
సంతాన బామ్మ!
వయసు 65. సంతానం 13. ఏడుగురు మనవలు, మనవరాళ్లు కూడా ఉన్నారు. అయినా, మరోసారి ఒకే కాన్పులో నలుగురు పిల్లలు! జర్మనీ మహిళ అన్నెగ్రెట్ రౌనిక్ పొందిన సంతాన భాగ్యం ఇది. కృత్రిమ గర్భధారణ పద్ధతి ద్వారా ముదిమిలో గర్భం దాల్చిన రౌనిక్ శనివారం ఉదయం ఉక్రెయిన్‌లోని ఓ ఆస్పత్రిలో నలుగురు బిడ్డలకు జన్మనిచ్చింది. దీంతో ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన అత్యధిక వయసు మహిళగా రౌనిక్ రికార్డు సృష్టించింది. ఈసారి ముగ్గురు మగబిడ్డలు, ఒక ఆడబిడ్డ. కానీ నెలలు నిండకుండానే 26 వారాలకే (ఆరు నెలలకే) జన్మించారు!
అయినా, వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని, బతికే అవకాశాలు బాగున్నాయని వైద్యులు ప్రకటించారు. ఇంగ్లిష్, రష్యన్ భాషలు బోధించే టీచర్ అయిన రౌనిక్ పెద్ద కూతురు వయసు 44 ఏళ్లు కాగా, చిన్న కూతురు వయసు 9 ఏళ్లు. చివరిసారిగా 55 ఏళ్ల వయసులో రౌనిక్ 13వ బిడ్డను ప్రసవించింది. అయితే, తనకు ఆడుకోవడానికి ఓ బుల్లి తమ్ముడు లేదా చెల్లి కావాలని చిన్న కూతురు కోరడంతో ఈ వయసులో ఇలా మరోసారి గర్భం దాల్చింది. నాలుగు అండాలు ఫలదీకరణం చెందినట్లు గుర్తించిన వైద్యులు మొదట్లోనే హెచ్చరించినా, ఆమె వెనకడుగు వేయలేదు. నలుగురినీ క నేందుకే మొగ్గు చూపింది. ఇంత వయసులోనూ తాను ఇంత ఫిట్‌గా ఉండటం గురించి ప్రశ్నిస్తే.. పిల్లలే తన ‘యవ్వన’ రహస్యమని చిరునవ్వులతో బదులిస్తోంది ఈ బామ్మ.