163 మంది భారత వేదవిద్యార్థుల అదృశ్యం
చికాగో: వేద పండితులుగా శిక్షణ పొందేందుకు అమెరికా వెళ్లిన సుమారు 163 మంది భారతీయ విద్యార్థులు అదృశ్యమయ్యారు. అతీంద్రియ యోగా గురు దివంగత మహర్షి మహేశ్ యోగి కుటుంబానికి చెందిన రెండు సంస్థల ద్వారా ఉత్తర భారతదేశంలోని గ్రామాల నుంచి వేదశిక్షణ కోసం దాదాపు 1,050 మందిని అమెరికాలోని అయోవాలో ఉన్న వేదిక్ సిటీకి తీసుకువెళ్లారు. గత ఏడాదిగా వారిలో 163 మంది కనిపించకుండా పోయారని ‘హాయ్ ఇండియా’ అనే స్థానిక వార పత్రిక తాజా సంచికలో వెల్లడించింది. దారుణమేంటంటే.. తప్పిపోయిన వారు ఎక్కడికెళ్లారు?, ఏ పరిస్థితుల్లో ఉన్నారు? అనే విషయాలను ఆ సంస్థలు పట్టించుకున్న పాపాన పోలేదు. వారిని ప్రశ్నిస్తే సమాధానముండదు. ఒక అధికారి మాత్రం ‘ఇమిగ్రేషన్ అవసరాల కోసమో లేక వాళ్ల అమెరికా కలలను తీర్చుకోవడం కోసమో ప్రహారీ దూకి పారిపోయారు’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. తప్పిపోయినవారిలో చాలామంది 19, 20 ఏళ్లవారే ఉన్నారు. ఆ విద్యార్థులను తీసుకెళ్లిన మహార్షి వేదిక్ సిటీ, మహార్షి యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లపై ‘హాయ్ ఇండియా’ పరిశోధనలో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెల్లడయ్యాయి.
ఆ సంస్థల ఆధ్వర్యంలో నడిచే ‘గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్’ విద్యాసంస్థ వేద పండితుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 12వ తరగతి వరకు చదివిస్తామని, తర్వాత వారిని వైదిక నిపుణులుగా మారుస్తామని తల్లిదండ్రులతో చెప్పి భారత్‌లోని పేద పిల్లలను అమెరికా తీసుకువెళ్లారు.
వీసాకు దరఖాస్తు చేసే ముందే పిల్లలు, వారి తల్లిదండ్రులతో ఒప్పందం కుదుర్చుకుంటారు. ఆ కాంట్రాక్ట్ కాపీని వారికి ఇవ్వరు.
నెలకు 50 డాలర్లను అమెరికాలోని పిల్లలకు, 150 డాలర్లను భారత్‌లోని వారి తల్లిదండ్రులకు ఇస్తామని అందులో పేర్కొంటారు. కానీ ఆ మొత్తాన్ని నెలవారీగా ఇవ్వరు. ఆ విద్యార్థి ప్రవర్తన సంతృప్తికరంగా ఉంటే.. రెండేళ్లు గడిచాక భారత్ పంపించేముందు ఇస్తామంటారు.
విద్యార్థులను తాత్కాలిక గృహాల్లో దారుణ పరిస్థితుల్లో, 24 గంటల పాటు గార్డుల పహారాలో ఉంచుతున్నారు.
అమెరికా నుంచి వెళ్లిపోవాలనుకునే విద్యార్థులను వేదిక్ సిటీ నుంచి ఒక వ్యాన్‌లో తీసుకుని ఏర్‌పోర్ట్‌కు వెళ్తారు. ప్రవేశద్వారం వద్ద వారిని వదిలి ‘ఇక్కడే ఉండండి. ఇప్పుడే వస్తాము. విమానం రాగానే వెళ్లిపోదురు గానీ’ అని చెప్పి డ్రైవర్ వెళ్లిపోతాడు. పారిపోవాలనే ఉద్దేశం ఉన్న విద్యార్థులు అక్కడినుంచి వెంటనే పారిపోతారు. కాసేపటికి తిరిగివచ్చిన డ్రైవర్ మిగిలిన విద్యార్థులను తీసుకుని వేదిక్ సిటీకి వస్తాడు.
పాస్‌పోర్ట్‌ను తీసుకోకుండా ఎవరైనా తప్పిపోతే, లేదా వెళ్లిపోతే వెంటనే దగ్గర్లోని భారతీయ ఎంబసీలో ఆ పాస్‌పోర్ట్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే తప్పిపోయినవారు ఏ పరిస్థితుల్లో తప్పిపోయారో, లేక వెళ్లిపోయారో వివరించాల్సి ఉంటుంది. కానీ ఆ సంస్థలు ఇంతవరకూ ఎవరి పాస్‌పోర్టులను కూడా తమకివ్వలేదని, తప్పిపోయారన్న సమాచారం కూడా ఇవ్వలేదని చికాగోలోని భారతీయ దౌత్యాధికారి తెలిపారు.