సౌదీలో భారత మహిళల కష్టాలు
దుబాయ్: దేశం కాని దేశానికి వలస వెళ్లిన భారత మహిళలు.. చేసిన పనికి నెలల తరబడి జీతాలు అందక అష్టకష్టాలు పడుతున్నారు. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని ఒక ఆస్పత్రిలో క్లీనర్లుగా పని చేస్తున్న 11 మందికి తొమ్మిది నెలలుగా జీతాలు అందట్లేదు. ఈ విషయంపై తాము భారత ఎంబసీకి ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవట్లేదని కేరళకు చెందిన ఆ మహిళలు వాపోయారు. భారత్‌కు చెందిన వారిపై ఆస్పత్రి వర్గాలు వివక్ష చూపిస్తున్నాయని, ఇతర దేశాల పనివార్లకు జీతాలు చెల్లిస్తూ తమకు మాత్రమే నిలిపివేశారని వారు ఆరోపించారు.
సెలవులపై స్వదేశాలకు వెళ్దామన్నా తమను ఇక్కడకు తీసుకొచ్చిన కంపెనీ అనుమతి ఇవ్వడంలేదన్నారు. ఆదివారం నుం చి తాము విధులకు హాజరు కావడంలేదని, జీతాలు చెల్లించిన తర్వాతే మళ్లీ పని చేస్తామని చెప్పారు. దీనిపై భారత ఎంబసీ అధికారులు స్పందిస్తూ.. ఈ విషయానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చి ఆస్పత్రి యజమానులతో, సౌదీ అధికారులతో చర్చలు జరుపుతున్నామన్నారు