా అన్నది కాలక్రమంలో తేలే విషయం. ఫలించడం అంటే చట్టానికి ఫిర్యాదుల గౌరవం దక్కటం. నిష్ఫలం అంటే ఫిర్యాదులే వెళ్లని గౌరవం దక్కటం. రెండేళ్ల క్రితం మీరట్‌లో అమ్రీన్‌ బేగం (పై ఫొటో) అనే మహిళ తన భర్త పెట్టే గృహహింసను భరించలేక పోలీస్‌ స్టేషన్‌ బయటే పెద్దగా అరుస్తూ అతడికి తలాక్‌ చెప్పారు! ‘భర్తకేనా! భార్యకు ఉండకూడదా తలాక్‌ చెప్పే హక్కు’ అని ప్రశ్నించారు. ఇది ఒక బాధిత మహిళ చట్టాలతో నిమిత్తం లేకుండా తనకు తానుగా దక్కించుకున్న గౌరవం.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement