ఓ గదిలో కొందరు బాలికలు కూర్చొని ఉన్నారు.. వయసు పైబడిన ఓ వ్యక్తి ఆ గదిలోకి వచ్చాడు. ఒక్కొక్కరిని ప్రశ్నలు అడుగుతున్నాడు. కొద్దిసేపటి తర్వాత వారిలో ఒక బాలికను ఓకే చేశాడు. ఇది ఏ ఉద్యోగం కోసమో జరుగుతున్న ఇంటర్వ్యూకాదు... అమ్మాయిల కొనుగోలు కోసం జరుగుతున్న తంతు. అందం.. ఆరోగ్యం ఉన్న హైదరాబాద్ అమ్మాయిలను ఎంత డబ్బు కుమ్మరించైనా సొంతం చేసుకునేందుకు సొమాలి, సూడానీలు పోటీపడుతున్నారు. ఈ తతంగానికి పెళ్లి అని పేరు పెట్టి.. యువతుల జీవితంతో ఆడుకుంటున్నారు. ఇలాగే ఓ సోమాలీ దేశస్తుడు (అమెరికా పౌరసత్వం ఉన్న వ్యక్తి) పాతబస్తీకి చెందిన మైనర్ అమ్మాయి సబాఫాతిమాను పెళ్లి చేసుకున్నాడు. మోజు తీరగానే అమెరికా వెళ్లి ఫోన్‌లో తలాక్ చెప్పేశాడు. చదవండి: నెల రోజుల్లో పెళ్లి.. చేతిలో చిల్లిగవ్వ లేక
ఏం జరిగింది... : పాతబస్తీ గాజియే మల్లత్ కాలనీకి చెందిన సబా ఫాతిమా(16)కు అబ్ది వలీ అహ్మద్(54)తో పెళ్లి జరిగింది. అప్పటికీ ఫాతిమా మైనర్. టోలిచౌకిలో ఓ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ అద్దెకు తీసుకొని ఉన్నారు. అలా 2 నెలలు గడిచిన తర్వాత వారం రోజుల్లో తిరిగి వస్తా అని చెప్పి దుబాయ్ వెళ్లాడు. ఏడాది తర్వాత వచ్చాడు. మళ్లీ రెండు నెలలు ఉండి ఎక్కడికో వెళ్లేవాడు. ఇలా నాలుగుసార్లు జరిగింది. అద్దె ఇళ్లను మారుస్తూ మెహిదీపట్నం, మలక్‌పేట్‌తో పాటు పలుచోట్ల సబాతో ఉండేవాడు. కాగా, 2020, ఫిబ్రవరిలో దుబాయ్‌లో ఉన్న తన తల్లి వద్దకు వెళ్తున్నానని.. తర్వాత వచ్చి సబాను తీసుకెళ్తానని చెప్పి వెళ్లాడు. లాక్‌డౌన్ ముగిసే వరకు దుబాయ్‌లో ఉండి.. అక్కడి నుంచి అమెరికా వెళ్లాడు. అక్టోబర్ 7న సబా తండ్రి మహ్మద్ ఫరీద్‌కు ఫోన్ చేసి తలాక్ ఇస్తున్నానని మూడుసార్లు ఆ పదం ఉచ్చరించాడు. అప్పటి నుంచి సబా ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేశాడు. దీంతో ఆందోళన చెందిన ఫాతిమా కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఘాన్సీబజార్‌లోని ఉమెన్స్ పోలీసులకు ఆశ్రయించింది.
న్యాయం చేయండి...
‘మా నాన్నకు మేము ఐదుగురం అమ్మాయిలం. నాన్న ఆటో నడిపిస్తారు. నేనే ఇంట్లో పెద్ద. నాన్న బాధ చూడలేక నా కంటే రెండింతలు ఎక్కువ వయసున్న నల్లజాతీ యుడిని పెళ్లి చేసుకున్నా. తనకు అమెరికా పౌరసత్వం ఉందని, వాళ్లమ్మ దుబాయ్‌లో ఉంటుందని చెప్పాడు. నా కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగుపడుతుందని పెళ్లి చేసుకున్నా. తర్వాత ఎప్పుడూ నెల రోజుల కంటే ఎక్కువ ఉండలేదు. అక్టోబర్‌లో నాన్నకు ఫోన్ చేసి తలాక్ ఇస్తున్నానని చెప్పాడు. దీంతో చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాం. ప్రభుత్వం స్పందించి నాకు న్యాయం చేయాలని కోరుతున్నా’
– సబాఫాతిమా
ఇది ఒక్కరి కథ కాదు..
సబాఫాతిమానే కాదు.. పాతబస్తీకి చెందిన ఎందరో అమ్మాయిల దీనగాథ ఇది. సోమాలీ, సూడానీ దేశస్తులు.. ఇక్కడి అమ్మాయిల అందానికి వెల కడుతున్నారు. పెళ్లి కోసం వచ్చే వీరంతా కుర్రాళ్లేం కాదు. 50–60 ఏళ్లు పైబడిన వారే. వీరు సంపన్నులు కాదు. సోమాలియా, సూడాన్‌తో పాటు ఇతర అరబ్బు దేశాల నుంచి విద్య, వ్యాపారం, వైద్యం కోసం వస్తున్నారు. శారీరక అవసరాల కోసం మాత్రమే లక్ష, 2 లక్షలు ఇచ్చి పాతబస్తీ అమ్మాయిలను వివాహం చేసుకుంటున్నారు. ఇక్కడి కుటుంబాల్లో పేదలే ఎక్కువగా ఉండటం.. అమ్మాయిల సంఖ్య కూడా ఎక్కువగానే కావడం, పేదరికం, నిరక్షరాస్యతను ఆసరా చేసుకుని దళారులు ఈ తతంగాన్ని నడిపిస్తున్నారు.
ఆయా దేశాల నుంచి వచ్చిన వారు టోలిచౌకి, మెహిదీపట్నం, మాసాబ్ ట్యాంక్ తదితర ప్రాంతాల్లోనే అద్దెకు ఉంటున్నారు. దళారుల ద్వారా అమ్మాయిలను ఇంటర్వ్యూ చేసి నచి్చన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు. అమ్మాయిలకు ఇష్టంలేకపోయినా ఒత్తిడి తెచి్చ మరీ తమ పంతం నెరవేర్చుకుంటారు. పెళ్లి చేసుకునే వ్యక్తి ఇచ్చే డబ్బును దళారులు.. ఏజెంట్లు.. తల్లిదండ్రులు పంచుకుంటారు. అయితే వీటిలో అధిక భాగం దళారుల చేతికే చేరుతుంది. పాతబస్తీలో గోప్యంగా పెళ్లి జరుగుతుంది. అక్కడి నుంచి మకాం కొత్తబస్తీకి మారుస్తారు.
Comments
Please login to add a commentAdd a comment