
'మీ ముందున్న నాకు ప్రాణం పోసింది ఆయనే..'
1998 జూన్ 25న వాషింగ్టన్ స్ట్రీట్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో కనెక్టికట్‌లోని హార్ట్‌ఫోర్డ్‌లో అగ్నిమాపక దళంలో పీటర్ గెట్జ్ అనే వ్యక్తి పెట్రోలింగ్ అధికారిగా పనిచేస్తున్నాడు. రేడియో ద్వారా సమాచారం అందుకున్న ఆయన ఇతర సిబ్బందితో కలిసి అక్కడి చేరుకున్నారు. అనంతరం నేరుగా అగ్నిప్రమాదం చోటు చేసుకున్న భవనంలోకి ఎంతో సాహసంతో వెళ్లి ఐదేళ్ల జోసిబెల్క్ అపోంటే అనే బాలికను రక్షించాడు. ఆ సమయంలో గాయాలతో స్పృహలేకుండా పడిపోయిన ఆ బాలిక దాదాపు చనిపోయిందని అనుకున్నారు. కానీ, ఆ ఆఫీసర్ కారణంగా శరవేగంగా ఆస్పత్రిలో చేర్పించగా తిరిగి ఊపిరిపోసుకుంది. అయితే, ఈ ప్రమాదంలో ఆమె అంకుల్ మాత్రం చనిపోయాడు. అయితే, వారిని అలా వదిలేయకుండా వారికి కావాల్సిన వస్తువుల సేకరణ, డబ్బు సేకరణ చేసిన పీటర్.. వెన్నుదన్నుగా నిలిచి వారిని పంపించారు.

అయితే, ఆమెకు దూరంగానే ఉంటూ ఎప్పటికప్పుడు ఎవరికీ తెలియకుండా ఆ బాలిక యోగక్షేమాలు పరిశీలిస్తుండేవాడు పీటర్. అయితే, కనెక్టికట్‌లోని ఓ యూనివర్సిటీలో చదువుతున్న జోసిబెల్క్ తన గతం తెలిసి ఎలాగైనా ఆయనను కలుసుకోవాలని ఫేస్‌బుక్ ద్వారా తీవ్రంగా శ్రమించింది. ఎట్టకేలకు ఆయనను తెలుసుకొని నేరుగా తాను డిగ్రీ అందుకునే కార్యక్రమానికి ఆహ్వానించింది. డిగ్రీ అందుకునే సమయంలో ఆయన వల్లే తాను నేడు బతికి ఉన్నానంటూ వర్సిటీ సాక్షిగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంది. దీంతో ఆ కార్యక్రమంలో అంతా పీటర్‌ను అభినందిస్తూ చప్పట్ల వర్షం కురిపించారు. ఇప్పుడు వారి రెండు కుటుంబాలు కూడా మంచి సన్నిహితంగా మారాయి.



