అమెరికాలో పెరుగుతున్న మిలియనీర్లు | Boston consulting group Report on increasing Millionaires in America | Sakshi
Sakshi News home page

అమెరికాలో పెరుగుతున్న మిలియనీర్లు

Published Tue, Nov 22 2016 5:14 PM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

అమెరికాలో పెరుగుతున్న మిలియనీర్లు - Sakshi

అమెరికాలో పెరుగుతున్న మిలియనీర్లు

న్యూయార్క్‌ : అమెరికాలో ఉపాధి అవకాశాలు నానాటికి సన్నగిల్లుతున్నాయని, కార్మిక వర్గం కూడా ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటోందని, దిగువ మధ్య తరగతి పరిస్థితి మరింత దిగజారిపోయిందని వార్తలు వింటూ వస్తున్నాం. ఈ అంశాలే ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్‌ ట్రంప్‌ విజయానికి కలిసొచ్చాయని కూడా విన్నాం. చదివాం. ఇది అమెరికాలో ఒకభాగం మాత్రమే.

అమెరికాలోని మరో భాగంలో ధనరాశులు పేరుకుపోతున్నాయని, రోజురోజుకు ధనవంతులు పెరుగుతున్నారని కూడా వింటున్నాం. అమెరికాలో కొంత మంది దగ్గర 56.6 ట్రిలియన్‌ డాలర్ల ప్రైవేటు ఆస్తులు పోగై ఉండగా, వారిలో 80 లక్షల మంది మిలియనీర్లు ఉన్నారు. 2010 నుంచి 2015 వీరి సంఖ్య 24 లక్షల పెరగ్గా, మరో ఐదేళ్ల కాలంలో అంటే, 2020 సంవత్సరానికి మరో 31 లక్షల మంది మిలియనీర్లు పెరుగుతారని బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ అంచనా వేసింది. అంటే రోజుకు 1700 మంది చొప్పున మిలియనీర్లు పెరుగుతారట. ఇల్లు, లగ్జరీ వస్తువుల విలువను వదిలేసి మిగతా ఆస్తుల విలువ పది లక్షల డాలర్లు కలిగిన వారినే ఇక్కడ మిలియనీర్లుగా పరిగణలోకి తీసుకున్నారు.

ప్రపంచంలోకెల్లా అమెరికాలోనే సంపన్నులు ఎక్కువగా ఉన్నప్పటికీ దేశంలో అత్యంత సంపన్నులు కేవలం రెండు శాతం మందే ఉన్నారు. ఎగువ మధ్య తరగతి వారిని కూడా సంపన్న వర్గంగానే పరిగణించాలిగానీ వారు మాత్రం తాము సంపన్నులమని ఎప్పుడూ ఒప్పుకోరు. కారణం విద్యార్థుల చదువు కోసం ఎక్కువ వెచ్చించాల్సి రావడం, వద్ధాప్యంలో వైద్య సౌకర్యాల కోసం కూడు పెట్టుకున్న సంపదంతా కరగిపోక తప్పదన్నది వారి ఉద్దేశం. అది నిజం కూడా. ఈ ఎగువ మధ్య తరగతి వారే పొదుపుపరులు కూడా. అమెరికా మొత్తంలో ఒక్కశాతం మందే పొదుపరులు. వారిలో వీరే ఎక్కువ ఉన్నారు. ఏ నెల వచ్చిన జీతాన్ని ఆ నెలలోనే ఖర్చు పెట్టే సంస్కతే అమెరికన్లకు ఎక్కువ.


ముగ్గురు సభ్యులుగల ఓ ఎగువ మధ్య తరగతి కుటుంబం ఏడాదికి లక్ష డాలర్ల నుంచి మూడున్నర లక్షల డాలర్లను సంపాదిస్తుంది. అదే ముగ్గురు సభ్యులుగల మధ్య తరగతి కుటుంబం యాభై వేల డాలర్ల నుంచి లక్ష డాలర్ల వరకు సంపాదిస్తుంది. అదే దిగువ మధ్య తరగతి కుటుంబం ఏడాదికి 30వేల డాలర్ల నుంచి 50 వేల డాలర్లకు సంపాదిస్తుంది. 1979 నుంచి ఎగువ మధ్య తరగతి వారి సంఖ్య పెరుగుతూ రాగా, మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వారి సంఖ్య గణనీయంగా తగ్గుతూ వచ్చింది. అయితే 1980 నుంచి మిలియనీర్ల కొనుగోలు శక్తి పడిపోతూ వచ్చిందనే విషయాన్ని కూడా ఇక్కడ గ్రహించాలి. వారి కొనుగోలు శక్తి ఇప్పుడు మిలియన్‌ డాలర్లు అనుకుంటే 1980లో మూడున్నర లక్షల డాలర్లు ఉండేది.

ఏది ఏమైనా ఓ పక్క ధనికులు, మరోపక్క పేదలు, నిరుద్యోగులు పెరుగుతున్నారంటే ప్రజల మధ్య ఆర్థిక అసమానత్వం మరింత పెరుగుతున్నట్లు లెక్క. మరి అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దీన్ని ఎంతవరకు సరిదిద్దుతారో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement