బిహార్‌లో రాజకీయ గందరగోళం
- తమ ఆదేశాలు జేడీయూ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కాదన్న పట్నా హైకోర్టు
- దాంతో జేడీయూఎల్పీ నేతగా తన ఎన్నికపై కోర్టు స్టే అవాస్తవమని స్పష్టమైందన్న నితీశ్
- గత సంప్రదాయాలకు అనుగుణంగానే మాంఝీకి అవకాశం: గవర్నర్
న్యూఢిల్లీ/పట్నా: బిహార్‌లో రాజకీయ గందరగోళం కొనసాగుతోంది. ఒకవైపు, ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీని ఫిబ్రవరి 20న విశ్వాసపరీక్షను ఎదుర్కోవాల్సిందిగా గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠీ ఆదేశించారు. మరోవైపు, జేడీయూ శాసనసభా పక్ష నేతగా నితీశ్ కుమార్ ఎన్నికకు సంబంధించి బుధవారం ఇచ్చిన ఆదేశాలపై పట్నా హైకోర్టు గురువారం వివరణ ఇచ్చింది. నితీశ్‌ను జేడీయూ శాసనసభా పక్ష నేతగా గుర్తిస్తూ అసెంబ్లీ ఇన్‌చార్జి కార్యదర్శి ఇచ్చిన లేఖకు సంబంధించిన న్యాయపరమైన చిక్కులను పరిశీలించాల్సి ఉందన్న బుధవారం నాటి తమ వ్యాఖ్యలను.. జేడీయూ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంగా అన్వయించుకోకూడదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
బుధవారం నాటి ఆదేశాలపై జేడీయూ మాజీ మంత్రి పీకే షాహీ వేసిన రివ్యూ పిటిషన్ సందర్భంగా ధర్మాసనం పై విధంగా స్పందించింది. కోర్టు ఆదేశాలను నితీశ్ ఎన్నికపై విధించిన స్టేగా నితీశ్ వ్యతిరేకు లు, మీడియా అన్వయించారని కోర్టుకు షాహీ విన్నవించారు. అసెంబ్లీ కార్యదర్శి ఇచ్చిన లేఖ న్యాయబద్ధతను కోర్టుకు వివరించారు. అనంతరం తదుపరి విచారణను ఫిబ్రవరి 17వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది. ‘నితీశ్‌కు ఊరటనిచ్చే ఈ నిర్ణయంతో ఆయన జేడీయూ శాసనసభాపక్ష నేతగా కొనసాగుతార’ని ఆ తరువాత విలేకరుల సమావేశంలో పీకే షాహీ పేర్కొన్నారు. షాహీతో పాటు సమావేశంలో పాల్గొన్న నితీశ్‌కుమార్.. తన ఎన్నికపై కోర్టు స్టే విధించిందన్న వార్తలు అసత్యమని స్పష్టమైందన్నారు.
గత సంప్రదాయాలకు అనుగుణంగానే..
కాగా, గత సంప్రదాయాలు, రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పులను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే బిహార్ ముఖ్యమంత్రి జతిన్ రామ్ మాంఝికి ఫిబ్రవరి 20న విశ్వాస పరీక్ష ఎదుర్కొనేందుకు అవకాశమిచ్చానని ఆ రాష్ట్ర గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠీ గురువారం స్పష్టం చేశారు. ‘రాజ్యాంగంలోని 176వ అధికరణ ప్రకారం ప్రతీ సంవత్సరం మొదటి అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే తన విశ్వాస పరీక్షకు సంబంధించిన తీర్మానాన్ని ముఖ్యమంత్రి మాంఝి అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి. నిబంధనల ప్రకారం సభ డిమాండ్ చేస్తే ఆ తీర్మానంపై చర్చ జరుగుతుంది. చర్చ అనంతరం ఓటింగ్ చేపడ్తారు. ఓటింగ్ లాబీ డివిజన్ పద్ధతిలోనా? లేక రహస్య బ్యాలెట్ పద్దతిలోనా? అనేది స్పీకర్ నిర్ణయిస్తారు. ఫలితం తేలగానే వెంటనే గవర్నర్‌కు ఆ సమాచారం అందించాలి’ అని గవర్నర్ సెక్రటేరియట్ గురువారం ఒక ప్రకటన వెలువరించింది.
ఢిల్లీ డెరైక్షన్‌లోనే..: విశ్వాస పరీక్షను ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి జతిన్ రామ్ మాంఝీకి గవర్నర్ ఫిబ్రవరి 20 వరకు గడవు ఇవ్వడంపై నితీశ్‌కుమార్ మండిపడ్డారు. వెంటనే విశ్వాసపరీక్ష నిర్వహించాలని మాంఝీని ఆదేశించకుండా, ఇంత సమయం ఇవ్వడం మోదీ ఆదేశాల మేరకే జరిగిందని ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లకు, బేరసారాలకు అవకాశం ఇచ్చేందుకే ఇంత సమయం ఇచ్చారన్నారు. ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు, డబ్బు, రానున్న ఎన్నికల్లో బీజేపీ టికెట్లను ఎరగా వేస్తున్నారని ఆరోపించారు. ‘ఢిల్లీ నుంచి వచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే గవర్నర్ నడుచుకుంటున్నారు. సాధ్యమైనంత త్వరగా విశ్వాస పరీక్షకు ఆదేశిస్తానని ఇంతకుముందు గవర్నరే స్వయంగా చెప్పారు. ఫిబ్రవరి 8న మాంఝీ ప్రధానిని కలిసిన తరువాత గవర్నర్ మాట మారింది’ అని నితీశ్ విమర్శించారు.
‘ఫిబ్రవరి 20న ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కేవలం 12 మంది ఎమ్మెల్యేల మద్దతున్న ముఖ్యమంత్రి రూపొందించిన ప్రసంగాన్ని గవర్నర్ చదవాల్సిన వింత పరిస్థితి ఏర్పడింది’ అని నితీశ్ వ్యాఖ్యానించారు. మాంఝీ మహాదళిత నేపథ్యాన్ని చూసి ఆయనను సీఎంగా తాను ఎంపిక చేయలేదన్నారు. తన వారసుడిగా తాను ఎంపిక చేసిన మాంఝీ తననే మోసం చేశారన్నారు. మరోవైపు రాజ్యాంగబద్దత కలిగిన గవర్నర్ అధికారాలను ప్రశ్నించడం ద్వారా నితీశ్ తుచ్ఛమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని బీజేపీ విమర్శించింది.