నేలపైనే గాక అంతరిక్షంలోనూ, గురుత్వాకర్షణ శక్తి నామమాత్రంగా ఉండే ప్రదేశంలోనూ కొవ్వొత్తి వెలగడం, ఇతర ఇంధనాలు మండటం జరుగుతుంది. అయితే ఇందుకు తగిన ఆక్సిజన్ మాత్రం తప్పక కావలసి ఉంటుంది. నేలపై కొవ్వొత్తి వెలగడానికి.. అంతరిక్షంలో వెలగడానికి మధ్య కొన్ని స్పష్టమైన తేడాలు ఉంటాయి. నేలపైన వెలిగే కొవ్వొత్తి జ్వాల కోలగా, ఓ పూరెక్క ఆకారంలో ఉంటుంది. కొవ్వొత్తిలో ఇంధనం మండే ప్రదేశం వద్ద గాలి వేడెక్కి పైకి పోవడం వల్ల, అక్కడ ఎప్పటికప్పుడు అల్పపీడనం ఏర్పడటం, దాంతో కొవ్వొత్తి చుట్టూ ఉన్న గాలి ఆ ప్రదేశం వైపు దూసుకుపోవడం వల్ల కొవ్వొత్తి జ్వాల ఎప్పుడూ పైకే వెలుగుతుంటుంది. దీనికి భిన్నంగా అంతరిక్షంలో వెలిగే కొవ్వొత్తి జ్వాల గుండ్రంగా ఉంటుంది.
కేవలం కొవ్వొత్తి జ్వాల మాత్రమే కాదు. గురుత్వాకర్షణ శక్తి నామమాత్రంగానే ఉండే చోట అన్ని రకాల మంటలూ గోళాకృతిలోనే కనిపిస్తాయి. భూమ్యాకర్షణ శక్తికి దూరంగా అంతరిక్షంలో వెలిగించే కొవ్వొత్తి జ్వాల దాదాపుగా మన కంటికి కనిపించని లేత నీలిరంగులో ఉంటుంది. దీని ఉష్ణోగ్రత కూడా చాలా తక్కువగానే ఉంటుంది. నేలపైన కన్నా అంతరిక్షంలో కొవ్వొత్తి చాలా నిదానంగా వెలగడం మరో ప్రత్యేకత. నేలపై సుమారు 10 నిమిషాలు వెలిగే ఓ కొవ్వొత్తి, అంతరిక్షంలో 45 నిమిషాలు తీసుకోవడం విశేషం. ఏదేమైనా అంతరిక్షంలో రకరకాల మంటల గురించి మరిన్ని పరిశోధనలు జరగవలసి ఉందని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment