
విచారణకు అసాంజే!
లండన్: వికిలీక్స్ ద్వారా అగ్రరాజ్యానికి కంటిమీద కులుకులేకుండా చేసిన జూలియన్ అసాంజె.. తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై విచారణను ఎదుర్కోనున్నారు. నాలుగేళ్లుగా లండన్లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో తలదాచుకుంటున్న అసాంజెను సోమవారం స్వీడన్ ప్రాసిక్యూటర్ సమక్షంలో ఈక్వెడార్ ప్రాసిక్యూటర్ ప్రశ్నించనున్నారని స్వీడన్ అధికారులు వెల్లడించారు.
వికీలీక్స్ ద్వారా అమెరికా ప్రభుత్వ రహస్య పత్రాలను వెల్లడించి సంచలనం సృష్టించిన కొద్ది రోజులకే అసాంజేపై ఇద్దరు స్వీడన్ మహిళలు లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వారిలో ఓ మహిళ లైంగిక చర్యలో అసాంజే ఉద్దేశపూర్వకంగా కండోమ్ను ధ్వంసం చేశాడని ఆరోపించగా.. మరో మహిళ తాను నిద్రలో ఉన్న సమయంలో అసాంజే లైంగిక చర్యకు పాల్పడ్డాడని ఆరోపించింది. స్వీడన్ చట్టాల ప్రకారం స్పృహలో లేని, తాగిన మైకంలో ఉన్న, నిద్రలో ఉన్న వారితో లైంగిక చర్య జరిపితే.. దాన్ని రేప్గా పరిగణించి.. ఆరేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. విచారణ సందర్భంగా అసాంజే డీఎన్ఏ శాంపిల్ను కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా.. అసాంజేను కావాలనే ఈ కేసులో ఇరికించారని అంతర్జాతీయ సమాజం పెద్ద ఎత్తున అతడికి బాసటగా నిలుస్తోంది.