కాబూల్ : తాలిబన్ల మిలిటెంట్ల మధ్య గతవారం రోజులుగా జరుగుతున్న అంతర్యుద్ధంలో 33 మంది ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది. తాలిబన్ అగ్రనేతలు మన్సూర్, రసూల్ మధ్య నెలకొన్న విభేదాలు కారణంగా మిలిటెంట్లు మరణించారని ఘజియా ప్రావిన్స్ పోలీసులు ఆదివారం ప్రకటించారు.
తాలిబన్ నేత ముల్లా అక్తర్ మొహమ్మద్ మన్సూర్ అనుయాయులకు, వ్యతిరేకులకు మధ్య ఘర్షణలు చెలరేగాయని వారు పేర్కొన్నారు. తూర్పు ఘజియా ప్రావిన్స్లోని నావాజిల్లాను ముల్లా వ్యతిరేక నేత మొహమ్మద్ రసూల్ స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించడంతో ఇరువురి మధ్య యుద్ధ వాతావరణం నెలకొందని తెలిపారు.
ఈ పోరులో ఇరువర్గాలకు చెందిన సుమారు 33 మంది ఉగ్రవాదులు హత్యకు గురయ్యారన్నారు. చివరికి రసూల్ వర్గం పైచేయి సాధించిందని తెలిపారు. అయితే ఈ వార్తలను తాలిబన్ ప్రతినిధి జబిహుల్లాహ్ ముజాహిద్ ఖండించారు. ఇవన్నీ అవాస్తవ కథనాలని కొట్టి పారేశారు. నావా జిల్లాపై గత కొన్నాళ్ల కిత్రమే తాము పట్టు సాధించామని తెలిపారు.