నింగిలోకి.. ఎలక్ట్రిక్ విమానం!
వాహనాలు పెట్రోల్, డీజిల్‌తోనే నడవాలా? ఇప్పుడా అవసరం లేదు. సౌర విద్యుత్‌తో నడవొచ్చు. మామూలు కరెంటుతో నడవొచ్చు. అయస్కాంతాలు, గాలి, నీటితో కూడా పరుగులు పెట్టొచ్చు! మరి విమానాల సంగతి? ఆధునిక విమానాలు ఎగరడం మొదలై వందేళ్లవుతోంది. అయినా.. ఇప్పటికీ వాటి ఇంధనాల విషయంలో పెద్దగా మార్పేమీ లేదు. కానీ.. సౌర విమానాలకు రాచబాట వేసేందుకని.. సోలార్ ఇంపల్స్-2 సౌర విమానం చుక్క ఇంధనం లేకుండా ప్రపంచయాత్రను కొనసాగిస్తోండగా...
ఇప్పుడు ఎలక్ట్రిక్ విమానాలకు మార్గం సుగమం చేసేందుకని.. తొలి ఎలక్ట్రిక్ విమానం ‘ఈ-ఫ్యాన్ 2.0’ కూడా గగన విహారం మొదలుపెట్టింది..
ప్రపంచంలోనే తొలి విద్యుత్ విమానమైన ‘ఈ-ఫ్యాన్ 2.0’ను ప్రముఖ విమానయాన కంపెనీ ఎయిర్‌బస్ ఆవిష్కరించింది. పారిస్ ఎయిర్ షో సందర్భంగా ఈ ప్రొటోటైప్ నమూనా విమానాన్ని ఆవిష్కరించడమే కాదు.. గాలిలో విజయవంతంగా చక్కర్లు కొట్టించింది కూడా. ఈ నేపథ్యంలో ‘ఈ-ఫ్యాన్’ గురించి పలు విశేషాలు..
⇒ ఈ-ఫ్యాన్ 2.0లో రెండు సీట్లుంటాయి. బరువు 500 కిలోలే!
⇒ గరిష్ట వేగం గంటకు 218 కిలోమీటర్లు. ఒకసారి చార్జ్ అయితే గంట పాటు ఎగురుతుంది.
⇒ రెండు రెక్కలపై ఉండే లిథియం అయాన్ పాలిమర్ బ్యాటరీలు విద్యుత్‌ను అందిస్తాయి.
⇒ 60 కిలోవాట్ల సామర్థ్యంతో పనిచేసే 2 మోటార్లు విమానాన్ని నడిపిస్తాయి.
⇒ కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను విడుదల చేయదు. కాబట్టి నో పొల్యూషన్!
⇒ శబ్దం అస్సలు చేయదు. కాబట్టి శబ్ద కాలుష్యమూ ఉండదు.
⇒ ఈ-ఫ్యాన్ 2.0 డిజైన్‌కు, తయారీకి అయిన మొత్తం ఖర్చు రూ. 145 కోట్లు.
⇒ పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ విమాన మోడల్ 2017 నాటికి అందుబాటులోకి రానుంది.
⇒ 2019 నాటికి 4 సీట్లతో ఈ-ఫ్యాన్ 4.0ను తెచ్చి విమాన శిక్షణ సంస్థలకు విక్రయించనున్నారు.
⇒ 2050 నాటికి 100 సీట్ల ఎలక్ట్రిక్ విమానాన్ని తన విమాన శ్రేణిలో నిలపాలన్నదే ఎయిర్‌బస్ లక్ష్యం.