Gravitational force
-
జీరో గ్రావిటీలో ఫుట్‌బాల్ మ్యాచ్.. గింగిరాలు తిరుగుతూ గోల్ కొట్టిన దిగ్గజం
జీరో గ్రావిటీలో ఉన్నామంటే గాలిలో తేలియాడడం తప్ప ఇంకేం పని చేయలేం. కానీ అదే జీరో గ్రావిటీలో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడి చూపించి గిన్నిస్ రికార్డులకెక్కారు ఏడుగురు ఫుట్‌బాల్ ఆటగాళ్లు. ఈ మ్యాచ్‌లో పోర్చుగీస్ ఫుట్‌బాల్ దిగ్గజం లూయిస్ ఫిగోతో పాటు మిడిల్ఈస్ట్, యూరోప్, లాటిన్ అమెరికాలకు చెందిన మహిళా, పురుషుల ఫుట్‌బాలర్స్ పాల్గొన్నారు. రెడ్ టీమ్‌కు ఫిగో నాయకత్వం వహించగా.. టీమ్ ఎల్లోకు మరొకరు కెప్టెన్సీ వహించారు. కాగా వీరిని ప్రత్యేక విమానంలో సముద్ర మట్టానికి 6,166 మీటర్ల ఎత్తుకు పంపించారు. జీరో గ్రావిటీలోకి వెళ్లాకా విమానం లోపల ఏర్పాటు చేసిన 75 స్క్వేర్ మీటర్ల పిచ్‌పై మ్యాచ్ ఆడారు. కాగా మ్యాచ్‌లో పోర్చుగీస్ దిగ్గజం లూయిస్ ఫిగో కొట్టిన గోల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్నిసార్లు గోల్‌పోస్ట్‌పై దాడి చేసినా ఫిగో గోల్ కొట్టేలేకపోయాడు. అయితే జీరో గ్రావిటీ కావడంతో సైకిల్ తొక్కుతున్నట్లుగా గాల్లో తిరిగిన ఫిగో బంతిని ఎట్టకేలకు గోల్‌పోస్ట్‌కు తరలించాడు. కాగా ఔట్ ఆఫ్ వరల్డ్ పేరిట నిర్వహించిన మ్యాచ్‌లో రెడ్ టీమ్ 2-1 తేడాతో టీమ్ ఎల్లోపై విజయం సాధించింది. కాగా జీరో గ్రావిటీలో తొలిసారి ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడి గిన్నిస్ రికార్డులోనూ స్థానం సంపాదించారు. -
అంతరిక్షంలో కొవ్వొత్తి అంతసేపు వెలుగుతుందా?
నేలపైనే గాక అంతరిక్షంలోనూ, గురుత్వాకర్షణ శక్తి నామమాత్రంగా ఉండే ప్రదేశంలోనూ కొవ్వొత్తి వెలగడం, ఇతర ఇంధనాలు మండటం జరుగుతుంది. అయితే ఇందుకు తగిన ఆక్సిజన్ మాత్రం తప్పక కావలసి ఉంటుంది. నేలపై కొవ్వొత్తి వెలగడానికి.. అంతరిక్షంలో వెలగడానికి మధ్య కొన్ని స్పష్టమైన తేడాలు ఉంటాయి. నేలపైన వెలిగే కొవ్వొత్తి జ్వాల కోలగా, ఓ పూరెక్క ఆకారంలో ఉంటుంది. కొవ్వొత్తిలో ఇంధనం మండే ప్రదేశం వద్ద గాలి వేడెక్కి పైకి పోవడం వల్ల, అక్కడ ఎప్పటికప్పుడు అల్పపీడనం ఏర్పడటం, దాంతో కొవ్వొత్తి చుట్టూ ఉన్న గాలి ఆ ప్రదేశం వైపు దూసుకుపోవడం వల్ల కొవ్వొత్తి జ్వాల ఎప్పుడూ పైకే వెలుగుతుంటుంది. దీనికి భిన్నంగా అంతరిక్షంలో వెలిగే కొవ్వొత్తి జ్వాల గుండ్రంగా ఉంటుంది. కేవలం కొవ్వొత్తి జ్వాల మాత్రమే కాదు. గురుత్వాకర్షణ శక్తి నామమాత్రంగానే ఉండే చోట అన్ని రకాల మంటలూ గోళాకృతిలోనే కనిపిస్తాయి. భూమ్యాకర్షణ శక్తికి దూరంగా అంతరిక్షంలో వెలిగించే కొవ్వొత్తి జ్వాల దాదాపుగా మన కంటికి కనిపించని లేత నీలిరంగులో ఉంటుంది. దీని ఉష్ణోగ్రత కూడా చాలా తక్కువగానే ఉంటుంది. నేలపైన కన్నా అంతరిక్షంలో కొవ్వొత్తి చాలా నిదానంగా వెలగడం మరో ప్రత్యేకత. నేలపై సుమారు 10 నిమిషాలు వెలిగే ఓ కొవ్వొత్తి, అంతరిక్షంలో 45 నిమిషాలు తీసుకోవడం విశేషం. ఏదేమైనా అంతరిక్షంలో రకరకాల మంటల గురించి మరిన్ని పరిశోధనలు జరగవలసి ఉందని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. -
మనిషి బరువు భూమ్మీద ఒకేలా ఉండదు!
కడుపు మాడ్చుకోకుండా.. కసరత్తు చేయకుండా బరువు తగ్గాలనుందా? అయితే, ఎత్తయిన ప్రదేశాలకు వెళ్లిపోండి.. బరువు తగ్గిపోతుంది! ఒకే వ్యక్తి భూమి మీద వివిధ ప్రాంతాల్లో బరువు చూసుకుంటే.. అది వేర్వేరుగా ఉంటుందట. దీనికి కారణం భూమ్యాకర్షణ శక్తిలో ఉండే హెచ్చుతగ్గులేనని ఆస్ట్రేలియాలోని కర్టిన్ యూనివర్సిటీకి చెందిన క్రిస్టియన్ హిర్ట్ తెలిపారు. ఈ మేరకు ఆయన నేతృత్వంలోని పరిశోధకుల బృందం ఓ కొత్త హై రిజల్యూషన్ మ్యాప్‌ను తయారుచేశారు. ఈ ధరణి మీద భూమ్యాకర్షణ అన్ని చోట్లా ఒకేలా ఉంటుందని మనం భావిస్తున్నా.. అది వేర్వేరుగా ఉంటుందని.. ఎందుకంటే భూమి కచ్చితమైన గోళాకార రూపంలో ఉండకపోవడం.. సాంద్రత కూడా ఒకేతీరున ఉండకపోవడం ఇందుకు కారణమని పరిశోధకులు చెబుతున్నారు. ‘ముఖ్యంగా భూమధ్య రేఖ వద్ద భూమ్యాకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది. భూభ్రమణం వల్ల ఉత్పత్తి అయ్యే కేంద్రపరాన్ముఖ శక్తుల వల్ల ఇలా జరుగుతుంది’ అని వీరు పేర్కొన్నారు. భూమధ్యానికి సమీపంలోని ఎత్తై ప్రాంతాల్లోనూ భూమ్యాకర్షణ శక్తి తక్కువగా ఉంటుందని చెప్పారు. వీరు ఉపగ్రహాల నుంచి సేకరించిన భూమ్యాకర్షణ శక్తి సమాచారాన్ని, టోపోగ్రాఫిక్ సమాచారాన్ని కలిపి.. భూమ్యాకర్షణ శక్తిలో మార్పులకు సంబంధించిన అత్యంత స్పష్టమైన హైరిజల్యూషన్ మ్యాప్‌ను రూపొందించారు. ఇందులో మొత్తం 300 కోట్ల పాయింట్లకు సంబంధించిన భూమ్యాకర్షణ శక్తిని గణించారు. ఇందుకోసం సూపర్ కంప్యూటర్ను వినియోగించారు. దీని ప్రకారం పెరూలోని నెవాడో హువాస్కరన్ పర్వతం వద్ద భూమ్యాకర్షణ శక్తి అత్యంత తక్కువగా ఉండగా.. అర్కిటిక్ సముద్రతలంపై అత్యధికంగా ఉంది.