దెయ్యం చెట్లతో జెట్ విమానాలకు ఇంధనం
కాన్బెర్రా: ఆస్ట్రేలియాలో ప్రఖ్యాతిగాంచిన ఘోస్ట్ గమ్ చెట్లతో జెట్ విమానాలకు ఇంధనాన్ని ఉత్పత్తి చేయనున్నారు. ఈ మేరకు ఆస్ట్రేలియాకు చెందిన ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ(ఏఎన్యూ)కు చెందిన శాస్త్రవేత్తలు వివరాలు వెల్లడించారు. యూకలిప్టస్ ఆయిల్ లో లభించే మోనోటర్పన్స్ అనే పదార్థాలను ఉపయోగించుకుంటూ ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయవచ్చని, దీనిని జెట్ లకు ఉపయోగించవచ్చని పేర్కొన్నారు.
క్షిపణులకు, జెట్ విమానాలకు తక్కువ కర్బన సమ్మేళనాలు ఉండే ఇంధనం మాత్రమే సరిపోతుందని, ఇది ఆస్ట్రేలియాలో ఉన్న గమ్ చెట్ల ద్వారా సాధ్యం అవుతుందని చెప్పారు. ఏఎన్యూ బయాలజీ రీసెర్చ్ విభాగం అధ్యక్షుడు కార్స్టెన్ కులీమ్ మాట్లాడుతూ గమ్ చెట్లు కూడా యూకలిప్టస్ కుటుంబానికే చెందిన మొక్కలే అని ఒకసారి స్పష్టమైతే ఇక వాటి నుంచి ప్రపంచంలోని విమానాలకు ఐదుశాతం ఇంధనాన్ని ఈ చెట్ల ద్వారా ఉత్పత్తి చేయవచ్చని అన్నారు. ఇప్పటికే వీటిద్వారా పేపర్ ను తయారు చేస్తున్నారు.