ఏడేళ్ల వయసులో 'తండ్రి' అయ్యాడు
బీజింగ్: చైనాకు చెందిన ఓ ఏడేళ్ల కుర్రవాడు తండ్రికే తండ్రి అయ్యాడు.. కాదు కాదు..తల్లీతండ్రీ అన్నీ తానే అయ్యాడు. వెన్నుముకకు దెబ్బతగిలి అచేతనంగా మారిపోయిన తండ్రిని అహర్నిశలూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు చైనాలోని గిజువా ప్రావిన్స్ లో ఉండే యాంగ్ ఓ యాంగ్లిన్.
2013లో యాంగ్లిన్ తండ్రి తమ ఇంటి రెండవ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తూ కిందిపడిపోయాడు. దీంతో అతని వెన్నుముక దెబ్బతిని పక్షవాతానికి గురై మంచానికే పరిమితమయ్యాడు. ఉన్న డబ్బంతాఅతని వైద్యానికి ఖర్చయిపోయింది. అతని భార్య మూడేళ్ల పాపను తీసుకొని ఎటో వెళ్లిపోయింది. దీంతో ఏడేళ్ల బాలుడు యాంగ్లీ , అచేతనంగా మారిన అతని తండ్రి మాత్రమే మిగలడంతో బాధ్యతలను నెత్తికెత్తుకోక తప్పలేదు యాంగ్లీకి. ఉదయం ఆరుగంటలకు లేచి వంట చేసి, స్కూలుకు వెళ్లడానికి ముందే తండ్రి టిఫిన్ తినిపించి, మందులు వేస్తాడు.
మధ్యాహ్నం స్కూలు నుంచి ఇంటికి వచ్చి తండ్రికి భోజనం తినిపిస్తాడు. కుటుంబాన్ని పోషించుకునే పనిలో భాగంగా చెత్త ఏరడానికి వెళతాడు. దీని ద్వారా వచ్చే కొద్ది మొత్తంతో తండ్రి వైద్య ఖర్చులతో ఖర్చు కాగా, అలాగే కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
ఇంత చిన్న వయసులో అతనికి ఆటాపాటాకు లేదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచీ, వంట, నాన్న పోషణ, స్కూలు, పని. ఆ తర్వాత అచేతనంగా మారిపోయిన అతని వెన్నుముకకు ఆయిల్ రాసి మర్దనా చేయడం కూడా అతని దినచర్యలో భాగం. గత సంవత్సన్నర కాలంగా ఈ పనుల్లో ఎక్కడా లోపం రాకుండా అటు చదువును, ఇటు కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు.
అటు భరించలేని నొప్పితో నిత్యం నరకం అనుభవిస్తున్న తండ్రి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అయితే ముక్కుపచ్చలారని ఏడేళ్ల పసిప్రాయంలో కొడుకు తనకోసం పడుతున్న తపన చూసి ఆ ఆలోచనను విరమించుకున్నాడు. ఎంతటి బాధనైనా తన తండ్రిలాంటి కొడుకు కోసం పంటి బిగువున ఓర్చుకుంటున్నాడు.