
చాక్లెట్‌తో షుగర్‌కు చెక్!
మధుమేహం ఉన్నవారు తీయని పదార్థాలకు కచ్చితంగా దూరంగా ఉండాలి. ఒకవేళ చాక్లెటో, స్వీటో తింటే వారిలో షుగర్ లెవల్స్ అమాంతం పెరిగిపోతాయి. కానీ రోజూ ఓ చాక్లెట్ తింటే షుగర్ వ్యాధి రాదని చెబుతున్నారు పరిశోధకులు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా శాస్త్రీయంగా దీనిని నిరూపించారు కూడా. రోజూ ఓ చాక్లెట్ తీసుకుంటే టైప్ టూ డయాబెటిస్ రాకుండా అడ్డుకోవచ్చని, చాక్లెట్‌లో ఉండే కొకోవా అనే పదార్థం శరీరం ఇన్సులిన్‌ను ఎక్కువగా విడుదల చేసేందుకు దోహదపడుతుందని చెబుతున్నారు.
రక్తంలో గ్లూకోజ్ పరిమాణం పెరుగుదలకు దీటుగా స్పందిస్తుందని బ్రిగ్‌హామ్ యంగ్ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసేందుకు దోహదపడే బీటా కణాలు మెరుగ్గా పనిచేసేందుకు ప్రేరేపించే పదార్థాలు కొకోవాలో పుష్కలంగా ఉన్నట్లు జర్నల్ ఆఫ్ న్యూట్రిషనల్ బయోకెమిస్ట్రీలో ప్రచురితమైన ఓ అధ్యయనం కూడా వెల్లడించింది. ఒత్తిడిని నియంత్రించి కణాలకు పునరుత్తేజం కల్పించే గుణం కూడా చాక్లెట్లలో ఉందని, కొకోవాపై దశాబ్దకాలంగా ఎన్నో పరిశోధనలు జరిగినా దీని ఉపయోగంపై నిర్దిష్ట ప్రయోజనాలను విశ్లేషిస్తూ సాగిన అధ్యయనం ఇదేనని పరిశోధకులు చెబుతున్నారు.