
దీపావళికి సెలవివ్వని మేయర్
వాషింగ్టన్: న్యూయార్క్ నగర మేయర్ డి బ్లాసియో ఒక ప్రకటనతో హిందువుల ఆగ్రహానికి గురయ్యారు. గత మంగళవారం ప్రభుత్వం ప్రకటించిన సెలవుల జాబితాలో దీపావళి పండుగ లేకపోవడంతో స్థానిక హిందువులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ముస్లింల పండుగలైన ఈద్ - ఉల్- ఫితర్, ఈద్ అల్- అదా లను ప్రభుత్వ సెలవుల జాబితాలో చేర్చిన అధికారులు దీపావళి పండుగను మాత్రం చేర్చలేదు. దీనిపై హిందూ అమెరికన్ ఫౌండేషన్ విచారం వ్యక్తం చేసింది. వేలాదిగా ఉన్న హిందువులు, జైనులు, సిక్కులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే దీపావళి పండుగను సెలవుల జాబితాలో చేర్చక పోవడం విచారకరమని ఫౌండేషన్ సీనియర్ డైరెక్టర్ షీతల్ షా అన్నారు. 40 సంస్థలతో మేయర్ ను కలిశామని, దీపావళికి సెలవు ప్రకటించాలని కోరామని తెలిపారు.
స్థానిక గణేష్ టెంపుల్ ప్రెసిడెంట్ ఉమ మైసోర్కర్ దీనిపై స్పందిస్తూ... సిటీలోని కుటుంబాలు ఒకచోట చేరి సంబరంగా చేసుకొనే పెద్ద పండుగ దీపావళి అన్నారు. సెలవు లేదని పిల్లలు అంతగా బాధ పడాల్సిన అవసరం లేదన్నారు. తమ నమ్మకాలకంటే స్కూలు, పరీక్షలు ముఖ్యం కాదన్నారు. న్యూయార్క్ సిటీలో ముస్లిం పండుగలకు సెలవులను ప్రతిపాదించిన కాంగ్రెస్ విమెన్ గ్రేస్ మెంగ్ మేయర్ నిర్ణయాన్ని అభినందిస్తూనే.. దీపావళి పండుగను కూడా ఆ జాబితాలో చేర్చాలని ఆశించారు.