వాహనాలు లేని నగరాలు.. | Cities That Are Starting To Go car-Free | Sakshi
Sakshi News home page

వాహనాలు లేని నగరాలు..

Published Mon, Feb 8 2016 9:51 AM | Last Updated on Sun, Sep 3 2017 5:11 PM

Cities That Are Starting To Go car-Free

వెనిస్..

ఇటలీకి చెందిన వెనిస్ నగరం పర్యాటకంగా చాలా ప్రసిద్ధి చెందింది. 117 చిన్నచిన్న దీవుల సముదాయంగా ఈ నగరం ఏర్పడింది. చుట్టూ నీళ్లే ఉంటాయి కాబట్టి ఇక్కడ సంప్రదాయ వాహనాలకు చోటులేదు. దీవులన్నీ ఒకదానికొకటి చిన్నచిన్న కాలువల ద్వారా కలిపి ఉంటాయి. ఒక దీవి నుంచి మరో దీవికి వెళ్లాలంటే పడవలే మార్గం. లేదా కాలువలపై నిర్మించిన బ్రిడ్జిల ద్వారా  వెళ్లాల్సి ఉంటుంది. ప్రజా రవాణా వాహనాలుగా వాటర్ బస్‌లనే వినియోగిస్తారు. కార్లు, బైక్‌లు వంటి వ్యక్తిగత వాహనలు వినియోగించే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ ప్రతి ఇంటికో పడవ ఉంటుంది.
 
20వ శతాబ్దం ప్రారంభంలో ఎక్కువ నగరాలు కార్ ఫ్రీ సిటీస్‌గానే ఉండేవి. బస్సు, ట్రక్కులవంటి వాహనాలూ తక్కువ సంఖ్యలోనే కనిపించేవి. ప్రస్తుతం నగరాల్లోని వీధులన్నీ కార్లు, బైక్‌లు, ఇతర వాహనాలతో నిండిపోయాయి. కానీ ఇలాంటి కాలంలో కూడా ఈ తరహా సంప్రదాయ వాహనాలు లేని నగరాలున్నాయి. కాలుష్యకారక వాహనాల వినియోగం లేని అలాంటి నగరాల గురించి తెలుసుకుందాం..
 
మ్యాకినాక్ ఐలాండ్..

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని మిచిగాన్‌కు సమీపంలో ఉన్న చిన్న దీవి మ్యాకినాక్. పర్యాటకుల్ని విపరీతంగా ఆకర్షించే ఈ దీవిలో 492 మంది మాత్రమే నివసిస్తారు. అయితే వేసవిలో మాత్రం వేల మంది పర్యాటకులు ఈ దీవిని సందర్శిస్తారు. 1898లోనే ఈ నగరంలో యంత్రాల ఆధారంగా నడిచే వాహనాల్ని నిషేధించారు. కాలుష్యపరంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉండడంతో అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక అప్పటినుంచి నేటివరకు ఆ దీవిలో ఎలాంటి కాలుష్యకారక వాహనాల్ని వినియోగించడం లేదు. దీవిలో ప్రయాణానికి సైకిళ్లు, గుర్రపు బండ్లు మాత్రమే వాడుతున్నారు. సందర్శకులెవరైనా దీవిలో ప్రయాణించాలంటే సైకిళ్లను అద్దెకు తీసుకోవాల్సిందే.

హైడ్రా, గ్రీస్..

 ప్రసిద్ధ గ్రీక్ ఐలాండ్స్‌లో హైడ్రా ఒకటి. ఈ దీవిలో చిన్నచిన్న పట్టణాలు చాలా ఉన్నాయి. పర్వతాల మధ్య పెద్దపెద్ద రాళ్లపై ఇక్కడి హైడ్రాపోర్ట్ అనే నగరం పలు పర్యాటక ప్రదేశాలతో కూడి ఉంది. మూడు వేలలోపే జనాభా కలిగిన ఈ దీవిలో సంప్రదాయ వాహనాలు పూర్తిగా నిషేధం. చెత్తను తీసుకెళ్లేందుకు మాత్రమే కొన్ని ట్రక్కులను వినియోగిస్తుంటారు. అంతకుమించి ఎలాంటి కార్లు, బైక్‌లు, ఇతర కాలుష్యకారక వాహనాలు కనిపించవు. గాడిదలు, గుర్రాలు, సైకిళ్లను మాత్రమే రవాణాకి ఉపయోగిస్తారు. వీటితోపాటు వాటర్ ట్యాక్సీలను ప్రజా రవాణా వాహనాలుగా వినియోగిస్తున్నారు.

లా క్యుంబ్రెసిటా..

అర్జెంటినాలోని చిన్న పట్టణం లా క్యుంబ్రెసిటా. 350 మంది జనాభా కలిగిన ఈ చిన్న పట్టణం పర్యాటకంగా ప్రసిద్ధి చెందింది. ఈ పట్టణం 15వ శతాబ్దంలోని జర్మన్ పట్టణాలను పోలి ఉంటుందని పర్యాటకులు భావిస్తారు. 1996లో లా క్యుంబ్రెసిటాను పాదచారుల పట్టణంగా ప్రకటించారు. అంటే ఎలాంటి వాహనాల్ని పట్టణం లోపలికి అనుమతించరు. ఎవరైనా నగరాన్ని సందర్శించాలనుకుంటే తమ వాహనాల్ని పట్టణ ముఖద్వారం దగ్గరే నిలిపివేయాలి. కాలి నడకన మాత్రమే నగరాన్ని సందర్శించాల్సి ఉంటుంది.

ఫెస్ అల్ బాలి..

మొరాకోలోని మూడో పెద్ద నగరం ఫెస్ అల్ బాలి (ఫెస్). ఈ నగరంలో కూడా ఎలాంటి కార్లను అనుమతించరు. ప్రపంచంలో అతిపెద్ద కార్ ఫ్రీ నగరంగా ఫెస్ అల్ బాలికి గుర్తింపు ఉంది. ఇక్కడ దాదాపు 1,56,000కు పైగా జనాభా నివసిస్తున్నారు. ఇంత మంది ఉన్నప్పటికీ ప్రైవేటు వాహనాలను వినియోగించే అవకాశం లేదు. నగరంలోని వీధులన్నీ చాలా చిన్నవిగా ఉంటాయి. అందువల్ల కాలి నడకన మాత్రమే మరో చోటికి వెళ్లాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల మాత్రమే బైక్‌లను వినియోగించుకునే అవకాశం ఉంది.

ఫైర్ ఐలాండ్..

న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్‌కు సమీపంలో ఉన్న మరో దీవి ఫైర్ ఐలాండ్. 300 మాత్రమే జనాభా ఉన్న దీవిలోకి వేసవిలో వేల మంది పర్యాటకులు వస్తుంటారు. ఈ దీవి పొడవు 50 కిలోమీటర్లు ఉన్నప్పటికీ చాలా ఇరుకుగా 400 మీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. వెడల్పు తక్కువగా ఉండడంతో ఈ దీవిలో కూడా సంప్రదాయ యంత్ర ఆధారిత వాహనాల్ని అనుమతించరు. కొన్ని అత్యవసర వాహనాలు, నిర్మాణ సామగ్రిని తీసుకెళ్లే వాహనాలు మాత్రమే పరిమితంగా తిరుగుతుంటాయి. అందరూ కాలినడకన లేదా సైకిళ్లను వినియోగించి మాత్రమే ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్లాల్సి ఉంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement