బుల్లెట్ల రోబో.. పిజ్జాబాయ్గా వస్తే..!
ఆస్ట్రేలియా: అది యుద్ధ రంగంలో బుల్లెట్ల వర్షం కురింపించే రోబో. శత్రుసేనలకు దాన్ని చూస్తేనే వణుకుపుడుతుంది. అలాంటి రోబో ఇప్పుడు ఆస్ట్రేలియాలో వీధివీధిన విహరిస్తోంది. దీన్ని ప్రారంభంలో చూసిన వారంతా హడలెత్తిపోయారు. ఇంకొందరైతే ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఎందుకంటే ఇప్పుడు ఆ రోబో చేస్తుంది బాంబులు వేసే పని కాదు.. పిజ్జా డెలివరీ పని. అవును.. ఆస్ట్రేలియాలోని ప్రముఖ పిజ్జా డెలివరీ సంస్థ ప్రపంచంలోనే తొలిసారి రోబోట్ల ద్వారా పిజ్జా డెలివరీ చేసే విధానాన్ని ప్రారంభించింది.
ఇందుకోసం యుద్ధభూమిలో పనిచేసేందుకు రోబోలు తయారు చేస్తున్న మారథాన్ రోబోటిక్స్ సంస్థతో కలిసి ఆరు నెలలుగా పనిచేస్తోంది. ఈ రోబోలో టార్గెట్ ను చేధించేందుకు ఉపయోగపడే లేజర్ టేక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ పని విజయవంతం కావడంతో ఇప్పుడు అధికారికంగా పిజ్జా డెలివరీ సర్వీసులు వేగవంతం చేసింది.
నాలుగు చక్రాలతో గంటకు 20 కిలోమీటర్లు వెళ్లగలిగే ఈ రోబోను లేజర్ టెక్నాలజీతో ఆపరేట్ చేస్తారు. తనను తానే స్వయంగా నియంత్రించుకోవడంతోపాటు ఆర్డర్ ఇచ్చిన పిజ్జా వేడి చల్లారకుండా లోపల్ హాట్ బాక్స్ లాంటి పరికరాన్ని కలిగి ఉంటుంది. ఇప్పటికే పలువురికి పిజ్జా డెలివరీలు చేస్తూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. ఈ వినూత్న కార్యక్రమం ద్వారా డోమినో సంస్థ ప్రపంచంలోనే తొలిసారి రోబోల ద్వారా పిజ్జా డెలివరీ ప్రారంభించిన చర్యగా అవతరించింది.