
నాడు సేవలందించిన బెడ్‌పైనే..!
దుబాయ్: ఆ ఆస్పత్రిలోనే ఆమె ఎన్నో ఏళ్లపాటు సేవలు అందించింది. రోగాలు, గాయాలతో ఆస్పత్రికి వచ్చిన ఎంతోమందికి ఓదార్పునిచ్చింది. ధైర్యాన్ని పంచింది. ఇప్పుడు అదే ఆస్పత్రిలో తాను రోగులకు సేవలందించిన బెడ్‌పైనే ఆమె ఉపశమనం పొందుతున్నది. క్రిస్మస్ పర్వదినం వేళ మాజీ నర్సు మేరీకుట్టి థాంకచన్ (69)కు ఎదురైన అనుభవం ఇది. పక్షవాతపు స్ట్రోక్ రావడంతో.. దుబాయ్‌లోని రషీద్ ఆస్పత్రిలో ఆమె ఇప్పుడు చికిత్స పొందుతున్నది. ప్రస్తుతానికి పూర్తిగా కోలుకోనప్పటికీ రషీద్ ఆస్పత్రిలో క్రిస్మస్ వేళ ఆమె బంధుమిత్రులతో, తన సహచరులతో గడుపడం ఆనందంగా భావిస్తున్నది.
ఒకప్పుడు తను రోగాలకు అందించిన ఉపశమన సేవలు.. అదే చోట ఇప్పుడు తనకు ప్రేమగా లభించడం ఆమెను సంతోషపరుస్తున్నది. మేరీ కుట్టి 14 ఏళ్లపాటు రషీద్ ఆస్పత్రిలో నర్సుగా సేవలందించింది. అనంతరం 1973లో లతీఫ్ ఆస్పత్రికి మారింది. అక్కడ ఏడేళ్ల పాటు రోగుల బాగోగులను చూసుకొని ఆ తర్వాత కుటుంబ బాధ్యతల కారణంగా ఉద్యోగ విరమణ చేసింది. 1994లో ఆమె తిరిగి తన స్వస్థలం కేరళకు తిరిగి వచ్చేసింది. 2010లో భర్త చనిపోవడంతో మరోసారి దుబాయ్‌కి వచ్చి తన కూతురు షీబాతోపాటు కలిసి ఉంటోంది.
ఈ నెల 17న మేరికుట్టికి పక్షవాతపు స్ట్రోక్ వచ్చింది. ఆమె కుడివైపు శరీరమంతా పక్షవాతంతో చచ్చుబడిపోయింది. ఆమె కూతురు వెంటనే ఆమెను రషీద్ ఆస్పత్రిలోని ట్రామకేర్‌కు తరలిచింది. ఆస్పత్రి వైద్యులు, నర్సులు ఆమెను చాలాబాగా చూసుకున్నారు. ఇప్పుడు నెమ్మదిగా కోలుకుంటున్న మేరీకుట్టి ఆస్పత్రితో తన పాత అనుబంధాన్ని నేమరువేసుకుంటున్నది. ఒకప్పుడు తాను కలిసి పనిచేసిన వైద్యులు, నర్సుల గురించి ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం మేరీ ఆరోగ్యం బాగా మెరుగుపడింది. ఆమె కుడిచేయి కూడా ఎత్తగలుగుతున్నది. అతిత్వరలోనే ఆమె ఇంటికి పంపిస్తామని వైద్యులు చెప్తున్నారు. తన సేవలు పొందిన ఆస్పత్రిలోనే తనకు వైద్యం అందుతుండటం ఆమెను ఆనందపరుస్తున్నది. మనం సమాజానికి ఏమిస్తామో అదే తిరిగి వస్తుందన్న చందంగా ఆమె ఆస్పత్రిలో ప్రేమానురాగంతో కూడిన ఉపశమన సేవలు పొందుతున్నారు.