భారత మిలిటరీ ఆధునీకరణకు సాయం
అమెరికా హామీ
వాషింగ్టన్: భారత మిలిటరీ ఆధునీకరణకు సహకరిస్తామని అమెరికా హామీనిచ్చింది. గడిచిన దశాబ్ద కాలంలో అమెరికా, భారత్‌ల మధ్య రక్షణ వాణిజ్యం రూ. 96.12 వేల కోట్లకు చేరుకుందని, భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని అమెరికన్ కమాండర్ హ్యారి హారిస్ తెలిపారు. అమెరికాకు చెందిన అత్యాధునిక మిలిటరీ పరిజ్ఞానం వైపు భారత్ చూస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలో భారత్ మిలిటరీని ఆధునీకరించేందుకు అమెరికా కచ్చితంగా సహాయపడగలదని విశ్వాసం వ్యక్తంచేశారు.
దీనికి భారత్ కూడా తోడ్పాటు అందిస్తే అవసరమైన, అర్థవంతమైన మార్గాల్లో మిలిటరీ సామర్థ్యాన్ని పెంచేలా కృషి చేయొచ్చని తెలిపారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య కొనసాగుతున్న రక్షణ సహకారంపై హర్షం వ్యక్తంచేశారు. చాలా ఏళ్లుగా భారత్‌తో కలసి వరుసగా మలబార్ విన్యాసాలను కొనసాగించామని ఇందులో జపాన్ కూడా భాగమైందని గుర్తుచేశారు. భారత్, జపాన్, అమెరికాల మధ్య త్రైపాక్షిక బంధం ఎంతో అవసరమని పేర్కొన్నారు.