
భార్య చేతిలో భర్తకు ఊహించని మరణం
ఆలుమగల మధ్య జరిగిన గొడవలో భార్య చేతిలో భర్త ప్రాణాలు కోల్పోయిన ఘటన వియత్నాంలో కలకలం రేపింది. పట్టుకోనిరాని చోట పట్టుకోవడంతో మగడు మృతి చెందాడు. అతడి వృషణాలను భార్య అదిమి పట్టుకోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు లీ కిమ్ ఖాయ్గా గుర్తించారు.
బయటికి నుంచి ఇంటికి తిరిగొచ్చిన లీ కిమ్ తలుపు గడియ పెట్టివుండడం గమనించాడు. తలుపును గట్టిగా బాదినా అతడి భార్య పాన్ థీ కిమ్ చుయొంగ్, ఇద్దరు కూతుళ్లు పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన లీ కిమ్ చేతి రంపంతో భార్యపై దాడి చేశాడు. విచక్షణారహితంగా ఆమెను కొట్టాడు. భర్త నుంచి ప్రాణాలను కాపాడుకునేందుకు అతడి వృషణాలను పట్టుకుంది. అక్కడితో ఊరుకోకుండా భర్తను కిందపడేసి అతడి పొట్టపై కూర్చుని కదలకుండా చేసింది. అతడు వాంతులు చేసుకున్నా పట్టించుకోలేదు.
అరుపులు విని ఇరుగుపొరుగు వారు అక్కడికి పరుగెత్తికొచ్చి చుయొంగ్ చేతిలోంచి భర్తను విడిపించారు. అపస్మారక స్థితిలో పడివున్న అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. అయితే గతంలోనూ పలుమార్లు లీ కిమ్ తనను కొట్టాడని చుయొంగ్ వెల్లడించింది. హెచ్చరించేందుకే అతడి సున్నితావయవాలను పట్టుకున్నానని, ఇలా జరుగుతుందని ఊహించలేదని ఆమె వాపోయింది.