90 ఏళ్ల వయసులో.. స్కైడైవ్
లండన్: సాహసం చేయడానికి వృద్ధాప్యం ఆటంకం కాదని ఓ సాహసనారి నిరూపించారు. 90 ఏళ్ల వయసులో అబ్బురపరిచే సాహసం చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇంగ్లండ్కు చెందిన స్టెల్లా గిలార్డ్ 15 వేల అడుగుల ఎత్తు నుంచి స్కైడైవ్ చేశారు. పేరు కోసమో రికార్డు కోసమే గాక సమాజసేవ కోసం ఆమె ఈ ఫీట్ చేశారు.
స్టెల్లా స్కైడైవ్ చేయడం ద్వారా 1.54 లక్షల రూపాయల నిధులు సేకరించి కేన్సర్ ఛారిటీకి అందజేశారు. స్టెల్లా జీవితంలో ఓ విషాదకర సంఘటన దాగుంది. ఆమె కూతురు మూడేళ్ల క్రితం కేన్సర్తో చనిపోయారు. ప్రపంచ కేన్సర్ పరిశోధన సంస్థకు నిధులు సమకూర్చడం కోసం తన కూతురి జ్ఞాపకార్థం ఈ సాహసం చేశారు. 'స్కైడైవ్ చేసేటపుడు కొంచెం కూడా భయపడలేదు. ఇన్స్ట్రక్టర్ చెప్పినట్టు చేశా. పైనుంచి దూకిన తర్వాత పారాచ్యూట్ ఓపెన్ కాకముందు కాస్త ఉత్కంఠకు గురయ్యా. పారాచ్యూట్ తెరుచుకున్నాక అద్భుతంగా అనిపించింది. ఓ పక్షిలాగా కిందకు దిగుతూ అద్భుతమైన దృశ్యాలను చూశాను' అని స్టెల్లా తన అనుభూతులు చెప్పారు.