జలపాతం...‘ఛాంగీ’ భళా!
మీకు మయసభ గురించి తెలుసుకదా.. సుందర భవనాంతరమ్మున తటాకాలా? అంటూ ఈ భవనాన్ని చూసి దుర్యోధనుడు ఆశ్చర్యపోవడం మనం సినిమాల్లో చూశాం కూడా. సింగపూర్‌లోని ఛాంగీ విమానాశ్రయాన్ని సందర్శించే వారు కూడా ఇకపై ఇలాగే ముక్కున వేలేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కొత్తగా ఓ జలపాతాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
ఇదేదో చిన్నా చితకా జలపాతం అనుకునేరు. ఏకంగా తొమ్మిది అంతస్తుల ఎత్తుంది. బటర్‌ఫ్లై పార్క్, 24 గంటల సినిమాహాల్స్, స్పాలతో విమానాశ్రయానికి కొత్త అర్థాన్ని చెప్పిన ఛాంగీ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ‘రెయిన్ వర్టెక్స్’ జలపాతం సరికొత్త ఆకర్షణగా నిలుస్తోంది. ‘వెట్’ అనే సంస్థ దీని కోసం విమానాశ్రయపు అద్దాల పైకప్పులో భారీ కన్నం చేసింది. తొమ్మిది అంతస్తుల పైనుంచి పడే నీరు గ్రౌండ్ లెవెల్‌లో ఉండే పెద్ద పూల్‌లోకి పడతాయి. జలపాతానికి ఎల్‌ఈడీ రంగుల హంగులు కూడా జోడించారు.
అసలైన వాటర్‌ఫాల్‌ను నిర్మించేందుకు ముందుగా ‘వెట్’ ఇంజినీర్లు ముందుగా ఒక స్కేల్ మోడల్‌ను నిర్మించి గాలి పీడనం తదితర అంశాలను అర్థం చేసుకున్నారు. సాధారణ జలపాతం మాదిరిగా నీరు చెల్లాచెదరు కాకుండా అన్ని సమయాల్లోనూ ఒకేచోట పడేలా జాగ్రత్త తీసుకున్నారు. విమానాశ్రయం పైభాగం నుంచి సేకరించే వర్షపునీటితోనే ఈ వాటర్‌ఫాల్ నడవడం మరో విశేషం. భారీ వర్షాలు పడినప్పుడు ఈ జలపాతం ద్వారా నిమిషానికి దాదాపు 40,000 లీటర్ల నీరు జాలువారుతూంటుందని అంచనా.