ఆ బుడతడి కల నెరవేరింది!
ఐదేళ్ల ముర్తాజా అహ్మది 'మెస్సీ'పై తనకున్న అభిమానంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలమంది హృదయాలు కొల్లగొట్టాడు. అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ వీరాభిమాని అయిన ఈ చిన్నారి.. అతని టీ షర్ట్ మాదిరి ప్లాస్టిక్ బ్యాగ్‌ను ధరించి.. యుద్ధబాధిత ఆఫ్గానిస్థాన్‌లో ఫుట్‌బాల్ ఆడుతూ కనిపించాడు. అతని ఫొటోలు నెట్టింట్లోకి రావడంతోనే ఎంతోమంది దృష్టిని ఆకర్షించాయి.
నీలం, తెలుపు రంగుల్లో ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్‌పై 'మెస్సీ'తోపాటు అతని జెర్సీ నంబర్ 10ని రాసి.. మొర్తాజా ధరించాడు. ఫుట్‌బాల్ సూపర్ స్టారైన లియోనల్ మెస్సీ కూడా నీలం, తెలపు రంగుల్లోని జెర్సీనే ధరిస్తాడు. దీంతో మొర్తాజా ఫొటోలు ఆన్‌లైన్‌లో ఒక్కసారిగా హల్‌చల్ చేశాయి. మొర్తాజా ఎవరూ అన్న అన్వేషణ ఫుట్‌బాల్ అభిమానుల్లో మొదలైంది. ఈ వార్త స్వయంగా మెస్సీకి కూడా చేరడంతో.. ఆ బుడతడిని కలువాలని ఆయన కూడా ముచ్చటపడ్డారు.
ఎట్టకేలకు మొర్తాజా యుద్ధబాధిత ఆఫ్గానిస్థాన్‌లోని ఓ మారుమూల పల్లెలో తేలాడు. ఒకప్పుడు తాలిబన్ నియంత్రణలో ఈ ప్రాంతంలో ఆటలకు ఎంతమాత్రం తావు లేదు. అయినా ఇక్కడి చిన్నారులు క్రికెట్ అన్నా, ఫుట్‌బాల్ అన్న పడిచస్తారు. అలా చిన్నప్పుడు 'మెస్సీ'కి మొర్తాజా వీరాభిమాని అయిపోయాడు. తమ్ముడి అభిమానాన్ని సంతృప్తిపరిచేందుకు తన దగ్గరున్న ప్లాస్టిక్ బ్యాగుతో 'మెస్సీ' టీ షర్ట్ మాదిరి చొక్కాను రూపొందించి ఇచ్చాడు అతని సోదరుడు 15 ఏళ్ల హమయోన్. ఆ చొక్కాను ధరించి ఆనందంతో ఫుట్‌బాల్ ఆడుతున్న మొర్తాజా ఫొటోలు ఆన్‌లైన్‌లో ఏకంగా మెస్సీ దాకా పాకాయి.
దీంతో మెస్సీ స్వయంగా తాను ధరించే జాతీయ జట్టు టీ షర్ట్‌ని సంతకం చేసి మరీ మొర్జాజా కోసం పంపాడు. మెస్సీ మేనేజ్‌మెంట్, యూనిసెఫ్ సంయుక్తంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో మొర్తాజాకు ఈ టీ షర్ట్ బహుమతిగా అందించారు. దీంతో ఫుల్ ఖుషి అయిన మొర్తాజా 'నేను మెస్సీని ఎంతోగానో ఇష్టపడతాను. ఆయన నన్ను ఇష్టపడుతున్నట్టు ఈ టీ షర్ట్ రాసి పంపారు' అని చెప్పాడు. మెస్సీ టీ షర్ట్ లో ఆడాలన్న తన కల నెరవేర్చుకున్న ఈ బుడతడు త్వరలోనే మెస్సీని కూడా కలువాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు.