
మహిళతో సహా పదిమందిని పొడిచేశారు
శాన్ ప్రాన్సిస్కో: కాలిఫోర్నియాలో దారుణం చోటుచేసుకుంది. నిరసన వ్యక్తం చేస్తున్నవారిలోకి చొరబడి అవతలి వర్గంవారు పదిమందిని దారుణంగా పొడిచారు. చేతికి దొరికినవారిని దొరికినట్లు కొట్టారు. కత్తిపోట్లకు గురైనవారిలో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. కాలిఫోర్నియా ప్యాట్రోల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ట్రెడిషనలిస్ట్ వర్కర్స్ పార్టీకి చెందిన 30 మంది ఆదివారం మధ్యాహ్నం ర్యాలీకోసం సాక్రమెంటోలోని ఓ క్యాపిటల్ బిల్డింగ్ వద్దకు చేరగా అదే సమయంలో 400 మంది అవతలివర్గం వారు తారసపడ్డారు. ఈ సమయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
కొంతమంది యువకులు ముఖానికి ముసుగులు ధరించి రాళ్లు విసరడంతోపాటు కర్రలు పట్టుకొని హల్ చల్ చేశారు. ఇంకొందరు కత్తులతో పొడిచారు. కత్తిపోట్లకు గురైన వారిలో ఒక మహిళ కూడా ఉంది. వీరంతా 19 నుంచి 58 ఏళ్ల మధ్యవారు ఉన్నారు. ప్రస్తుతానికి ఆ ప్రాంతంలో పరిమితులు విధించారు. పోలీసులు నిందితుల అరెస్టు కోసం వీడియో ఫుటేజీ పరిశీలిస్తున్నారు.