ప్రపంచంలో ఏ దగ్గుమందూ పనిచేయదు
లండన్: నేడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కాఫ్ సిరప్ (దగ్గుమందు)లు అందుబాటులో ఉన్నాయి. ఓ మోస్తరు దగ్గు వచ్చినా, ఊపరి సలపని దగ్గు వచ్చినా డాక్టర్ దగ్గరకు వెళతాం. ఏ డాక్టరైనా యాంటీ బయాటిక్స్‌తోపాటు ఏదో కాఫ్ సిరప్ రాసిస్తారు. కాఫ్ సిరప్ తాగితే గానీ రోగులకు సంతృప్తి ఉండదు. వాస్తవానికి ఏ కాఫ్ సిరప్ పని చేయదట. అది ఒట్టి భ్రమ మాత్రమేనని బ్రిటన్‌కు చెందిన వైద్య నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఒక్క బ్రిటన్‌లోనే ఏడాదికి నాలుగువేల కోట్ల రూపాయలను దగ్గు మందుల కోసం ఖర్చు పెడుతున్నారట.
ఒక్క దగ్గుమందే కాదు. ఎముకలు గట్టిపడేందుకు తీసుకునే కాల్షియం మాత్రలు, రక్తంలో చెడు కొలస్ట్రాల్ లేదా ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గించేందుకు తీసుకునే ఒమేగా త్రీ (మంచి ఫ్యాట్) చేప నూనె మాత్రలు, చెవి నొప్పికి వాడే యాంటీబయాటిక్స్, లయ తప్పిన గుండెకు తీసుకునే ఆస్ప్రిన్ మాత్రలు, వెన్ను నొప్పి, మొకాలి నొప్పులకు తీసుకునే పారాసిటమాల్ ట్యాబ్లెట్లు, చెడు కొలస్ట్రాల్ లేదా ఎల్‌డీఎల్ తగ్గేంచేందుకు వాడే స్టాటిన్స్, వెన్నునొప్పికి ఇచ్చే ఆక్యుపంక్చర్ చికిత్స ఇవి ఏవీ కూడా ఫలితం ఇవ్వవని, ఇవి కేవలం రోగుల భ్రమ, డాక్టర్ల అపోహ మాత్రమేనని వైద్య నిపుణులు అంటున్నారు.
డెక్స్‌ట్రోమెథార్ఫాన్ లేని ఏ దగ్గు మందు కూడా పనిచేయదని, దగ్గును తగ్గించలేదని హల్ యూనివర్సిటీలోని రెస్పిరేటరీ నిపుణుడు ప్రొఫెసర్ అలిన్ మొరైస్ తెలిపారు. డెక్స్‌ట్రోమెథార్ఫాన్ ఉన్న దగ్గుమందును కూడా 60 మిల్లీ గ్రాములను డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు కనక అది కూడా పనిచేయదని ఆయన అంటున్నారు. ఎక్కువ మోతాదులో అంటే పావు సీసా తాగితే గానీ అది పనిచేయదట. తాను ఐదువేల మంది రోగులపై జరిపిన ఔషధ ప్రయోగంలో ఈ విషయం తేలిందని ఆయన చెబుతున్నారు. వైరస్ వల్ల వచ్చే దగ్గు దానంతట అదే తగ్గిపోతుందని, బ్యాక్టీరియా వల్ల వచ్చే దగ్గు యాంటీబయాటిక్స్ వల్ల తగ్గిపోతుందని ఆయన అంటున్నారు.
కాల్షియం మాత్రల వల్ల ఎముకలు గట్టిపడ్డాయనడానికి ఇంతవరకు ఎలాంటి ఆధారాలు లేవని లండన్‌లోని లీడ్స్ టీచింగ్ ఆస్పత్రిలో కార్డియోలజిస్ట్‌గా పనిచేస్తున్న క్లాస్ విట్టీ చెబుతున్నారు. పాలు, వెన్న రూపంలో వచ్చే కాల్షియం శరీర అవసరాలకు సరిపోతుందని ఆయన అంటున్నారు. నడుము నొప్పికి ఆక్యుపంక్చర్ చికిత్స పనిచేయదని సౌత్‌ఆంప్టన్ యూనివర్శిటీలో హెల్త్ రిసర్చర్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్ జార్జి లెవిత్ చెబుతున్నారు. గుండె జబ్బులకు ఇచ్చే ఒమకార్ (ఒమేగా 3 ఫిష్ ఆయిల్) లాంటి మందులు పనిచేయవని లండన్ బ్రిడ్జ్ ఆస్పత్రిలో కన్సల్టెంట్ కార్డియోలజిస్ట్‌గా పనిచేస్తున్న సందీప్ పటేల్ తెలియజేస్తున్నారు.
పదేళ్ల వయస్సు పిల్లల్లో ప్రతి నలుగురికి ఒకరికి చొప్పున చెవి పోటు వస్తుందని, ప్రతి ముగ్గురిలో ఇద్దరికి డాక్టర్లు యాంటీబయాటిక్స్‌ను సూచిస్తారని, వాస్తవానికి వైరస్ వల్ల చెవిపోటు వస్తుంది కనుక యాంటీబయాటిక్స్ డోస్ సరిపోదని బ్రిటన్ ఈఎన్‌టీ స్పెషలిస్టుల అధ్యక్షుడు టోని నెరులా తెలియజేస్తున్నారు. వైరస్ వల్ల వచ్చే చెవిపోటు ఎలాంటి మందులు వాడనవసరం లేకుండానే 48 గంటల్లో దానంతట అదే తగ్గిపోతుందని ఆయన చెబుతున్నారు. ఓ మోస్తరు మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు వాడే ఏ యాంటీడిప్రెషన్ మందులు పనిచేయవని లండన్ యూనివర్శిటీ కాలేజ్ అధ్యాపకుడు, పలు క్లినికల్ పత్రాల రచయిత జోన్న మాంక్రిఫ్ చెబుతున్నారు. ఇది కేవలం అపోహ మాత్రమేనని ఆయన అంటున్నారు. ఇన్ని జబ్బులకు వాడే మందుల వల్ల ప్రయోజనం లేదని, తగ్గుతుందనుకోవడం ఒట్టి భ్రమేనని వైద్య నిపుణులు చెబుతున్నా.. వీటి వాడకం ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే అంతా మార్కెట్ మాయాజలం.