ఎత్తు తగ్గించి.. స్పీడు పెంచి.. కూల్చేశాడు!!
జర్మన్ వింగ్స్ విమానాన్ని కూల్చేసి.. తనతో పాటు మరో 149 మంది ప్రాణాలను బలిగొన్న కో-పైలట్ లుబిట్జ్ ఎంత కుట్రపూరితంగా విమానాన్ని కూల్చేశాడో రెండో బ్లాక్ బాక్స్ వెల్లడించింది. అతగాడు కావాలని ఆటోపైలట్ మోడ్ ఆన్ చేసి, విమానం ఎగిరే ఎత్తు తగ్గించి.. వేగం విపరీతంగా పెంచేసి దాన్ని కూల్చడానికి ప్రయత్నం చేసినట్లు రెండో బ్లాక్ బాక్స్లోని ఫ్లైట్ డేటా రికార్డర్ తెలిపింది. ఈ విషయాన్ని ఫ్రెంచి బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఎనాలసిస్ సంస్థ శుక్రవారం వెల్లడించింది.
రెండో బ్లాక్ బాక్స్లో ప్రధానంగా విమానానికి సంబంధించిన సాంకేతిక సమాచారం ఉంటుంది. దాన్ని విశ్లేషించినప్పుడు ఈ విభ్రాంతికర వాస్తవాలు వెల్లడయ్యాయి. పైలట్ బయటకు వెళ్లిన సమయం చూసి కో-పైలట్ ఆండ్రియాస్ లూబిట్జ్ ముందుగా విమానాన్ని ఆటో పైలట్ మోడ్లోకి మార్చాడు. తర్వాత దాని సెట్టింగ్స్ మార్చి, బాగా కిందకు దించి.. వెంటనే వేగాన్ని పెంచాడు. ఆ సమయంలో విమానం కేవలం 100 అడుగుల ఎత్తులోనే వెళ్తోంది. మొత్తం 25 గంటల సాంకేతిక వివరాలను ఈ రెండో బ్లాక్ బాక్స్ రికార్డు చేసింది. ఇందులో విమాన వేగం, ఎత్తు, పైలట్ మోడ్ ఏంటన్నవన్నీ ఉంటాయి.