లండన్: మార్గరెట్ థాచర్ అనంతరం మరోసారి బ్రిటన్‌కు మహిళా ప్రధాని రావడం ఖాయమైంది. గురువారం నిర్వహించిన కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ పోటీ రెండో రౌండ్‌లో మహిళలైన హోం శాఖ కార్యదర్శి థెరెసా మే, ఇంధన శాఖ మంత్రి ఆండ్రియా లీడ్సమ్‌లు తుది బరిలో నిలిచారు. పురుష అభ్యర్థిగా ఉన్న న్యాయ శాఖ కార్యదర్శి మైఖేల్ గోవ్ కేవలం 46 ఓట్లు సాధించి పోటీ నుంచి వైదొలిగారు. మేకు 199 ఓట్లు, లీడ్సమ్‌కు 84 ఓట్లు దక్కాయి. బ్రెగ్జిట్ ఫలితం అనంతరం ప్రధాని పదవి నుంచి మూడు నెలల్లో వైదొలుగుతున్నట్లు డేవిడ్ కామెరాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మైఖేల్ గోవ్ తప్పుకోవడంతో మే, ఆండ్రియా మధ్య తుది పోరు ఖరారైంది. తుది రౌండ్ ఎన్నికల కోసం వీరిద్దరు తమ ప్రచారాన్ని ఉధృతం చేయనున్నారు. సెప్టెంబర్ 9న విజేతను ప్రకటిస్తారు.