jet fuel
-
పెట్రోల్, డీజిల్ అమ్మకాలు అప్..
వ్యవసాయానికి డిమాండ్ పెరగడం, వేసవి ప్రారంభంతో వాహన ఎయిర్ కండిషనింగ్ అవసరం వంటి అంశాలతో భారత్‌లో మేనెల పెట్రోల్ డీజిల్ అమ్మకాలు పెరిగాయని తాజా గణాంకాలు తెలిపాయి. ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. న్యూఢిల్లీ: దేశంలో అత్యధికంగా వినియోగించే ఇంధనం– డీజిల్‌కు డిమాండ్ ( మొత్తం డిమాండ్‌లో ఐదింట రెండు వంతుల వాటా) గత ఏడాది మేతో పోలిస్తే మేలో 9.3 శాతం పెరిగి 7.46 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఏప్రిల్‌లో డిమాండ్ పెరుగుదల 6.7 శాతం. ► నెలవారీగా చూస్తే డీజిల్ డిమాండ్ ఏప్రిల్‌లో 7.16 మిలియన్ టన్నులుకాగా, మేలో 4.2 శాతం పెరుగుదలతో 7.46 మిలియన్ టన్నులకు చేరింది. ► ఇక పెట్రోల్ అమ్మకాలు వార్షికంగా 10.4 శాతం పురోగతితో 3.08 మిలియన్ టన్నులకు చేరింది. నెలవారీగా చూస్తే డిమాండ్ 16.5 శాతం పెరిగింది. ► పారిశ్రామిక, వ్యవసాయ కార్యకలాపాలు పుంజుకోవడంతో మార్చి ద్వితీయార్థం నుంచి పెట్రోలు, డీజిల్ విక్రయాలు పెరిగాయి. మార్చి ప్రథమార్థంలో వార్షిక ప్రాతిపదికన పెట్రోల్ విక్రయాలు 1.4 శాతం, డీజిల్ 10.2 శాతం తగ్గాయి. ► ఉష్ణోగ్రత పెరుగుదలతో ఎయిర్ కండిషనింగ్ అవసరాలు పెరగడమూ మేలో వినియోగం పెరగడానికి ఒక కారణం. ► రబీ పంటలు– ఎక్కువగా గోధుమలు, బార్లీ, ఆవాలు, నువ్వులు, పెసల పంటకాలం అక్టోబర్–డిసెంబర్ మధ్య ప్రారంభమవుతుంది. నూర్పిడికాలం ఏప్రిల్ నుండి జూన్ వరకు ఉంటుంది. హార్వెస్టింగ్, ట్రాక్టర్ల అవసరాలు డీజిల్ డిమాండ్ పెరుగుదలకు దారితీస్తుంది. ► కోవిడ్ సంక్షోభంలో ఉన్న 2021మే నెలతో పోల్చితే పెట్రోల్ వినియోగం తాజా సమీక్షా నెల్లో 72 శాతం పెరిగింది. మహమ్మారి ముందు 2019 మే నెలతో పోల్చితే 23.7 శాతం ఎగసింది. ► మే 2021తో పోల్చితే డీజిల్ వినియోగం 52.5 శాతం, మే 2019తో పోల్చితే 6.8 శాతం ఎగశాయి. పరిశ్రమ మాట.. ప్రభుత్వ, ప్రైవేట్ మూలధన వ్యయం పెరగడంతో భారత ఆర్థిక వ్యవస్థ వేగం పుంజుకుంది. సేవల రంగం పటిష్టంగా ఉండగా తయారీ రంగం కూడా పుంజుకుంది. దేశంలో చమురు డిమాండ్‌కు బలమైన పారిశ్రామిక కార్యకలాపాలు మద్దతునిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో డిమాండ్ పుంజుకోవడం ఇంధన డిమాండ్‌కు మద్దతు నిస్తోంది. నీటిపారుదల విభాగంలో పైపుల వినియోగం ఇంధన డిమాండ్‌కు కారణంగా ఉన్న మరో కీలక అంశం. జెట్ ఫ్యూయల్‌కు డిమాండ్ ఏవియేషన్ రంగం నిరంతర సేవల పునఃప్రారంభంతో విమానాశ్రయాలలో భారత్ మొత్తం ప్రయాణీకుల రద్దీ కోవిడ్ ముందస్తు స్థాయికి చేరువవుతోంది. ఈ నేపథ్యంలో జెట్ ఫ్యూయెల్ డిమాండ్ మే నెల్లో 2022 ఇదే నెల్లో పోల్చితే 8.7 శాతం పెరిగి 6,09,800 టన్నులకు ఎగసింది. 2021 మేతో పోల్చితే 137 శాతం పెరిగింది. అయితే కోవిడ్ ముందస్తు విషయానికి వస్తే, 2019 మేనెలతో పోల్చితే 5.3% తక్కువగానే నమోదయ్యింది. అలాగే ఏప్రిల్ 2023తో (6,13,900 టన్నులు) పోల్చినా డిమాండ్ 0.7% తక్కువగానే ఉంది. వంట గ్యాస్ అమ్మకాలూ అప్ మరోవైపు వంట గ్యాస్ ఎల్పీజీ అమ్మకాలు వార్షికంగా మేలో 10% పెరిగి 2.4 మిలియన్ టన్నులకు చేరింది. ఎల్పీజీ వినియోగం 2021 మేతో పోల్చితే 13%, కోవిడ్ ముందస్తు కాలం 2019 మేతో పోల్చితే 19.6 % ఎగసింది. నెలవారీ డిమాండ్ చూసి నా (2023 ఏప్రిల్) మేనెల్లో ఎల్పీజీ డిమాండ్ 11.3 శాతం పెరిగింది. ఏప్రిల్‌లో డిమాండ్ 2.19 మిలియన్ టన్నులు. -
విండ్ ఫాల్ టాక్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం
-
విండ్‌ఫాల్ టాక్స్ కోత: వారికి భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: విండ్‌ఫాల్ టాక్స్ పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది డీజిల్, క్రూడ్ ఆయిల్, జెట్ ఇంధన రవాణాపై విండ్‌ఫాల్ పన్ను తగ్గించింది. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారి చేసింది. డీజిల్, విమాన ఇంధన రవాణాపై లీటర్‌కు 2 రూపాయలు పన్ను తగ్గుతుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది, ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం పెట్రోలుపై రూ.6 (లీటరుకు) ఎగుమతి పన్నును కూడా రద్దు చేసింది. దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై పన్నును కూడా దాదాపు 27 శాతం తగ్గించింది. టన్నుకు 23,250 రూపాయల నుంచి తగ్గించి రూ.17 వేలుగా ఉంచింది. అంతర్జాతీయంగా చమురు రేట్టు తగ్గడంతో దేశీ చమురు ఉత్పత్తి దారులు, రిఫైనర్లపై విండ్‌ఫాల్ పన్నును తగ్గించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. విండ్‌ఫాల్ టాక్స్ విధించిన ఒక నెలలోపే కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. సవరించిన రేట్లు నేటి (జూలై 20) నుంచే అమలులోకి వచ్చాయి. ప్రభుత్వం ప్రకటించిన విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు, ఎగుమతులపై సుంకాల కోత పెట్రోలియం రంగానికి భారీ ఊరటనిస్తుందని పరిశ్రమ పెద్దలు వ్యాఖ్యానించారు. ఫలితంగా రిలయన్స్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఆయిల్ ఇండియా లిమిటెడ్ లాంటి ఆయిల్ మార్కెటింగ్ సంస్థలకు ప్రయోజనం సమకూరనుంది. ట్యాక్స్ తగ్గింపుతో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐఓసీఎల్, ఓఎన్జీసీ షేర్లలో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. మరోవైపు అంతర్జాతీయంగా మార్కెట్లో క్రూడాయిల్ ధరలు మళ్లి పుంజుకున్నాయి. చాలాకాలం తరువాత ఇటీవల 100 డాలర్ల దిగువకు చేరిన బ్యారెల్ ధర మళ్లీ పైకెగసింది. బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బ్యారెల్ క్రూడాయిల్ 107.23 డాలర్లు పలుకుతోంది. -
విమానాలకు ఇంధనం...పాడైన ఆహారంతో...!
వాషింగ్టన్: మీ ఇంట్లో ఆహారం ఎక్కువగా వృథా అవుతుందా...! మిగిలిపోయిన ఆహారాన్ని సింపుల్‌గా చెత్త బుట్టలో వేస్తున్నారా...! భవిష్యత్తులో మాత్రం అలా చేయకండి. చెత్తబుట్టలో వేసిన ఆహారాన్ని జాగ్రత్తగా దాచండి. మీరు పాడేసేది ఆహారాన్నే కాదు.. డబ్బులను కూడా ... వీడేవండి బాబు..! ఇలా చెప్తున్నాడు అనుకుంటున్నారా... అవును మీరు వినందీ నిజమే, భవిష్యత్తులో పాడైపోయిన ఆహారం మీకు కాసులను కురిపించనున్నాయి. అది ఎలా అని వాపోతున్నారా..! పాడైపోయిన ఆహారంతో విమానాలకు ఇంధనాన్ని తయారుచేయవచ్చును. ఆహార వ్యర్థాలను విమానయాన ఇంధనంగా మార్చడానికి అమెరికా పరిశోధకులు ఒక మార్గాన్ని కనుగొన్నారు. దీంతోపాటుగా విమానాల నుంచి విడుదలయ్యే కార్బన్‌ను నియంత్రించవచ్చును. అంతేకాకుండా గ్రీన్హాజ్ ఉద్గారాలను 165 శాతం తగ్గించవచ్చును. ఆహార వ్యర్థాల నుంచి రిలీజ్ అయ్యే మిథేన్ వాయువును అరికట్టవచ్చును.ఈ వ్యర్థాలతో పారఫిన్ అనే ఇంధనాన్ని తయారుచేయవచ్చునని పరిశోధకులు తెలిపారు. ఈ ఇంధనాన్ని జెట్ విమానాలకు వాడొచ్చు. ప్రస్తుతం విమాయానరంగ సంస్థలకు ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా పెరిగిన, అదే స్ధాయిలో ఉద్గారాలను తగ్గించలేకపోతున్నాయి. పాడైన ఆహారం నుంచి పారాఫిన్... పరిశోధకుల నివేదిక ప్రకారం.. పాడైన ఆహారాన్ని, కార్లలో , ఇతర హెవీ వెహికల్లో వాడే ఇంధనం బయోడిజీల్ మాదిరిగానే పారఫిన్‌ను తయారుచేయవచ్చునని పేర్కొన్నారు. సింథటిక్ ఇంధనాన్ని తయారుచేయడానికి వంటనూనె, పనికి రాని కొవ్వు పదార్థాలు , నూనె , గ్రీజు అవసరమౌతాయి. వీటి కలయికతో డీజీల్‌ను పొందవచ్చు. అదే మాదిరిగా కొన్ని ప్రత్యేక పద్ధతులనుపయోగించి జెట్ ఫ్యూయల్‌ను తయారుచేయవచ్చును. అందుకుగాను పరిశోధకులు ప్రత్యామ్నాయ పద్ధతులతో ఆహార వ్యర్థాలను , జంతువుల ఎరువు, వ్యర్థజలాలను జెట్ హైడ్రోకార్బన్ ఇంధనంగా తయారుచేసే పద్ధతిని అభివృద్ధి పరిచారు. తొందరగా ఆవిరయ్యే ఫాటీ ఆసిడ్స్‌తో సులువుగా జెట్ ఫ్యూయల్‌ను తయారుచేయవచ్చునని అమెరికా జాతీయ పునరుత్పాదక శక్తి పరిశోధన సంస్ధ కు చెందిన సీనియర్ ఇంజనీరు డెరేక్ వార్డన్ తెలిపారు. పాడైన ఆహారంతో తయారైన జెట్ ప్యూయల్తో 2023లో సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి మొట్టమొదటి టెస్ట్ ఫ్లైట్‌ను పరీక్షంచనున్నారు. (చదవండి: గూగుల్ మ్యాప్స్ కొత్త ఆప్డేట్.. !) -
ఎయిర్ ఇండియాకు మరో షాక్
సాక్షి, న్యూఢిల్లీ : సంక్షోభంలో కూరుకుపోయిన ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను కష్టాలు వీడటం లేదు. విమానాలకు ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్‌ను సమకూర్చే చమురు కంపెనీలకు రూ 4500 కోట్ల మేర చెల్లింపులు బకాయి ఉండటంతో ఆయా సంస్థలు ఇంధన సరఫరాలను నిలిపివేశాయి. ఏడు నెలల నుంచి తమకు రావాల్సిన బకాయిలను ఎయిర్ ఇండియా క్లియర్ చేయలేదని చమురు కంపెనీల ఉన్నతాదికారులు పేర్కొన్నారు. బకాయిలు పేరుకుపోవడంతో కొచ్చి, పుణే, పాట్నా, రాంచీ, వైజాగ్, మొహాలీ విమానాశ్రయాల్లో జెట్ ఇంధన సరఫరాను నిలిపివేయాలని ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌లు నిర్ణయించాయి. జెట్ ఇంధనం కొనుగోలు చేసిన 90 రోజుల వరకూ చెల్లింపులు జరిపేలా ఎయిర్ ఇండియాకు క్రెడిట్ వ్యవధి ఉన్నా ఎయిర్ ఇండియా సకాలంలో చెల్లింపులు జరపడంలేదని, క్రెడిట్ వ్యవధి ఇప్పుడు 200 రోజులు దాటినా చెల్లింపులు లేవని చమురు కంపెనీలకు చెందిన ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. మూడు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలకు ఎయిర్ ఇండియా రూ 4500 కోట్ల మేర బకాయిలు పడింది. భారీ బకాయిలు ఉన్నా ఎయిర్ ఇండియా ప్రస్తుతం కేవలం రూ 60 కోట్లు చెల్లించేందుకే ముందుకు వచ్చిందని మరో అధికారి వెల్లడించారు. మూడు చమురు సంస్ధలు కలిపి బకాయిలపై గత వారం ఎయిర్ ఇండియాకు లేఖ రాశాయి. తక్షణమే బకాయిలు క్లియర్ చేయకుంటే జెట్ ఇంధన సరఫరాను నిలిపివేస్తామని ఈ లేఖలో ఎయిర్ ఇండియాను ఆయా కంపెనీలు హెచ్చరించాయి. బకాయిల చెల్లింపులపై సమగ్ర ప్రణాళికతో ముందుకు రావడంలో విఫలమవడంతో ఎయిర్ ఇండియాకు ఇంధన సరఫరాలను నిలిపివేయాలనే నిర్ణయం తీసుకోక తప్పలేదని మూడు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వెల్లడించాయి. కాగా ఎయిర్ ఇండియా నిర్వహణ సామర్ధ్యం మెరుగ్గా ఉన్న సంస్థ రుణ భారం రూ 58,000 కోట్లకు పైగా చేరిందని ఎయిర్ ఇండియా ప్రతినిధి పేర్కొన్నారు. నిధుల సమీకరణ సంక్లిష్టంగా మారడంతో చెల్లింపులు, రుణాల క్లియరెన్స్‌లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆ ప్రతినిధి వెల్లడించారు. -
విమాన ప్రయాణీకులకు చార్జీల షాక్..
సాక్షి, న్యూఢిల్లీ : పండుగ సీజన్లో విమాన ప్రయాణీకులకు ఎయిర్‌లైన్స్ షాక్ ఇవ్వనున్నాయి. ఏవియేషన్ టర్భైన్ ఇంధనంపై కస్టమ్స్ సుంకాన్ని ప్రభుత్వం పెంచిన క్రమంలో పెరిగిన వ్యయాన్ని ప్రయాణీకులకు బదలాయించాలని విమానయాన సంస్థలు నిర్ణయించాయి. విమాన చార్జీలను నేరుగా పెంచకుండా వేరే చార్జీల రూపంలో వడ్డన ఉండే విధంగా ఎయిర్‌లైన్స్ సంసిద్దమయ్యాయి. పెరుగుతున్న ఇంధన ధరలు, విపరీతమైన పోటీ కారణంగా ప్రయాణీకులపై భారం మోపలేకపోవడం ఎయిర్‌లైన్స్‌పై ఒత్తిడి పెంచుతున్నాయని, తాజాగా ప్రభుత్వం జెట్ ఇంధనంపై కస్టమ్స్ సుంకం పెంచిన క్రమంలో చార్జీల పెంపు మినహా మరో ప్రత్యామ్నాయం లేదని ఎయిర్‌లైన్స్ భావిస్తున్నాయి. ఎయిర్‌లైన్స్ నిర్వహణ వ్యయంలో ప్రధానమైన ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్‌పై 5 శాతం కస్టమ్స్ సుంకం విధించాలని ప్రభుత్వం గత నెల నిర్ణయం తీసుకుంది. ప్రయాణం రద్దు చేసుకున్న సందర్భంలో అధిక చార్జీలను వసూలు చేయడంతో పాటు, ప్రయాణ తేదీల్లో మార్పు, ఆన్‌బోర్డ్ మీల్స్, బ్యాగేజ్ ఫీజు, కార్గో చార్జీలు, అదనపు బ్యాగేజ్ చార్జీలను భారీగా దండుకోవాలని విమానయాన సంస్థలు యోచిస్తున్నాయి. -
గగనతలంలో ఎలక్ట్రిక్ ప్లేన్ల సందడి
-
గగనతలంలో ఎలక్ట్రిక్ ప్లేన్ల సందడి
న్యూయార్క్: పెరుగుతున్న వాయు కాలుష్యానికి చెక్ పెట్టడంతో పాటు ఇంధన ఖర్చులను ఆదా చేసేందుకు త్వరలో గగనతలంలో ఎలక్ట్రిక్ విమానాలు సందడి చేయనున్నాయి. మరో పదేళ్లలో పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ కమర్షియల్ ప్లేన్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఈజీజెట్ అమెరికన్ ఇంజనీరింగ్ స్టార్టప్‌తో కలిసి పనిచేస్తోంది. 335 మైళ్ల దూరం ప్రయాణించగల ఎయిర్‌క్రాఫ్ట్‌ను డిజైన్ చేయడంపై అమెరికాకు చెందిన రైట్ ఎలక్ట్రిక్ కసరత్తు ప్రారంభించింది. ఈజీజెట్ విమానాల్లో ఇప్పుడు ప్రయాణించే వారి సంఖ్యలో 20 శాతం మందిని చేరవేయగల సీటింగ్ కెపాసిటీతో ఈ ఎలక్ట్రిక్ ప్లెయిన్‌ను డిజైన్ చేస్తున్నారు. వీటి కమర్షియల్ ఉత్పత్తులను వేగవంతం చేసేందుకు రైట్ ఎలక్ట్రిక్.. ఈజీజెట్‌తో కలిసి పనిచేస్తుంది. బ్యాటరీతో నడిచే విమానాలు ఇంధన వ్యయాలను తగ్గించడమే కాక, తక్కువ దూరాల ప్రయాణానికి అనువుగా ఉంటాయని, వాయు కాలుష్య నివారణకూ ఇవి ఉపకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. పర్యావరణంపై తక్కువ ప్రభావం చూపేలా ఎలక్ట్రిక్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, విమానయాన పరిశ్రమ సైతం ఎలక్ట్రిక్ బాట పట్టాల్సిన అవసరం ఉందని ఈజీజెట్ సీఈవో కార్లన్ మెకాల్ చెప్పారు. -
నీలగిరి చెట్ల నుంచి జెట్ ఇంధనం!
మెల్బోర్న్: తక్కువ కర్బన ఉద్గారాలు వెలువరించే జెట్ విమానాల ఇంధనాన్ని యూకలిప్టస్(నీలగిరి) చెట్లను ఉపయోగించి తయారు చేయొచ్చని తేలింది. ‘ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల యూకలిప్టస్(జామాయిల్)చెట్లను పెంచినట్లయితే విమానయాన పరిశ్రమకు కావాల్సిన 5 % ఇంధనాన్ని వాటి నుంచి తయారు చేయొచ్చు’ అని ఆస్ట్రేలియన్ నేషనల్ వర్సిటీకి చెందిన కార్స్టెన్ కుల్హీమ్ పేర్కొన్నారు. మొత్తం ఈ పరిశ్రమ ద్వారా 2 శాతం కార్బన్ డై ఆక్సైడ్ విడుదల అవుతోంది. శిలాజ ఇంధనాలతో పోల్చితే యూకలిప్టస్ ఇంధనం ఖరీదైందని, కాకపోతే వీటివల్ల కార్బన్‌డై ఆక్సైడ్ తక్కువగా విడుదలవుతుందన్నారు. జెట్ విమానాలకు శిలాజేతర ఇంధనాలు వాడడం కాస్త కష్టమని, అయితే పునరుత్పాదక ఇథనాల్, బయోడీజిల్ కొంతమేరకు ఫర్వాలేదని చెప్పారు. యూకలిప్టస్ నూనెలో మోనోటర్పీన్లు ఉంటాయని, వాటిని అధిక శక్తినిచ్చే ఇంధనాలుగా మార్చొచ్చని తెలిపారు. -
దెయ్యం చెట్లతో జెట్ విమానాలకు ఇంధనం
కాన్బెర్రా: ఆస్ట్రేలియాలో ప్రఖ్యాతిగాంచిన ఘోస్ట్ గమ్ చెట్లతో జెట్ విమానాలకు ఇంధనాన్ని ఉత్పత్తి చేయనున్నారు. ఈ మేరకు ఆస్ట్రేలియాకు చెందిన ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ(ఏఎన్‌యూ)కు చెందిన శాస్త్రవేత్తలు వివరాలు వెల్లడించారు. యూకలిప్టస్ ఆయిల్ లో లభించే మోనోటర్పన్స్ అనే పదార్థాలను ఉపయోగించుకుంటూ ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయవచ్చని, దీనిని జెట్ లకు ఉపయోగించవచ్చని పేర్కొన్నారు. క్షిపణులకు, జెట్ విమానాలకు తక్కువ కర్బన సమ్మేళనాలు ఉండే ఇంధనం మాత్రమే సరిపోతుందని, ఇది ఆస్ట్రేలియాలో ఉన్న గమ్ చెట్ల ద్వారా సాధ్యం అవుతుందని చెప్పారు. ఏఎన్‌యూ బయాలజీ రీసెర్చ్ విభాగం అధ్యక్షుడు కార్స్టెన్ కులీమ్ మాట్లాడుతూ గమ్ చెట్లు కూడా యూకలిప్టస్ కుటుంబానికే చెందిన మొక్కలే అని ఒకసారి స్పష్టమైతే ఇక వాటి నుంచి ప్రపంచంలోని విమానాలకు ఐదుశాతం ఇంధనాన్ని ఈ చెట్ల ద్వారా ఉత్పత్తి చేయవచ్చని అన్నారు. ఇప్పటికే వీటిద్వారా పేపర్ ను తయారు చేస్తున్నారు.