అట్లాంట : ఆ కుక్క పిల్లకు ఎదురైన కష్టం అలవాటుగా మారింది. అదే దాన్ని అన్ని కుక్కలకంటే భిన్నమైనదాన్ని చేసింది. నిలబడితే తప్ప నిద్రపోలేని స్థితికి తీసుకొచ్చింది. వివరాల్లోకి వెళితే.. జార్జియాకు చెందిన మెలిసా లెంజ్ అనే మహిళ కొద్ది రోజుల క్రితం ధీన స్థితిలో ఉన్న కొన్ని కుక్కపిల్లలను రక్షించి వాటిని సంరక్షణా నిలయానికి పంపించేసింది. అందులో ముద్దుగా ఉన్న ఓ కుక్కపిల్లను ఇంటికి తెచ్చుకుని పెంచుకుంటోంది. దానికి జార్డన్ నైట్ అని పేరు కూడా పెట్టింది. ఒక రోజు నిలబడి అటూ ఇటూ తూలుతూ ఉన్న జార్డన్‌ను దగ్గరకు వెళ్లి చూసింది.
అది నిలబడి నిద్రపోతోందని తెలిసి ఆశ్చర్యపోయింది. తరుచూ అది అలాగే చేస్తుంటే ఎందుకని ఆరాతీసింది. గతంలో అది ఉన్న కుక్కల బోనులో ఎక్కువ కుక్కలను ఉంచటం కారణంగా నిద్రపోవటానికి స్థలం ఉండేది కాదు. చలి, బోనులో రోత కారణంగా నిలబడి నిద్రపోవాల్సి వచ్చేది. ఇక అక్కడినుంచి బయటకు వచ్చినా నిలబడి నిద్రపోవటం అలవాటుగా మారింది. ఈ విషయం తెలుసుకున్న మెలిసా కంట నీళ్లు తిరిగాయి. దాన్ని ఎలాగైనా కిందపడుకునే విధంగా చేయాలని ప్రయత్నించి విఫలమైంది. జార్డన్ మామూలు సమయాల్లో క్రిందకూర్చున్నా, నిద్రపోవటానికి మాత్రం నిలబడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment