ప్రియమైన జేమ్స్ వెబ్ టెలిస్కోప్..
రెండేళ్లలో నువ్వు ఆకాశంలోకి చేరాక అన్నీ మారిపోతాయి. మనుషులు ఎక్కడి నుంచి వచ్చారన్నది స్పష్టమవుతుంది. భవిష్యత్తులో ఏయే గ్రహాలపై నివసిస్తారో తెలిసే చాన్సుంది. నిజానికి మేం నీ కోసం చాలా ఏళ్లుగా వేచి చూస్తున్నాం. 2007లో తొలిసారి నిన్ను ప్రయోగిస్తారని విన్నాం. కానీ కొంత ఎదురుచూపు తప్పలేదు. ఏమైతేనేం.. 2021 మార్చికల్లా నువ్వు 25 అడుగుల పొడవైన బంగారు అద్దంతో ఐదు పొరల సూర్యరక్షణ కవచంతో దర్శనమిస్తే అది అద్భుతంగానే ఉంటుంది. నీక్కొంచెం కష్టం కావచ్చుగానీ.. భూమికి 10 లక్షల మైళ్ల దూరంలో కుదురుకుంటావనే ఆశిస్తున్నాం. అక్కడి నుంచి నీ చూపులు విశ్వం మొత్తం ప్రసరించనున్నాయి. మేమెవెవ్వరం చూడని, చూడలేని లోకాలను నీ కళ్లు చూడనున్నాయి.
సాంకేతిక అద్భుతం నువ్వు..
జేమ్స్ వెబ్ టెలిస్కోప్.. నువ్వో సాంకేతిక అద్భుతమనడంలో అతిశయోక్తి లేదు. సూర్యుడి నుంచి నిన్ను రక్షించేందుకు ఉద్దేశించిన ఐదు పొరల రక్షణ కవచం కోసం ఏకంగా ప్రత్యేక పదార్థాన్ని తయారు చేయాల్సి వచ్చింది. ఎల్2 లాంగ్రేంజ్ పాయింట్‌లో కుదురుగా తిరిగేందుకు ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ సిద్ధం చేశాం. ఫ్రెంచ్ గయానా అంతరిక్ష కేంద్రం నుంచి నువ్వు నింగికెగసే సమయానికి బంగారు అద్దం, రక్షణ కవచం ఎంచక్కా ఏరియన్ 5 రాకెట్‌లో ఒదిగిపోతాయి. కక్ష్యలోకి చేరాక ఇవన్నీ వారం రోజుల్లో నెమ్మదిగా విచ్చుకుంటాయిలే! అప్పటి నుంచే మాకు ఈ విశ్వం గురించి బోలెడన్ని విషయాలు తెలుస్తాయి. ఈగల్స్ నెబ్యులాలోని సృష్టి స్తంభాల రహస్యాలతో పాటు మన సౌర కుటుంబంలోని వాటి గురించి కొత్త విషయలు తెలియనున్నాయి.
కొత్త లోకాలపైనే ఆసక్తి..
నీ పనిపై నాకు అమితాసక్తి పెంచేది ఏంటో తెలుసా? భూమికి అవతల ఇంకా ఎన్ని భూమిలాంటి గ్రహాలున్నాయో నువ్వు చెబుతావన్న విషయం. అలాగని సౌరకుటుంబంలోని గ్రహాలపై నాకు చిన్నచూపేమీ లేదుగానీ.. ఎక్కడో దూరంగా ఉండే ఇంకో సూర్యుడి వెలుగు నాలో ఆసక్తి పెంచుతోందంతే. ఆకాశంలో రెండు సూర్యుళ్లు ఉండే గ్రహాలు.. లేదా సూర్యుడు అటూ ఇటూ కదలకుండా ఒకే చోట ఉండే గ్రహాలు... రోజంతా ఇంధ్రధనుస్సులాంటి రంగులు వెదజల్లే సూర్యుడు ఉండే గ్రహాలు.. అబ్బో తలచుకుంటేనే ఒళ్లు పులకరిస్తోంది. తన చుట్టూ తిరిగే గ్రహాల వాతావరణంలోకి సూర్యుడి కాంతి ఎలా చేరుతుందో నిశితంగా పరిశీలిస్తే అక్కడ ఎలాంటి రసాయనాలున్నాయన్నది నీవు కనిపెట్టగలవు. ఆయా గ్రహాల్లో నీరు ఉంటే నీ పరారుణ కాంతి కెమెరా కంటిని అవి తప్పించుకోలేవు. కార్బన్‌డయాక్సైడ్, మీథేన్ వంటి వాయువులు బోలెడున్న గ్రహాల్లోని గ్రహాంతర జీవరాశులను గుర్తించిన తొలి టెలిస్కోపు నువ్వే అవుతావా? అచ్చం మన భూమి మాదిరిగానే ఉండే గ్రహాన్ని నువ్వే గుర్తించి మాకు చెబుతావా..? ఈ విశాల విశ్వంలో కాంతి సంవత్సరాల దూరంలో మనిషికి ఇంకో ఇల్లు ఉందని నీ ద్వారానే మాకు తెలుస్తుందా..?
ఎప్పటికైనా ఇలాంటి మరో ప్రపంచాన్ని చేరాలనుకున్న మా ఆశలు సజీవంగా ఉంచేది నీవే. ఎప్పుడెప్పుడు నింగికెగురుతావా అని వేయి కళ్లతో ఎదురుచూస్తూ..
నువ్వంటే ఆశ్చర్యపడుతూ..
సైన్స్ ఫిక్షన్ రచయిత చార్లీ జేన్ ఆండర్స్.. ఇంకో రెండేళ్లలో ప్రయోగించనున్న జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌కు ఓ ఉత్తరం రాస్తే ఎలా ఉంటుందనే ఆలోచనకు ప్రతిరూపం ఈ లేఖ. లక్షల మైళ్ల అవతల అంతరిక్షంలో ఉంటూ ఇప్పటివరకూ విశ్వగవాక్షంగా పనిచేసిన హబుల్ టెలిస్కోపు స్థానాన్ని జేమ్స్ వెబ్ త్వరలో భర్తీ చేయనుంది.
– నేషనల్ జియోగ్రాఫిక్‌తో ప్రత్యేక ఏర్పాటు
ఇదో రకం ప్రేమ లేఖ!
Published Fri, Aug 16 2019 4:23 AM | Last Updated on Fri, Aug 16 2019 11:20 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment