సాక్షి, న్యూఢిల్లీ : సంక్షోభంలో కూరుకుపోయిన ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను కష్టాలు వీడటం లేదు. విమానాలకు ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్‌ను సమకూర్చే చమురు కంపెనీలకు రూ 4500 కోట్ల మేర చెల్లింపులు బకాయి ఉండటంతో ఆయా సంస్థలు ఇంధన సరఫరాలను నిలిపివేశాయి. ఏడు నెలల నుంచి తమకు రావాల్సిన బకాయిలను ఎయిర్ ఇండియా క్లియర్ చేయలేదని చమురు కంపెనీల ఉన్నతాదికారులు పేర్కొన్నారు. బకాయిలు పేరుకుపోవడంతో కొచ్చి, పుణే, పాట్నా, రాంచీ, వైజాగ్, మొహాలీ విమానాశ్రయాల్లో జెట్ ఇంధన సరఫరాను నిలిపివేయాలని ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌లు నిర్ణయించాయి.
జెట్ ఇంధనం కొనుగోలు చేసిన 90 రోజుల వరకూ చెల్లింపులు జరిపేలా ఎయిర్ ఇండియాకు క్రెడిట్ వ్యవధి ఉన్నా ఎయిర్ ఇండియా సకాలంలో చెల్లింపులు జరపడంలేదని, క్రెడిట్ వ్యవధి ఇప్పుడు 200 రోజులు దాటినా చెల్లింపులు లేవని చమురు కంపెనీలకు చెందిన ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. మూడు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలకు ఎయిర్ ఇండియా రూ 4500 కోట్ల మేర బకాయిలు పడింది. భారీ బకాయిలు ఉన్నా ఎయిర్ ఇండియా ప్రస్తుతం కేవలం రూ 60 కోట్లు చెల్లించేందుకే ముందుకు వచ్చిందని మరో అధికారి వెల్లడించారు. మూడు చమురు సంస్ధలు కలిపి బకాయిలపై గత వారం ఎయిర్ ఇండియాకు లేఖ రాశాయి. తక్షణమే బకాయిలు క్లియర్ చేయకుంటే జెట్ ఇంధన సరఫరాను నిలిపివేస్తామని ఈ లేఖలో ఎయిర్ ఇండియాను ఆయా కంపెనీలు హెచ్చరించాయి.
బకాయిల చెల్లింపులపై సమగ్ర ప్రణాళికతో ముందుకు రావడంలో విఫలమవడంతో ఎయిర్ ఇండియాకు ఇంధన సరఫరాలను నిలిపివేయాలనే నిర్ణయం తీసుకోక తప్పలేదని మూడు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వెల్లడించాయి. కాగా ఎయిర్ ఇండియా నిర్వహణ సామర్ధ్యం మెరుగ్గా ఉన్న సంస్థ రుణ భారం రూ 58,000 కోట్లకు పైగా చేరిందని ఎయిర్ ఇండియా ప్రతినిధి పేర్కొన్నారు. నిధుల సమీకరణ సంక్లిష్టంగా మారడంతో చెల్లింపులు, రుణాల క్లియరెన్స్‌లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆ ప్రతినిధి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment